ఫీవర్‌ సర్వేతో కోవిడ్‌కు చెక్‌  | Check with Fever Survey on Covid-19 Srinivasa Rao | Sakshi
Sakshi News home page

ఫీవర్‌ సర్వేతో కోవిడ్‌కు చెక్‌ 

Published Wed, May 19 2021 3:10 AM | Last Updated on Wed, May 19 2021 8:10 AM

Check with Fever Survey on Covid-19 Srinivasa Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్‌ సర్వే కారణంగా కోవిడ్‌ పాజటివ్‌ రేట్‌ తగ్గు ముఖం పడుతుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు.  వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు.. మొత్తం 21 వేల మంది 81 లక్షల ఇళ్లను సర్వే చేశారని తెలిపారు. కోవిడ్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ హోం ఐసొలేషన్‌ కిట్లు ఇవ్వడం వల్ల వారంతా కోవిడ్‌ను జయించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రుల్లో అడ్మిషన్ల సంఖ్య వారం రోజులుగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. త్వరలోనే 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం ఉందని వివరించారు. వ్యాక్సిన్ల కొరత, బ్లాక్‌ఫంగస్, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత వంటి అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.  

సర్వేకు మంచి ఆదరణ 
‘పదిహేనురోజుల క్రితం చేపట్టిన ఫీవర్‌ సర్వేకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంట్లోనే ఉంటూ కరోనాను జయించేందుకు మేము ఇచ్చిన ఐసోలేషన్‌ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌ నగరంతో పాటు అన్ని జిల్లాలు, గ్రామాల్లో 2 లక్షలకు పైగానే కిట్లు ఇచ్చాం. ఫీవర్‌ సర్వే తెలంగాణ ప్రభుత్వానికి ఒక టర్నింగ్‌ పాయింట్‌. అందుకే కేంద్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ఈ ఐడియాను దేశవ్యాçప్తంగా అమలు చేస్తోంది.
 
వ్యాక్సిన్లకు గ్లోబల్‌ టెండర్లు 
రాష్ట్రంలో 18–45 సంవత్సరాల వయసున్న వారు సుమారు 1.82 కోట్ల మంది ఉన్నారు. వీళ్లుకా కుండా మరో 25 లక్షల మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. అంటే తెలంగాణలో సుమారు 2 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది. దీనికి 4 కోట్ల డోసులు కావాలి. కానీ కేంద్రం ఇచ్చింది 4.90 లక్షలే. అందుకే వీటిని ముందుగా ఎవరికివ్వాలి? ఎప్పుడివ్వాలి? అనే విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. త్వరలో దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో సీఎం మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు.

గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించి తద్వారా రాష్ట్రానికి కావాల్సినన్ని వ్యాక్సిన్‌ డోసులను తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కొత్త వ్యాక్సిన్లు కూడా వస్తున్నాయి. స్పుత్నిక్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అనేవి కూడా మన హైదరాబాద్‌లోనే తయారు కానున్నాయి. దీనిపై స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ను మంత్రి కేటీఆర్‌ ఏర్పాటు చేశారు. వాళ్లు ఈ వ్యాక్సిన్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక 45 సంవత్సరాలు పైబడిన వారికి కేంద్రమే వ్యాక్సిన్‌ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 45 సంవత్సరాల పైబడిన వారు 92 లక్షల మంది ఉన్నారు, వీరికి 1.85 కోట్ల డోసులు కావాలి. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది కేవలం 57 లక్షల డోసులు మాత్రమే. రాష్ట్రంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ నిల్వలు లక్ష డోసులు మాత్రమే ఉన్నాయి..’ అని శ్రీనివాసరావు తెలిపారు.  

పడకలు మూడింతలు పెంచాం 

‘ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే సెకెండ వేవ్‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రై వేటు ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యాన్ని పెంచాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 వేలు, ప్రై వేటు ఆసుపత్రుల్లో 38 వేలు మొత్తం 54 వేల బెడ్లు ఏర్పాటు చేశాం. ఇలా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తేæ సెకెండ్‌ వేవ్‌లో మూడింతలు పెంచాం. వీటిలో ఆక్సిజన్‌ బెడ్లు 21 వేలు, ఐసీయూ బెడ్లు 12 వేలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు 115కు, ప్రై వేటు ఆసుపత్రులు 1,100కు పెంచి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాం.  

ఆక్సిజన్‌ కొరత లేదు 
సెకెండ్‌ వేవ్‌లో రోగుల తాకిడి ఉధృతం కావడంతో..రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేదా సరఫరా అంతరాయం అనేది లేదు. ఆక్సిజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది.  

ఉచితంగా బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్‌ 
బ్లాక్‌ ఫంగస్‌ అనేది కొత్త వ్యాధి కాదు. దీనికి భయపడాల్సిన అవసరం కూడా లేదు.  కానీ ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించకూడదు. ముక్కు దిబ్బడగా ఉండటం, ముక్కు ద్వారా గాలి సజావుగా పీల్చుకోలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇది ఎక్కువగా కోవిడ్‌ను జయించిన వాళ్లకు వస్తుంటుంది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు తక్షణం గాంధీ లేదా కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రుల్లోని వైద్యులను సంప్రదించాలి. దీని మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ.3,500. వీటిని ఉచితంగా ఇస్తాం..’ అని శ్రీనివాసరావు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement