సాక్షి, హైదరాబాద్: కరోనా సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మరింత రక్షణ చేకూరుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని, టీకా తీసుకున్నాక మళ్లీ కోవిడ్ వచ్చినా పెద్దగా ప్రమాదమేమీ లేకుండా బయటపడొచ్చని స్పష్టం చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేసిన పరిశీలనలో వ్యాక్సిన్ ప్రయోజనాలను గుర్తించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో క్రిటికల్ కేర్ విభాగాధిపతి కిరణ్ మాదల, రేడియాలజీ విభాగాధిపతి మధుసూదన్, రేడియాలజీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంతోష్ తదితరుల బృందం ఈ పరిశీలన నిర్వహించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో సివియారిటీ స్వల్పంగా ఉందని, తీసుకోని వారిలో సగం మంది వరకు ఇబ్బందిపడ్డారని వారు గుర్తించారు.
పరిశోధన సాగిందిలా..
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏప్రిల్ ఒకటి నుంచి 26వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 206 మందిని ఎంపిక చేసి పరిశోధన చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. వ్యాక్సిన్ తీసుకోకుండా కోవిడ్ బారినపడిన 180 మంది ఒక గ్రూప్‌గా.. 26 మంది కోవి షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు (ఈ 26 మంది 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 2 వారాల తర్వాత వైరస్ బారినపడ్డవారు) మరో గ్రూప్‌గా ఉన్నారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి, వైరస్‌తో నెలకొన్న పరిణామాలపై వైద్య బృందం నెలరోజుల పాటు నిశితంగా అధ్యయనం చేసింది. పరిశీలనకు తీసుకున్న వారిలో సగటు వయసు 50 ఏళ్లుకాగా.. కనిష్ట, గరిష్ట వయసు 28–80 సంవత్సరాలుగా ఉన్నాయి.
అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురణ
నిజామాబాద్ వైద్య కళాశాల బృందం చేసిన పరిశోధన నివేదికను ప్రఖ్యాత ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ రీసెర్చ్‌లో ఈ వారం ముద్రించారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో లాభాలపై మరింతగా లోతైన పరిశోధనలు కొనసాగుతున్నాయని డాక్టర్ కిరణ్ మాదల తెలిపారు.
ఎవరి పరిస్థితి ఏమిటి?
- వ్యాక్సిన్ తీసుకున్న 26 మందిలో ఎలాంటి దుష్ప్ర భావాలు తలెత్తలేదు. 26 మందికి సీటీ స్కాన్ తీయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే సీటీ పాజిటివ్ వచ్చింది. మిగతా 23 మందిలో నెగిటివ్‌గా వచ్చింది. అంటే ఆ ముగ్గురికి మాత్రమే ఊపిరితిత్తుల వరకు ఇన్ఫెక్షన్ వెళ్లింది. మిగతావారిలో వెళ్లలేదు. వీరిలో సీటీ సివియారిటీ స్కోర్ 0.8లోపే ఉంది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకున్నారు.
- వ్యాక్సిన్ తీసుకోని 180 మందిలో వైరస్ వ్యాప్తి మూడు రకాలుగా ఉంది. 40 మందిలో మైల్డ్‌గా, 70 మందిలో మోడరేట్‌గా, 50 మందిలో సివియర్‌గా ఉన్నట్లు గుర్తించారు. 89 శాతం మందిలో సీటీ స్కాన్ లో ఇన్‌ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది.
- వ్యాక్సిన్ తీసుకోని వారిలో దాదాపు 120 మందికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పెద్దగా ఇన్‌ఫెక్షన్ లేదు.
- వ్యాక్సిన్ తీసుకోని 180 మందిలో 85 మందికి ఆక్సిజన్ బెడ్‌పై చికిత్స అందించాల్సి వచ్చింది. ఇందులో కొందరిని ఐసీయూకు తరలించి, చికిత్స చేశారు. కాగా.. ఈ పరిశీలనలో పూర్తిగా సీరియస్ అయి చనిపోయినవారిని పరిగణనలోకి తీసుకోలేదు.
చదవండి: ఏపీలో 103, తెలంగాణలో 123
Comments
Please login to add a commentAdd a comment