సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం నుంచి రాష్ట్రం బయటపడిందని, ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్–19 పాజిటివిటీ రేటు 4.1 శాతంగా ఉందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనల ప్రకారం 5 శాతం లోపు పాజిటివిటీ ఉంటే పరిస్థితి అదుపులో ఉన్నట్లేనని చెప్పారు. ఈ నెలాఖరులోగా కరోనా సెకండ్ వేవ్ దాదాపు తగ్గుముఖం పడుతుందని, జూన్ నెలాఖరుకల్లా సెకండ్ వేవ్ దాదాపు తగ్గిపోయే అవకాశాలున్నాయని వివరించారు. కరోనా నిర్ధారణపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారని, ఈక్రమంలో రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షలను ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర మధ్య చేయనున్నట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే పరీక్షల సంఖ్య పెరిగేలా చూస్తామన్నారు. బుధవారం డైరెక్టరేట్‌లో వైద్య విద్య విభాగం సంచాలకులు రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓపీ, ఫీవర్ సర్వేలో లక్షణాలున్న వారికి కిట్లు
‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వేలు చేపడుతున్నాం. ఔట్ పేషెంట్ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1,518 కేంద్రాల్లో 13.05 లక్షల ఓపీని పరిశీలించగా.. 2,78,502 మందికి లక్షణాలున్నట్లు తేలింది. వీరిలో 2,57,277 మందికి కరోనా కిట్లు పంపిణీ చేశాం. ఫీల్డ్ ఫీవర్ సర్వే తొలి రౌండ్‌లో 33,374 బృందాలు రంగంలోకి దిగి పరిశీలించాయి. 1,01,28,711 ఇళ్లు తిరిగి సర్వే చేయగా.. 2,41,103 మందికి లక్షణాలున్నట్లు గుర్తించి 2,18,698 కిట్లు పంపిణీ చేశారు. తాజాగా రెండో రౌండ్‌లో 17,089 బృందాలు 46,70,358 ఇళ్లు సందర్శించాయి. 1,57,963 మందిలో లక్షణాలున్నట్లు గుర్తించి 93,129 కిట్లు పంపిణీ చేశారు..’అని శ్రీనివాసరావు తెలిపారు.
హైరిస్క్ కేటగిరీకి తొలుత వ్యాక్సిన్లు
‘టీకాల పంపిణీని వ్యూహాత్మకంగా చేపడుతున్నాం. తొలుత హైరిస్క్ (సూపర్ స్ప్రెడర్స్) కేటగిరీలో ఉన్న వాళ్లను గుర్తించి వారికి వ్యాక్సిన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నాం. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతాం. రాష్ట్రంలో ప్రస్తుతం 250 ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలున్నాయి. వీటిని 1,200కు పెంచుతాం. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
56 లక్షల టీకా డోసులు పంపిణీ: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షల టీకా డోసులు పంపిణీ చేశాం. ప్రస్తుతం 6.18 లక్షల కోవిషీల్డ్, 2.5 లక్షల కోవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. జూన్ మొదటి వారంలో మరో 2.5 లక్షల డోసులు రాష్ట్రానికి వస్తాయి. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారికి ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ చేపడతాం. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్‌ఎంసీ ద్వారా వ్యాక్సిన్లు వేస్తాం. ఈ నెలాఖరు నాటికి 3 లక్షల మందికి కోవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉంది..’అని తెలిపారు.
పడకల సంఖ్య పెంచాం
‘గత వారానికి రాష్ట్రంలో 53 వేల బెడ్లు ఉంటే ఇప్పుడు వాటిని 55,120కి పెంచాం. ప్రస్తుతం 31,375 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రిపాలైన రోగులు 23,745 మంది ఉంటే వీరిలో 40 శాతం రోగులు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు చెందినవారే. ఐసీయూ బెడ్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో 612, ప్రైవేటులో 3,977 ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 4,589 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ పడకలు 9,718 అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,750 పడకలు ఉండగా, ప్రైవేటులో 6,968 బెడ్లు ఖాళీగా ఉన్నాయి..’అని శ్రీనివాసరావు వివరించారు.
పోస్ట్ కోవిడ్ లక్షణాలపై దృష్టి: డీఎంఈ రమేశ్‌రెడ్డి
ఆస్పత్రిలో చేరి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి చెప్పారు. అలాంటి వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యస్థితి పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓపీ సేవలు అందిస్తామన్నారు. ‘బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో ప్రస్తుతం 240కి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. రోజూ 20 మందికి చొప్పున ఆపరేషన్లు చేస్తున్నాం. బోధనాసుపత్రుల్లో కూడా దీనికి చికిత్స చేయనున్నాం..’అని రమేష్‌రెడ్డి తెలిపారు.
జూనియర్ డాక్టర్ల సమ్మె సరికాదు
ప్రస్తుతమున్న హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం సరికాదని, ఈ అంశంపై ముఖ్యమంత్రి సైతం సూచనలు చేశారని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే జూనియర్ డాక్టర్లకు 15 శాతం స్టైపెండ్ పెంపు ఇచ్చామని, సీనియర్ రెసిడెంట్లకు కూడా 15 శాతం పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకున్నారన్నారని తెలిపారు. వీరంతా సమ్మె విరమించి వైద్యసేవలు అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment