సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. అందుకోసం వైద్య ఆరోగ్య యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. అత్యంత సున్నితమైన కార్యక్రమం కావడంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసింది. రైతుబంధు చెక్కుల పంపిణీ ఎలా నిర్వహించారో అలాగే కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావును ‘సాక్షి’ఇంటర్వ్యూ చేసింది. వివరాలివీ..
సాక్షి: కంటి వెలుగు లక్ష్యాలేంటి?
శ్రీనివాసరావు: ‘అంధత్వ రహిత తెలంగాణ’ దిశగా సర్కారు చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. అవసరమైన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తాం. ఉచిత కంటి శస్త్ర చికిత్సలు కూడా చేస్తాం. సాధారణ కంటి వ్యాధులున్న వారికి మందులను అందజేస్తాం.
సాక్షి: ఎంతమందికి కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు?
శ్రీనివాసరావు: రాష్ట్రంలోని మూడున్నర కోట్ల జనాభాకు పరీక్షలు చేస్తాం. అందులో దాదాపు 40 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని అంచనా వేశాం. అలాగే 3 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరం అవుతాయని భావిస్తున్నాం. శస్త్ర చికిత్సల కోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను, స్వచ్ఛంద సంస్థ లను గుర్తించాం. మొత్తం కార్యక్రమాన్ని కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ద్వారా అమలుచేస్తాం. ప్రపంచంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఇంత భారీగా సామూహిక కంటి పరీక్షల కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 15 నుంచి కంటి వెలుగు ప్రారంభం కానుంది. 6 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.
సాక్షి: ఎంతమంది వైద్య సిబ్బంది పాల్గొంటారు?
శ్రీనివాసరావు: దాదాపు 33 వేల మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో 24 వేల మంది ఆశ కార్యకర్తలు, ఏడు వేల మంది ఏఎన్‌ఎంలు ఉన్నారు. మొత్తం 799 బృందాలను ఏర్పాటు చేశాం. అత్యవసర సేవల కోసం అదనంగా మరో 113 బృందాలను సిద్ధంగా ఉంచాం. అందులో 940 మంది వైద్యాధికారులు, వెయ్యి మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. వారంతా శిక్షణ పొందినవారే. నిరంతరం కంటి సమస్యతో బాధపడే వారికోసం 150 విజన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం.
సాక్షి: ఎలా నిర్వహిస్తారు?
శ్రీనివాసరావు: గ్రామీణ ప్రాంతాల్లో గ్రామం వారీగా, హైదరాబాద్, ఇతర పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా కంటి శిబిరాలను నిర్వహిస్తాం. ప్రతి శిబిరంలో ఒక వైద్యాధికారి, కంటి వైద్య నిపుణుడు, ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్లు, ఆశ కార్యకర్తలు ఇలా 6–8 మంది సహాయక సిబ్బంది ఉంటారు. ప్రతి బృందానికి ఒక వాహనాన్ని సమకూర్చుతున్నాం. ఒక శిబిరంలో రోజుకు గ్రామీణ ప్రాంతంలోనైతే దాదాపు 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తాం.
40 శాతం మందికి అద్దాలు లేదా శస్త్రచికిత్సలు అవసరమవుతాయని అంచనా వేశాం. కంటి శిబిరాలను నిర్వహించే గ్రామాల షెడ్యూల్‌ను తయారుచేశాం. అందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తాం. ఎప్పటికప్పుడు సమాచారం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నాం.
సాక్షి: సమన్వయం ఎలా చేస్తారు? ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యం?
శ్రీనివాసరావు: జిల్లా, మండల స్థాయిలో ప్రధాన శాఖలను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్లను కోరాం. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు మంత్రి లక్ష్మారెడ్డి ఇప్పటికే ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. ప్రైవేటు కంటి ఆసుపత్రులు ఏవైనా ఉంటే ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించాం. వారి సేవలను ఉపయోగించుకుంటాం. 30 జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోని కంటి వైద్య విభాగాలను, హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రిని, వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిని బలోపేతం చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment