
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో బ్రేకులే కాదు సడెన్ బ్రేకులు కూడా ఉంటాయని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరం సీబీఐ విచారణ, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
సీబీఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారు. సీబీఐ కంటే మరో మార్గం కనిపించడం లేదు. ఆ దర్యాప్తు సంస్థలోనూ అనేక లొసుగులు ఉన్నాయి. కానీ కాళేశ్వరం విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారాయాన.
అదే సమయంలో రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యవహారంపైనా స్పందించారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి అలవాటు. కానీ, రాజ్‌గోపాల్‌రెడ్డి విషయంలో కొంత కొంత కన్ఫ్యూజన్ ఉంది’’ అని అన్నారు.
నాగేందర్ రిజైన్ చేసి పోటీ చేస్తానని చెప్తున్నారు. నాగేందర్ సభ్యత్వం పోతుందని అనుకోవడం లేదు. మంత్రి పదవి ఇస్తామంటే వద్దని చెప్పాను. నాకు కులమంటే అభిమానమే కానీ కుల పిచ్చి లేదు. బీసీలు కొన్ని రోజులు కులాన్ని పక్కన పెట్టాలి. వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని మహేష్‌గౌడ్ అన్నారు.