సాక్షి, హైదరాబాద్: బతికి ఉన్నవారికీ సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టీఆర్‌ఎస్ తెర తీసిందని, కనీస నైతిక, మానవతా విలువలు, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట సమాధి కట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా.. ఆయన మీద ఎందుకు ఈ అక్కసు’అని ప్రశ్నించారు. బతికున్న వ్యక్తికి సమాధి కట్టే నీచ, నికృష్ట చర్యలకు దిగడం ద్వారా అన్ని పరిమితులు, లక్షణరేఖను టీఆర్‌ఎస్ దాటి దిగజారిందని మండిపడ్డారు.
గతంలో తన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారని, తమ సహనాన్ని అసమర్థతగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా తెలంగాణను మారుస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్‌ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయపెడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలతో తొండి చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్‌ఎస్ భావిస్తోందని విమర్శించారు.
దత్తత అంటారు.. ఆ తర్వాత మర్చిపోతారు..
‘ఒక ముఖ్యమంత్రి ఉపఎన్నికలో ఒక గ్రామానికి ఇన్‌చార్జీగా ఉండటమనేది గతంలో ఎప్పుడూ లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇస్తారు. ఆ తరువాత మర్చిపోతారు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ పెడతామని తాము ఎప్పుడు హామీ ఇవ్వలేదని, స్టీల్ ప్లాంట్ కడతామని కేసీఆర్, కేటీఆర్‌లే హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి చెప్పారు.
తెలంగాణలో కమిషన్లు లేకుండా కాంట్రాక్ట్‌లు లేవని, కల్వకుంట్ల కుటుంబం దోచుకోని రంగం లేదని, ఉద్యమకారులను వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు వదిలి పెట్టే సమయం వచ్చిందన్నారు. ‘మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీద ఒత్తిడి తెచ్చారు. కోర్ట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసీఆర్ ఇష్ట ప్రకారం గుర్తుల కేటాయింపు జరగదు, దానికి ఓ పద్ధతి ఉంటుంది’అని కిషన్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment