సాక్షి, జగిత్యాల: జగిత్యాల పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నేడు అద్భుతమైన కలెక్టరేట్ నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పడిందన్నారు. జగిత్యాల జిల్లా అయితదని కలలో కూడా అనుకోలేదని, ప్రస్తుతం జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అభినందలు తెలిపారు.
ఏకైక రాష్ట్ర తెలంగాణే
తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. బండలింగాపూర్‌ను మండల కేంద్రం చేస్తామని పేర్కొన్నారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ఏకైక రాషష్ట్రం తెలంగాణనే అని అన్నారు. తాను బతికున్నంత వరకూ రైతుబంధు, రైతు బీమా ఆగవని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనదని, కానీ దేశంలో ధాన్యం కొనే ఏకైక రాష్ట్ర తెలంగాణేనని చెప్పారు. ఇంకా ఎన్నో పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చదవండి: మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్
‘మోటర్లకు మీటర్లు పెట్టాలట.. పెడదామా అని ప్రశ్నించారు. గోల్‌మాళ్ గోవిందం గాళ్లు, కారుకూతలు కూసేవాళ్లు మన మధ్య తిరుగుతున్నారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.
తెలంగాణలాగే దేశమంతా అభివృద్ధి చెందాలి. మనం వచ్చినప్పుడే కేంద్రంలో మోదీ కూడా వచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరిగిందా? మోదీ వచ్చాక ఉన్న ఆస్తులు ఊడగొడుతున్నారు.
రైతులకు ఉచితాలు ఇవ్వొద్దు కానీ.. ఎన్‌పీఏల పేరిట రూ. 14 లక్షల కోట్ల ప్రజా సంపదను దోచిపెట్టారు. రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్‌ఐసీని కూడా అమ్మేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పిడికిళ్లు బిగించాలి. దేశంలో ఇప్పటికే 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. 50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయాయి.’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment