సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థుల జయాపజయాలపై అప్పుడే బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ తరహాలో పందేలు కాస్తున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నారు.
రంగంలోకి దిగిన బెట్టింగ్ మాఫియా రూ.కోట్లలో లావాదేవీలు సాగిస్తున్నట్టు సమాచారం. నగదు వసూలు కోసం చౌటుప్పల్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించినట్లు తెలిసింది. ఫోన్ పే, గూగుల్ పే, ఇతరత్రా ఆన్‌లైన్ మార్గాల్లో దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డిపై రూ.50 వేలు, కూసుకుంట్లపై రూ.30 వేలు, స్రవంతి గెలుపుపై రూ.20 వేల చొప్పున కాస్తున్నట్లు తెలిసింది. గెలుపు కోసం ఎన్ని వేలు బెట్టింగ్‌లో కట్టినా అంతకు రెట్టింపు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ మేరకు అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం బెట్టింగ్ మాఫియాను గుర్తించే పనిలో పడింది.
రూ.16 కోట్లు పట్టివేత?
మునుగోడు ఉప ఎన్నికల ఖర్చు కోసం తరలిస్తున్న రూ.16 కోట్ల నగదును పోలీసు అధికారులు పట్టుకున్నారని తెలిసింది. హైదరాబాద్ నుంచి ఓ ప్రధాన పార్టీకి చెందిన డబ్బు వాహనంలో మునుగోడు ప్రాంతానికి రవాణా అవుతుండగా మార్గంమధ్యలో పట్టుబడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment