సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో కేసుల తీవ్రత భారీగా ఉండొచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. అందరం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ పరిస్థితి నుంచి గట్టెక్కగలమని.. వచ్చే ఆరు వారాల పాటు కచ్చితంగా మాస్క్ నిబంధనను, ఇతర జాగ్రత్తలను పాటించాలని స్పష్టం చేశారు. ఎక్కువమంది ఉండే ఇళ్లలోనూ మాస్క్ ధరించాలని సూచించారు.
కరోనా కొత్త వేరియంట్, రాష్ట్రంలో పరిస్థితులు, ఇతర అంశాలపై శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో బాధితులు ఆస్పత్రుల్లో చేరడం తక్కువగా ఉందని, మరణాలుగానీ నమోదవడం లేదని.. ఇది ఊరటనిచ్చే అంశమని చెప్పారు. ఈ వేరియంట్‌తో పెద్దగా సమస్య లేకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ సోకితే పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని.. నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటివి మాత్రమే ఉంటున్నాయని చెప్పారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత నాలుగైదు రోజులుగా ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. గుంపులుగా ఉండటం లేదని, మాస్కులు ధరిస్తున్నారని తెలిపారు.
రేపో, మాపో రావొచ్చు..
ఒమిక్రాన్ చాలా దేశాలకు విస్తరించిందని.. మనదేశంలో బెంగళూరు, ముంబై, జైపూర్‌లోనూ కేసులు వచ్చాయని శ్రీనివాసరావు చెప్పారు. రేపో మాపో తెలంగాణలోనూ ఈ వేరియంట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనా మూడో వేవ్ వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నామన్నారు.
ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి 900 మందికిపైగా రాష్ట్రానికి చేరుకోగా.. అందులో 13 మందికి కరోనా ఉన్నట్టు తేలిందని చెప్పారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామన్నారు. టిమ్స్‌లో ఉన్న ఈ 13 మంది ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చినవారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారని.. అందులో ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని, పాజిటివ్ రాలేదని వివరించారు. జిల్లాల్లో అధికారులు వారిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
లాక్‌డౌన్లు పరిష్కారం కాదు..
కరోనా వ్యాప్తిని అరికట్టడడానికి లాక్‌డౌన్లు పెట్టడం పరిష్కారం కాదని శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్లు ఉండవని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం రెండో వేవ్ సమయంలో రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్ సర్వే దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కోటి ఇళ్లకు ఆరేడుసార్లు తిరిగి లక్షణాలున్న 8 లక్షల మందికి కిట్లు ఇచ్చామని, దాన్ని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు.
టెస్టుల సంఖ్య పెంచుతాం
రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం ద్వారా వైరస్ వ్యాప్తిని గుర్తించి.. అరికట్టేందుకు చర్యలు చేపడతాం. అయినా మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలి. స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు, భౌతికదూరం ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
భయంతోనే ప్రాణాలు కోల్పోయారు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సంబంధించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరావు మండిపడ్డారు. ‘‘డెల్టా వేరియంట్ సమయంలో ఆస్పత్రుల ముందు బాధితులు బారులుతీరారా? ఏదైనా ఆస్పత్రిలో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయినట్టు చూశామా? చనిపోయినవారిని దాచిపెట్టగలమా? మా వైద్య సిబ్బంది 70 మంది చనిపోయారు.
వారిని అవమానిస్తారా? ప్రభుత్వం పడిన శ్రమ ఏం కావాలి? ఎవరిని అనుమానిస్తున్నారు?’’అని ప్రశ్నించారు. డెల్టా వేరియంట్ ధాటి నుంచి కనీస నష్టంతో బయటపడ్డామని చెప్పారు. కానీ కరోనా ఏదో చేస్తుందన్న భయంతోనే బాధితులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment