ఐదు కంటే ఎక్కువ కేసులొస్తే స్కూలు బంద్‌ | Director Of Public Health Dr Srinivasa Rao Said If Five Positive Covid Cases May Be Closed | Sakshi
Sakshi News home page

Telangana: ఐదు కంటే ఎక్కువ కేసులొస్తే స్కూలు బంద్‌

Published Thu, Sep 2 2021 2:46 AM | Last Updated on Thu, Sep 2 2021 7:15 AM

Director Of Public Health Dr Srinivasa Rao Said If Five Positive Covid Cases May Be Closed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక బడిలో ఐదు కరోనా కేసులు నమోదైతే, దాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకొని కట్టడి చర్యలు చేపడతామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు కంటే ఎక్కువగా కేసులు నమోదైతే ఆ పాఠశాలను నిర్ణీత సమయం వరకు మూసివేస్తారని చెప్పారు. వైరస్‌ సోకిన విద్యార్థులతో ఎంతమంది సన్నిహితంగా ఉన్నారనేది గమనించి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

వ్యాక్సిన్‌ తీసుకున్న టీచర్లకే అనుమతి
పిల్లల్ని పాఠశాలలకు పంపించడంపై ఇప్పటికీ కొందరు తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఉన్నా యి. కానీ ఆందోళన వద్దు. పిల్లలపై కరోనా ప్రభా వం తక్కువ. కాబట్టి నిరభ్యంతరంగా పాఠశాల లకు పంపించండి. ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే విద్యకు సార్ధకత చేకూరుతుంది. అందరూ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చు. మరో కొత్త రకం, మరింత ఎక్కువ ప్రమాదకరమైంది వస్తే తప్ప మూడోదశ ఉధృతి రాదు. బోధన, బోధనేతర సిబ్బందిలో 95 శాతం మందికి ఇప్పటికే టీకాలు అందించాం. కాబట్టి వీరి నుంచి వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. మిగతావారిని వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతే బడిలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా ఎవ్వరూ మాస్కు ధరించకుండా తరగతి గదిలోకి ప్రవేశించకూడదు.

లక్షణాలు కన్పించిన వెంటనే టెస్టు చేయించాలి
లక్షణాలు కనిపించిన పిల్లలను పాఠశాలలు వెంటనే తల్లిదండ్రుల వద్దకు పంపించాలి. వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేలా చూడాలని ఆదేశాలిచ్చాం. ఒకవేళ ఒక విద్యార్థిలో లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ విద్యార్థిని వేరే గదిలో కూర్చో బెట్టాలి. మిగతావారిని పరిశీలనలో ఉంచాలి. ఒకవేళ ఇంటి వద్ద లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు పాఠశాలకు పంపొద్దు. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించాలి. బడి నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్‌ను విడిగా ఉంచాలి. చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయించాలి. 

పిల్లలు ఇంటికే పరిమితమై ఉండటం లేదు 
రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉందనుకుంటే, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సుమారు 60 లక్షల మంది వరకు ఉన్నారు. తరగతులు జరగక పోవడం వల్ల స్కూలుకు రాకపోయినా వీరంతా ఇంటికే పరిమితమై లేరు. ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు తిరుగుతూనే ఉన్నారు. పండుగలు జరుపుకుంటున్నారు. ఐసీఎంఆర్‌ సీరో సర్వే ప్రకారం పెద్దల్లో ఇప్పటికే 63 శాతం మంది కరోనా బారినపడ్డారు.  పిల్లల్లోనూ 50 శాతానికి పైగా వారికి తెలియకుండానే ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మొహర్రం, బోనాలు వంటి పండుగలు ప్రజలు జరుపుకున్నారు. శుభ కార్యాలకు వందల సంఖ్యలో హాజరవుతున్నారు. కానీ ఎక్కడ కూడా భారీగా ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగలేదు. అందువల్ల తల్లిదండ్రులు భయపడనక్కర్లేదు. అన్నీ పరిశీలించి, జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

థర్డ్‌వేవ్‌ ఎదుర్కోవడానికి సిద్ధం
ఐసీఎంఆర్, ఇతర సంస్థలు అక్టోబర్‌లో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని చెబుతు న్నాయి. కానీ అక్టోబర్‌లో కచ్చితంగా  థర్డ్‌వేవ్‌ ఉధృతి వస్తుంద నడానికి ఎక్కడా శాస్త్రీయ ఆధారాల్లేవు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవ డానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ప్రస్తుతం కోవిడ్‌ పూర్తిగా అదుపులోనే ఉంది. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ శుభ కార్యాలు, పండుగలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసి దాదాపు రెండున్నర నెలలు దాటుతోంది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, మరణాల రేటు అత్యల్పంగానే నమోదవు తున్నాయి. పిల్లలకు సోకినా త్వరగా కోలుకుం టున్నారు.

ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. పిల్లల్లో ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకు కరోనాకు గురైనవారు 3 శాతం మంది మాత్రమే. 10–20 ఏళ్ల వారిని తీసుకుంటే 10% మంది వైరస్‌ బారిన పడ్డారు. మొత్తంగా 20 ఏళ్లలోపు వారు 13%, 20–60 ఏళ్ల మధ్య వయస్కులు అధికంగా 73% కరోనా బారినపడ్డారు.  పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్రత చాలా తక్కువగా ఉండి త్వరగా కోలుకుంటున్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా చాలా స్వల్పంగా ఏర్పడింది. మరణాలైతే అస్సలే నమోదు కాలేదు. 

1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం... 
రాష్ట్రంలో ఇప్పటివరకు 1.80 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం. వచ్చే 15–20 రోజుల్లోనే ఈ సంఖ్య  2 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే 95 శాతం మందికి టీకాలు ఇచ్చాం. 60 శాతం కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేశాం.  దసరా నాటికి రాష్ట్రంలో అర్హులైన అందరికీ తొలిడోసు ఇచ్చేలా ప్రణాళిక రచించాం.  

సినిమాకెళ్లాలంటే టీకా తప్పనిసరి కానుంది
పిల్లలకు సంబంధించి ఇప్పటికే జైడస్‌ క్యాడిలా టీకాను అనుమతించారు. 12 ఏళ్ల పైబడిన వారికి దీన్ని ఇస్తారు. ఇది ఈ నెలలో అందుబాటులోకి వస్తుంది. భవిష్యత్తులో రెండేళ్లు పైబడిన వారి కోసం భారత్‌ బయోటెక్స్‌ రూపొందిస్తున్న టీకా అక్టోబర్‌/ నవంబర్‌ నుంచి అందుబాటులోకి రావచ్చు. ఇతర దేశాల నుంచి ఇంకా అనేక రకాల వ్యాక్సి న్లు కూడా మన దగ్గరకు వస్తాయి. మాల్స్, సినిమా టాకీసులకు వెళ్లాలంటే టీకాలు పొంది ఉండాలనే నిబంధన త్వరలోనే రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement