సాక్షి, మేడ్చల్‌జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు.
►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్‌కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.
►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి.
►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు.
టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు
డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్‌ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది.
భూ వివాదాల్లోనూ...
అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్‌నగర్, శామీర్‌పేట, ఘట్‌కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment