గురువారం శివన్నగూడలో ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామితో కలిసి భోజనం చేస్తున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: ‘మునుగోడును నేనే దత్తత తీసుకుంటా.. అభివృద్ధి చేస్తా.. ఎన్నికల ముందో మాట, తర్వాతో మాట కాదు. నేను చెప్పే ప్రతి మాటకు కట్టుబడి ఉంటా.. మూడు నెలలకోసారి వస్తా.. స్వయంగా అభివృద్ధి పనులను పరిశీలిస్తా. నా మీద నమ్మకం ఉంచండి...’అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, తాను కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించారు.
కారు గుర్తుకు ఓటు వేయండి
‘మునుగోడు అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటా. నాపై విశ్వాసం ఉంచి కారు గుర్తుకు ఓటువేసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి. కాంట్రాక్టర్ రాజగోపాల్‌రెడ్డి డబ్బు మదానికి, అహంకారానికి.. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోటీ ఇది. మోదీ ఇచ్చిన డబ్బుతో మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొనేయాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గంలో మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ సమస్యను పోగొట్టింది కేసీఆరే. మునుగోడులో 1.13 లక్షల మందికి రైతుబంధు అందిస్తున్నాం. యాదవులకు 5,765 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి. వారి అకౌంట్లలో డబ్బులు కూడా జమయ్యాయి. అయితే ఉప ఎన్నిక వచ్చినందున డబ్బులు ఫ్రీజింగ్ (స్తంభన)లో ఉన్నాయి. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. ఎన్నికల తర్వాత అధికారులే యూనిట్లను అందిస్తారు..’అని కేటీఆర్ చెప్పారు.
నామినేషన్ దాఖలు చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చేనేత వస్త్రాలపై జీఎస్‌టీ విధించిన మోదీ
‘చేనేత వస్త్రాలపై మోదీ 5 శాతం జీఎస్‌టీ వేశారు. ఆయనకు ఓటు వేస్తారో లేక చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు, నేతన్న బీమా, చేనేత మిత్ర అమలు చేస్తున్న, 40 శాతం సబ్సిడీ అందిస్తున్న కేసీఆర్‌కు ఓటేస్తారో ఆలోచించాలి. మోదీ హిందువునని చెప్పుకుంటున్నారు. తిరుపతికి దీటుగా యాదాద్రి దేవాలయాన్ని కట్టిన కేసీఆర్ కంటే పెద్ద హిందువా? యాదాద్రి దేవాలయానికి రూ.100 కోట్లు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో గిరిజనులను పట్టించుకున్నదీ కేసీఆరే. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. దాంతో రాష్ట్రంలో 21 వేల మంది గిరిజనులు ప్రజా ప్రతినిధులు కాగలిగారు. మునుగోడు నియోజకవర్గం దండుమల్కాపురంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం. దాంతో 16 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి..’అని మంత్రి తెలిపారు.
రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు కొన్నారు: మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను చూసి మోదీ ప్రభుత్వం ఈర్ష్య పడుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు కొన్నారో, ఉప ఎన్నికలు ఎందుకు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రభాకర్‌రెడ్డి గెలిచేలా కమ్యూనిస్టులుగా తామంతా అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. సీపీఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
అంశలస్వామికి అండగా ఉంటా: కేటీఆర్
మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని శివన్నగూడకు చెందిన ఫ్లోరైడ్ బాధితుడు అంశలస్వామికి అండగా ఉంటానని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం చండూరు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అంశలస్వామి ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. స్వామితో కలిసి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment