వివిధ వయస్సుల వారీగా కరోనా కేసులు (శాతాల్లో)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 90 వేల మంది (13.5 శాతం)కి పైగా 20 ఏళ్లలోపు వారు ఉన్నారు. అందులో 20 వేల మంది వరకు 10 ఏళ్లలోపు వారు ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం నాటికి తెలంగాణలో 6,70,543 కేసులు నమోదు కాగా, అందులో 90,561 మంది 20 ఏళ్లలోపు యువతీ యువకులని పేర్కొంది.
10 ఏళ్లలోపు పిల్లలు 19,445 మంది ఉన్నారని తెలిపింది. 18 ఏళ్లలోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వకపోవడంతో ఆ వయసు వారిలో ఇటీవల కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారి ద్వారా ఇళ్లల్లో ఉండే వారికి కరోనా వ్యాప్తి చెందుతోందని పేర్కొంటున్నారు.
పురుషులపైనే ఎక్కువగా దాడి: రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఎక్కువ మంది పురుషులేనని నివేదిక తెలిపింది. మొత్తం కేసుల్లో 61.4 శాతం పురుషులు కాగా, 38.6 శాతం మహిళలు ఉన్నారు. 31–40 ఏళ్ల వయస్సువారు 21.8 శాతం ఉంటే, అందులో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు ఉన్నారు. 20 ఏళ్లలోపు బాలురు, బాలికలకు దాదాపు సమానంగా కరోనా సోకినట్లు నివేదిక వెల్లడించింది. కరోనాతో ఇప్పటివరకు మరణించినవారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నారు. కాగా రాష్ట్రంలో బుధవారం నిర్వహించిన 41,392 కరోనా నిర్ధారణ పరీక్షల్లో 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరికొన్ని ముఖ్యాంశాలు...
►రాష్ట్రంలో రికవరీ రేటు – 98.79 శాతం
►కరోనా మరణాల రేటు– 0.58 శాతం
►ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు– 2,74,30,113
►ప్రతి పది లక్షల జనాభాలో 7,36,972 మందికి పరీక్షలు చేశారు.
►మొత్తం పాజిటివ్ కేసుల్లో 79.8 శాతం లక్షణాలు లేనివారు కాగా, మిగిలిన వారికి లక్షణాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment