సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికతో పార్టీల్లో గోడ దూకుళ్లు పెరిగాయి. నోటిఫికేషన్ కూడా వెలువడకముందే మొదలైన పార్టీ జంపింగ్‌లు.. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మరింతగా ఊపందుకున్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్నట్టుగా పార్టీలు మారిపోతున్నారు. సాధారణ కార్యకర్త మొదలు కీలకనేతల దాకా కండువాలు మార్చేస్తున్నారు.
ఉప ఎన్నికలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ వీలైనంత మేర ‘ఆకర్ష్’ మంత్రం పఠిస్తున్నాయి. ఉన్నవాళ్లను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్లినవారిని మళ్లీ సొంతగూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా వ్యూహా లను అమలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ, టీఆర్‌ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం కాస్త వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజగోపాల్‌రెడ్డితో మొదలు
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచే పార్టీల్లో జంపింగ్‌లు మొదలయ్యాయి. ఏ రోజున ఏ నాయకుడు పార్టీ మారుతాడో తెలియనంతగా పరిస్థితి మారిపోయింది. ఇందులో కీలక నేతలూ ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై, టీఆర్‌ఎస్ విజయానికి కృషి చేస్తానని చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్.. రెండు రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేడో రేపో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్‌లో విభేదాల్లేవని, కలిసికట్టుగా విజయానికి కృషి చేస్తామన్న పల్లె రవికుమార్‌గౌడ్, ఆయన సతీమణి చండూరు ఎంపీపీ కల్యాణి శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన శనివారం పల్లె రవి దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్‌తోపాటే ఉండటం గమనార్హం.
అనుచరులు, కార్యకర్తలు కూడా..
రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరినప్పుడే ఆయన వర్గీయుడిగా ఉన్న చౌటుప్పల్ జెడ్పీటీసీ తాడూరి వెంకటేశ్వర్లు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. చండూరు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు దోటి వెంకటేశ్వర్లు, తన సతీమణి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ సుజాతతో కలిసి బీజేపీలో చేరారు. రాజగోపాల్‌రెడ్డి అనుచరులుగా ఉన్న కాంగ్రెస్ మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులూ బీజేపీ గూటికి చేరారు.
ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, నేతలను ఆకర్షించే పనిని టీఆర్‌ఎస్ ముమ్మరం చేసింది. మండల కేంద్రంగా మారిన గట్టుపల్లిలో బీజేపీ నుంచి గెలిచిన మహిళా సర్పంచ్, మునుగోడు మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నకిరేకంటి నర్సింహగౌడ్, సోలిపురం సర్పంచ్, మునుగోడు సీనియర్ నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు తదితరులు తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరారు. మునుగోడు మండలం ఊకొండి ఎంపీటీసీ పొలగోని సైదులు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారారు.
ఒకరికొకరు పోటాపోటీగా..
మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామాలు, మండలాల వారీగా ప్రతి ఓటు విలువైనదిగానే అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రభావితం చేసే సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు ఊరిపెద్దలను కూడా తమవైపు తిప్పుకునేందుకే అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికార టీఆర్‌ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోందని.. మండలాలు, గ్రామాల వారీగా మోహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నాయకులను గులాబీ గూటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇక స్థానిక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి తనకు నియోజకవర్గంలో ఉన్న సంబంధాలతో.. గ్రామాల్లోని యువతను, ఇతర పార్టీల నాయకులను బీజేపీ వైపు తీసుకువస్తున్నారు. అయితే.. ఈ ఉప పోరులో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా వెనుకబడిన పరిస్థితి ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి.. మండలాల వారీగా ముఖ్య నాయకులను తన వెంట తీసుకెళ్లారని.. మిగిలిన వారికి టీఆర్‌ఎస్ గాలం వేస్తోందని చెబుతున్నారు. అయితే పరిస్థితి పోటాపోటీగా ఉండటంతో.. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ జంపింగ్‌లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
స్థాయిని బట్టి ప్యాకేజీలు?
రాజకీయ పార్టీలు మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, స్థానికంగా పట్టు ఉన్న నాయకులకు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నజరానా ఇచ్చి వలసలను ప్రోత్సహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
మళ్లీ మళ్లీ జంపింగ్‌లు
చండూరు జెడ్పీటీసీగా కాంగ్రెస్ నుంచి గెలిచిన కర్నాటి వెంకటేశం నాటి నుంచి మూడు పార్టీలు మారారు. జెడ్పీటీసీగా గెలిచాక టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఆయన.. ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. రెండు రోజుల్లోనే బీజేపీకి గుడ్‌బై చెప్పి మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. గట్టుప్పల్ ఎంపీటీసీ సైతం చండూరు జెడ్పీటీసీతో కలిసి టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment