పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
కొత్త రకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రంలోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. -పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: కొత్తరకం కరోనా వైరస్‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రం లోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. బ్రిటన్‌లో గుర్తించిన కొత్తరకం వైరస్‌పై కేంద్ర వైద్య, పౌర విమానయాన శాఖల ఆదేశాల మేరకు అలర్ట్ అయ్యామని, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో వైద్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. సోమవారం బ్రిటన్ నుంచి ఏడుగురు ప్రయాణికులు హైదరాబాద్ రాగా, వారందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 మధ్య బ్రిటన్ నుంచి 358 మంది హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు.
ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వారు ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. గత వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారు 040–24651119 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. వారికి కొత్త వైరస్ సోకిందా లేదా అన్నది పరీక్షల్లో తేలుతుందన్నారు. నెగెటివ్ వచ్చినా కూడా ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డా.పుట్రాజు తదితరులు ఈ కార్యకమంలో పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన చర్యలు..
కొత్త రకం వైరస్ విషయంలో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులపై ప్రభుత్వ శాఖలన్నింటితో కలసి యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు. కొత్త వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. అత్యంత తక్కువ స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయని, గత నాలుగు వారాలుగా కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. చదవండి: (కరోనా కొత్త అవతారం!)
పండుగల సమయంలో జాగ్రత్త..
నూతన సంవత్సర వేడుకలు ఇంటి సభ్యులతోనే జరుపుకోవాలని, బయటి వేడుకల్లో పాల్గొనవద్దని కోరారు. పండుగల సందర్భంగా విందులు, వినోదాలు జరుపుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగలకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నాలుగైదు వారాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, దీని పంపిణీకి 10 వేల మందిని సిద్ధం చేశామన్నారు. మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు భద్రపరిచేం దుకు కోల్డ్ స్టోరేజీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబ సభ్యుల మధ్యనే పండుగలు జరుపుకోవాలని, కొత్త వ్యక్తులు, అపరిచితులతో జరుపుకోవద్దని కోరారు. రాబోయే 2 వారాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండాలన్నారు. పబ్‌లు, రెస్టారెంట్ల వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదన్నారు. పబ్‌లలో యువతీ, యువకులు జాగ్రత్తలు పాటించడం లేదని, వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పుణేకు రెండు శాంపిళ్లు
ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు కొందరు ప్రయాణికులు వచ్చారు. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అది కొత్త రకపు కరోనా వైరసా కాదా.. అన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో అనుమానాలు తలెత్తాయి. దీంతో వారి శాంపిళ్లను మరోసారి క్షుణ్నంగా పరీక్షించే నిమిత్తం ఫుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. సాధారణ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో సరైన ఫలితాలు రావచ్చు.. రాకపోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కొత్త వైరస్ బయట పడకపోవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ వైరస్ సంచలనం కావడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. చదవండి: (బ్రిటన్ నుంచి ముంబైకు ఐదు విమానాలు!)
కొత్త మ్యుటేషన్లు వస్తూనే ఉంటాయి: డీఎంఈ
ప్రతి వైరస్‌లో కొత్త కోణాలు, మ్యుటేషన్లు, వేరియంట్లూ వస్తూనే ఉంటాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి తెలిపారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. తక్కువ తీవ్రత ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కట్టడిలో రాష్ట్రం ఎంతో విజయం సాధించిందని చెప్పారు. వైరస్ విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ ప్రభావం తగ్గిందనే భావన ప్రజల్లో ఏర్పడి, భౌతికదూరం పాటించట్లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment