సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓ వైపు టీఆర్‌ఎస్‌ను గట్టిగా ప్రతిఘటిస్తూనే.. మరోవైపు ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పోలింగ్‌కు సమయం తగ్గిపోతుండటంతో ‘యాక్షన్ ప్లాన్’అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంటింటికీ వెళ్లి, ప్రతి ఓటరును మూడు, నాలుగు సార్లు కలిసి బీజేపీ ఓటేసేలా ఒప్పించడం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహించడం.. బీజేపీ గెలుపుతో భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను వివరించడం.. ఇలా బహుముఖ వ్యూహాలను సిద్ధం చేసింది.
ప్రచార పర్వం ముగింపు నాటికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో గానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోగానీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అప్పటిదాకా పలువురు కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు ఉధృతంగా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే మునుగోడులో 16 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీని నియమించడంతోపాటు.. 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు కలిపి 27 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు.
అన్ని మార్గాల్లో టీఆర్‌ఎస్‌ను ప్రతిఘటిస్తూ..
రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీని అన్ని మార్గాల నుంచి ప్రతిఘటించాలని బీజేపీ నిర్ణయించింది. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రయోజనం కలిగేలా వ్యవహరించే ప్రభుత్వ అధికారులు, పోలీసులను గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోయేలా ఉందని, అందుకే ఓటుకు రూ.40 వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ అంశాన్ని టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ప్రచారంగా వాడుకోవాలని, టీఆర్‌ఎస్ నేతల అవినీతిని ఓటర్లకు వివరించాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
ఇంటింటికీ వెళుతూ..
బీజేపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఓటర్‌ను 3, 4 సార్లు కలిసి బీజేపీకి మద్దతు కోరేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. వివిధ కులాలు, సామాజికవర్గాల వారిని కలిసి మద్దతు కోరాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే మునుగోడుకు చేరుకోగా.. వారం, పదిరోజుల్లో రెండో విడత బృందాలు చేరుకుని ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment