డెల్టా కంటే 30 రెట్లు వేగంగా ఒమిక్రాన్‌, అయితే.. | Telangana On High Alert Over Omicron Variant | Sakshi
Sakshi News home page

Omicron Variant: డెల్టా కంటే 30 రెట్లు వేగంగా ఒమిక్రాన్‌, అయితే..

Published Mon, Nov 29 2021 1:07 AM | Last Updated on Mon, Nov 29 2021 10:58 AM

Telangana On High Alert Over Omicron Variant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా డెల్టా వేరియెంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియెంట్‌ 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. అయినా జాగ్రత్తలు పాటిస్తే ఈ వేరియెంట్‌ను అడ్డుకోవచ్చని చెప్పారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ వేరియెంట్, ప్రభుత్వ సన్నద్ధతపై వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలపాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

అనంతరం డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  కోవిడ్‌ నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తున్నామని.. కేసుల సంఖ్య నిలకడగానే ఉందని వెల్లడించారు.  

దేశంలో ఒమిక్రాన్‌ నమోదు కాలేదు.. 
‘ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్‌ కేసులు ఎక్కడా నమోదు కాలేదు.  కొత్త వేరియంట్‌ దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ చేస్తున్నారు.  అక్కడే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాం. ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు  శంషాబాద్‌ విమానాశ్రయంలో నిఘా పెంచాం. మూడోవేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 100 నుంచి 150 వరకే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు,  45 శాతం రెండో డోసు కరోనా టీకాలు ఇచ్చాం. కాలవ్యవధి గడిచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్‌ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలు కొంత నిర్లక్ష్యంతో ఉన్నట్లు గమనించాం.

ఏ వేరియెంట్‌ను అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మర్చిపోవద్దు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలి. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులైతే వ్యాక్సిన్‌ తప్పనిసరి’అని చెప్పారు.  

కేంద్రం విధివిధానాలు వచ్చాక మూడో డోసు... 
‘రాష్ట్రంలో అక్కడక్కడా కొన్ని స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఒక స్కూలులో, హైదరాబాద్‌ శివారు మహీంద్ర వర్సిటీలో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలో 557 స్కూళ్లు, కాలేజీల్లోని 37,994 మంది విద్యార్థులకు కరోనా స్క్రీనింగ్‌ పరీక్షలు చేశాం. అందులో 25 స్కూళ్లలో 141 కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదు కంటే ఎక్కువ కేసులు ఆరు విద్యా సంస్థల్లో, 5 కంటే తక్కువ కేసులు 19 విద్యా సంస్థల్లో బయటపడ్డాయి.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏమాత్రం భయపడాల్సిన అవసరంలేదు. పిల్లలు కరోనా బారినపడి ఆసుపత్రుల పాలవడం, మృతిచెందడం జరగలేదు. కరోనాలో 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉత్పరివర్తనాలు జరగడంతో ఎప్పుడూ కొత్త రూపం దాలుస్తోంది. ఒమిక్రాన్‌ ఎంతమేరకు ప్రమాదకరమైందో ఇప్పుడే చెప్పలేం. ఒకట్రెండు వారాల తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.

రెండు డోసులు వేసుకున్న 6 నెలల తరువాత బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మూడో డోస్‌పై విధివిధానాలు రూపొందిస్తోంది. అవి వచ్చాక మూడో డోస్‌ గురించి చెప్తాం. ఒమిక్రాన్‌ను ఇప్పుడున్న వ్యాక్సిన్లు కూడా ఎదుర్కొంటాయి’అని శ్రీనివాసరావు వివరించారు. వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement