G Kishan Reddy
-
సముద్ర గర్భ మైనింగ్ వేలం ప్రారంభం
న్యూఢిల్లీ: సముద్ర గర్భ ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాల వేలం మొదటి రౌండ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వీటిలో 13 మైన్స్‌ను విక్రయానికి ఉంచడం జరిగింది. ఈ మైన్స్‌లో మూడు సున్నపు మట్టి, మూడు నిర్మాణ ఇసుక, ఏడు పాలీమెటాలిక్ నాడ్యూల్స్– క్రస్ట్లు ఉన్నాయి. సముద్రగర్భ ఖనిజ వనరుల అన్వేషణ విషయంలో భారత్ పురోగతిని ఈ కేటాయింపులు సూచిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఖనిజాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హైటెక్ తయారీ, గ్రీన్ ఎనర్జీ పరివర్తనకు కీలకం కావడం గమనార్హం. వేలానికి సిద్ధమైన ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ప్రాదేశిక జలాలు, కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి, దేశంలోని ఇతర సముద్ర మండలాలు ఉన్నాయి. ఖనిజ సంపద పటిష్టతను సూచిస్తోంది: మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రారంభ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆఫ్‌షోర్ బ్లాకుల అన్వేషణ వల్ల దేశంలోని ఖనిజ సంపద మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. భారతదేశంలో కీలకమైన ఖనిజాల కోసం డిమాండ్ పెరుగుతోందని వివరించారు. లిథియం డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ త్వరలో క్రిటికల్ మినరల్స్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భాగస్వాములకోసం అన్వేషణ: వీఎల్ కాతా రావు ఖనిజ అన్వేషణ, అభివృద్ధి విభాగంలో భాగస్వాముల కోసం ప్రభుత్వం ప్రయతి్నస్తున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. ఖనిజాలపై పరిశోధన– అభివృద్ధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. సముద్ర గర్భ మైనింగ్ వేలం పక్రియ ప్రారంభం నేపథ్యంలో దేశ, విదేశాల్లో రెండు మూడు రోడ్‌షోలు చేయడానికి తాము సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. గనుల అదనపు కార్యదర్శి సంజయ్ లోహియా మాట్లాడుతూ, ఆఫ్‌షోర్ మినరల్ బ్లాక్‌లను విజయవంతంగా వేలం వేయడానికి అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో మైనింగ్‌ను చేపట్టే చర్యలు తీసుకోవడమే మనకు సవాలు అని ఆయన పేర్కొంటూ, అయితే ఆయా చర్యల్లో విజయవంతం అవుతామన్న భరోసాను వ్యక్తం చేశారు. కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వంటి అధిక డిమాండ్ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అలాగే సప్లై చైన్‌ను స్థిరీకరించడానికి భారత్ విభిన్న ఖనిజ వనరులను అభివృద్ధి చేయాలని గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది.గ్లోబల్ లీడర్‌గా ఎదగడమే లక్ష్యం ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2002ను పార్లమెంటు గత ఏడాది ఆగస్టులో సవరించింది. ఆఫ్‌షోర్ ప్రాంతాలలో ఖనిజ బ్లాకుల కేటాయింపు విధానంగా వేలాన్ని తప్పనిసరి చేసింది. వనరుల అన్వేషణ–వెలికితీత కోసం ఉత్పత్తి లీజులు, మిశ్రమ లైసెన్స్‌ల మంజూరును క్రమబదీ్ధకరణ వంటి చర్యలను తీసుకోడానికి ప్రభుత్వాన్ని ఈ సవరణ అనుమతిస్తుంది. భారత్ సముద్రగర్భంలో ఖనిజాల అన్వేషణలో అడుగుపెట్టినప్పుడు, దాని పారిశ్రామిక–గ్రీన్ ఎనర్జీ రంగాలను పెంపొందించడమే కాకుండా కీలకమైన ఖనిజాలలో గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని పొందడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం
గుంటూరు, సాక్షి: రాష్ట్రానికి కొత్త రైళ్లు వచ్చేశాయి. మూడు రైళ్లను శుక్రవారం గుంటూరు స్టేషన్ నుంచి ప్రారంభించనుంది రైల్వే శాఖ. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ఇవి పట్టాలపై ఎక్కనున్నాయి. హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖపట్టణం - గుంటూరు, నంద్యాల - రేణిగుంట రైళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపటి నుంచే ప్రయాణికులకు ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
నిరుద్యోగులకు వెన్నుపోటు
తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. ఇదే ధర్నా చౌక్‌లో ఏళ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే వారికి ఎదురుచూపులే మిగిలాయి. సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్: నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగభృతి ఏమైందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వస్తుందేమోనని లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే కేసీఆర్ వారికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసుల పేరిట నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. కొన్ని పరీక్షలు నిర్వహించినా ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదో కేసీఆర్ చెప్పాలన్నారు. 35 లక్షల మంది యువత అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే వారిని గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని, వారికి సంఘీభావంగా బీజేపీ దీక్ష చేస్తోందని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షను కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల భర్తీ ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి, కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తూ బీఆర్ఎస్ను గెలిపించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన యువకులు నేడు కళ్లు తెరిచారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను పాతరేస్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అన్యాయం జరిగిందనేది. కాబట్టి ఈ రెండు పార్టీలను యువత క్షమించదు. కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఈ ధర్నా చౌక్ నుంచి తెలంగాణ ప్రజలకు చెబుతున్నా. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. నిరుద్యోగులు, యువత బీజేపీకి మద్దతు తెలిపాలి..’ అని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జమిలి అంటే జంకెందుకు?: బండి జమిలి ఎన్నికలంటే కేసీఆర్ కుటుంబానికి అంత జంకెందుకని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మా సునామీలో కేసీఆర్ కొట్టుకు పోవడం ఖాయమన్నారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ జాతీయ సమైక్యతా రాగం అందుకున్నారని విమర్శించారు. తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. శ్రీకాంతాచారి, ఇషాంత్ రెడ్డి, సుమన్, పోలీస్ కిష్టయ్యవంటి యువకుల బలిదానాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేదాకా పోరాడుదామని యువతకు సంజయ్ పిలుపునిచ్చారు. నవంబర్‌తో తెలంగాణకు పట్టిన మకిలి వీడుతుంది: తరుణ్‌ఛుగ్ ఉద్యమ సమయంలో నిరుద్యోగ యువతను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టి 1200 మంది యువత ప్రాణాలు కల్వకుంట్ల కుటుంబం బలిగొన్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆంధ్రా పాలకులే ఉద్యోగాలు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్.. తాను అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఈ నవంబర్‌తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్..నువ్వు ఇస్తానని చెప్పిన డబుల్ ఇండ్లు ఏవి? దళిత బంధు ఏది? ఎందరికి ఇచ్చావు?’ అంటూ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు మురళీధర్‌రావు, జి.విజయరామారావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, చింతల రామచంద్రారెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, డా.జి.మనోహర్‌రెడ్డి, శాంతికుమార్, గీతామూర్తి, గూడూరు నారాయణరెడ్డి, నాగూరావు నామాజీ, బండ కార్తీకరెడ్డి, డా.గౌతంరావు, శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీకి దిశానిర్దేశం రైతులకు భరోసా..
సాక్షి హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న ‘రైతు గోస–బీజేపీ భరోసా’ సభలో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆదివారం మధ్యా హ్నం 3 గంటల తర్వాత ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు అమిత్‌షా చేరుకుంటారు. ఈ సభలో రైతుల సమస్యలను ప్రస్తావించడంతోపాటు పరిష్కారానికి బీజేపీ ఏం చేయనుందనే అంశాన్ని వెల్లడిస్తారు. త్వరలో జరగ నున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సభకు భారీగా జనసమీకరణతో పాటు పెద్దసంఖ్యలో పార్టీ కేడర్ పాల్గొనేలా చేయడం ద్వారా సభ సక్సెస్ చేసి సత్తా చాటాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా రైతులను అధిక సంఖ్యలో సభకు సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు యాత్రలపై రాష్ట్రనేతలతో సమావేశం అమిత్ షా ఖమ్మం జిల్లా పర్యటనకు నిర్దేశించిన సమయం తక్కువగా ఉండడంతో భద్రాచలంలో శ్రీరాముల వారి దర్శనం, అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం రద్దయినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. సభ అనంతరం ఖమ్మంలోనే బీజేపీ రాష్ట్రస్థాయి కోర్ కమిటీ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు.. బాసరలోని సరస్వతి అమ్మవారి దేవాలయం, జోగుళాంబ అమ్మ వారి గుడి, భద్రాచలం శ్రీరాముల దేవాలయం నుంచి.. వచ్చేనెల 7 తర్వాత ముఖ్యనేతలు 3 బస్సుయాత్రలు చేపట్టి సెప్టెంబర్ 17న ముగించి భారీ సభ నిర్వహించే అంశంపై అమిత్‌షాతో రాష్ట్రనేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా అమిత్‌షా సమక్షంలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతరనేతలు చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు వెల్లడించాయి. బహిరంగ సభ విజయవంతం కోసం.. సభను విజయవంతం చేయడం కోసం బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు సర్వశక్తులొడ్డాయి. కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న బీజేపీ అగ్ర నేత జిల్లాకు వస్తుండడం ఇదే ప్రథమం కావడంతో నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో ఖమ్మం కాషాయమయంగా కనిపిస్తోంది. సభా ప్రాంగణంలో అమిత్‌షా, ప్రధాని మోదీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ శనివారం సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. సభకు ‘రైతు గోస..బీజేపీ భరోసా’ అని నామకరణం చేశారు. భారీ బందోబస్తు.. అమిత్‌షా సభ కోసం భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం అధికారులతో సమీక్షించారు. సీఆర్పీఎఫ్ అధికారులు బందోబస్తును ప్రత్యేకంగా పరిశీలించారు. రైతుల ఇబ్బందులు తొలిగేలా ఖమ్మం సభలో ప్రకటన : బీజేపీనేత ప్రేమేందర్‌రెడ్డి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు భరోసా కల్పించి, వారి ఇబ్బందులు తొలగించే విధంగా బీజేపీ నాయకత్వం ఖమ్మం సభలో రైతు భరోసా ప్రకటన చేయనున్నదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు అమిత్ షా షెడ్యూల్ ఇలా.... – ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.25 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2.50 నిముషాలకు ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో దిగుతారు –అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3.25 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు –3.40 నిమిషాలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ బహిరంగసభ ప్రాంగణానికి వస్తారు –3.45 నిమిషాల నుంచి సాయంత్రం 4.35 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు –అక్కడి కాలేజీ ప్రాంగణంలోనే 4.40 నిముషాల నుంచి సాయంత్రం 5.30 దాకా పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు –సాయంత్రం 5.50 నిమిషాలకు ఖమ్మం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 6.20 నిమిషాలకు గన్నవరం చేరుకుంటారు –సాయంత్రం 6.25 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి. -
కేసీఆర్ సర్కార్‌ది రియల్ ఎస్టేట్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలోని భూములతోపాటు రైతుల భూములకూ ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలనను పక్కనబెట్టిన కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని మండిపడ్డారు. గ్రామాల్లో ధరణి పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని, ఇవ్వకుంటే కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికల ముందు ప్రభుత్వ భూములను అమ్ముతోందని. ఇదేమిటని ప్రశ్నించేవారిని అణచివేస్తోందని మండిపడ్డారు. 111 జీవో ఎత్తేసి, హైదరాబాద్ సమీపంలోని విలువైన భూములను కావాల్సిన వ్యాపారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. నిర్మల్‌లో నిలదీస్తే దాడులా? నిర్మల్ పట్టణంలో మాస్టర్ ప్లాన్ పేరిట భూమాయ జరుగుతోందని.. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా, రైతుల భూములను అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిర్మల్‌లో సోఫీనగర్ ఇండ్రస్టియల్ జోన్‌ను రెసిడెన్షియల్‌గా మార్చేందుకు జీవో తెచ్చి రైతులకు నష్టం కలిగిస్తున్నారని.. దీనికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళన చేస్తుంటే పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తున్నారని విమర్శించారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారని, పలువురి తల పగిలి గాయాలయ్యాయని చెప్పారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారని, మహిళా నాయకురాలనే గౌరవం లేకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్‌చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే అణచివేస్తారా? ఆదిలాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిపైనా లాఠీచార్జి చేసి, బట్టలు చించారని కిషన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి సూర్యాపేటకు వెళితే అక్కడి బీజేపీ నేతలను అరెస్టు చేశారన్నారు. సీఎం, ఆయన కుమారుడు ఎక్కడికి వెళ్లినా బీజేపీ, ఇతర ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలో అభద్రతాభావం ఏర్పడిందని.. వారి అవినీతికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేసే ధోరణి నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండేది నాలుగు నెలలేనని, తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, పక్షపాతం మంచిది కాదని హితవు పలికారు. పోలీసులు మహిళలనూ కొట్టారు: ఈటల తెలంగాణలో పోలీసులు చట్టానికి లోబడి కాకుండా కేసీఆర్ చెప్పినట్టుగా పనిచేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్‌లో వందలమంది మహిళలను మగ పోలీసులు విపరీతంగా కొట్టారని ఆరోపించారు. లంబాడీ మహిళల పట్ల కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళోజీ టీవీ దాసరి శ్రీనివాస్, బీజేపీ ఐటీ సెల్లో పనిచేసే బొమ్మ శరత్‌లను మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుపోయి బయటి ప్రాంతాల్లో తిప్పుతూ విపరీతంగా కొట్టారని.. హుజూరాబాద్‌లో చెల్పూరు సర్పంచ్ మహేందర్‌ను అలాగే కొట్టి హింసించి, పైశాచికానందనం పొందారని ఆరోపించారు. గిరిజన, దళిత మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు. -
వారిది ముక్కోణపు ప్రేమ కథ!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలది ముక్కోణపు ప్రేమ కథ (ట్రయాంగిల్ లవ్‌స్టోరీ) అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, మూడూ కుటుంబ, అవినీతి పార్టీలేనని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పేరిట ఢిల్లీలో ఈ మూడు పార్టీలు ఆడుతున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘ఈ పార్టీలు గతంలో కలిశాయి.. ఇప్పుడూ కలిశాయి.. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాయి..’ అని అన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఒకే తాను ముక్కలే.. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే తాను ముక్కలే. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా మూడు పార్టీలకు వేసినట్లే. బీజేపీ ఈ మూడు పార్టీలతో గతంలో కలవలేదు. భవిష్యత్తులోనూ కలవదు. ఈ మూడు పార్టీలపై పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్రంలో మార్పు రావాలంటే, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే మోదీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యం..’ అని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో 4 వేల కిసాన్‌సేవా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల రిటైల్ షాపులను గురువారం నుంచి ‘ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలు’గా మార్చుతున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. ఒకే దేశం.. ఒకే ఎరువు అనే నినాదంతో, భారత్బ్రాండ్పేరుతో గురువారం నుంచి ఎరువుల సరఫరా అమల్లోకి రానున్నట్టు తెలిపారు. దేశంలో 2.8 లక్షల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు. తొలిదశలో 1.25 లక్షల షాప్‌లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణలో సుమారు 4 వేల ఎరువుల రిటైల్ షాపులు కిసాన్‌సేవా కేంద్రాలుగా మారతాయని చెప్పారు. ఈ మేరకు శామీర్‌పేటలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. ప్రతి నెల రెండో ఆదివారం ‘కిసాన్ కీ బాత్’ రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకేచోట అందించేందుకు వీలుగా ఎరువుల రిటైల్షాపులను ప్రధానమంత్రి కిసాన్‌సేవా కేంద్రాలుగా కేంద్రం మార్చుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎరువులు, భూసార, విత్తన పరీక్షల కోసం వేర్వేరు చోట్లకు రైతులు వెళ్లకుండా అన్ని రకాల సేవలు..ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో లభిస్తాయని వివరించారు. సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, కిసాన్సమ్మాన్యోజన వంటి కార్యక్రమాలు కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. రైతు సమస్యలపై ‘కిసాన్‌కీ బాత్’ సమావేశాలు నిర్వహిస్తామని, ప్రతి నెల రెండో ఆదివారం ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నేడు రైతుల ఖాతాల్లోకి ‘కిసాన్ సమ్మాన్’ నిధులు 14వ విడత పీఎం కిసాన్సమ్మాన్నిధులను గురువారం ఉదయం ప్రధాని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని సుమారు 39 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. -
ఆయనే ఇక తెలంగాణలో బీజేపీ గేమ్‌ఛేంజర్!
తెలంగాణ బీజేపీ నేతల్లో కిషన్‌రెడ్డి సీనియర్ లీడర్. ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా. కానీ, ఎన్నికల దృష్ట్యా ఆయనకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యత అప్పగించడం సరైన చర్యగా బీజేపీ అధిష్టానం భావించింది. బీఆర్ఎస్ను, కేసీఆర్ అండ్ కోను దూకుడు స్వభావంతో ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న బండి సంజయ్‌ను తప్పించి.. సౌమ్యుడైన కిషన్‌రెడ్డిని ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీ ఈజ్ ద రైట్ ఛాయిస్ అని కాషాయం పార్టీ ఒక అంచనాకి రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిని విశ్లేషిస్తే.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని.. బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ క్యాడర్ ఓ గందరగోళంలోకి కూరుకుపోయిందనే భావన బీజేపీ హైకమాండ్‌లో నెలకొంది. అదే టైంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో అప్రమత్తమైంది. వీటికి తోడు బండి చుట్టూరా నెలకొన్న వివాదాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోవడం, కీలక నేతల నుంచి అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ తరుణంలోనే బండిని సైడ్ చేస్తూనే.. నేతల మధ్య ఎలాంటి అంసతృప్తి లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకే వివాదరహితుడైన కిషన్‌రెడ్డి పేరును తెరపైకి తెచ్చింది. ► ఆరంభం నుంచి బీజేపీతోనే కిషన్‌రెడ్డి ప్రయాణం కొనసాగుతోంది. బీజేపీ ఆవిర్భావ సమయంలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. పార్టీ అప్పగించిన ప్రతి పని, బాధ్యతను శ్రద్ధతో నిర్వర్తిస్తూ క్రమశిక్షణగల పార్టీ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత.. ఈ రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి కిషన్‌రెడ్డి. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘంగా పార్టీతో అనుబంధం తర్వాత ఈ హోదా దక్కింది. అప్పటిదాకా ఎంతో ఓపికగా ఉన్నారాయన. ► వీటన్నింటికి తోడు.. ఆరేళ్లపాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొనసాగించినా అనుభవమూ ఉంది. ఆ సమయంలో ఆయన వివాదాల్లేకుండా పార్టీని ముందుకు నడిపించారు. అన్నింటికంటే ముఖ్యమైంది.. ప్రత్యర్థులపై సహేతుకమైన విమర్శలు గుప్పించడంలో కిషన్‌రెడ్డి దూకుడునే ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కేసీఆర్‌కు పదునైన చురకలనే అంటిస్తారాయన. అందుకే.. బీజేపీ కార్యకర్తలంతా ‘కిషనన్నా’అని ఆప్యాయంగా పిలుచుకునే గంగాపురం కిషన్‌రెడ్డిని.. వచ్చే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా బీజేపీ భావిస్తోంది. ఆయన నాయకత్వంపైనే పూర్తి భరోసా పెట్టుకుంది కూడా. జోడు పదువులు? గతానికి భిన్నంగా ఒకరికి ఒకే పదవి అనే అంశంపై బీజేపీ అధినాయకత్వం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి చోట రాష్ట్ర అధ్యక్షులకు ప్రొటోకాల్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్రమంత్రి పదవితో పాటు.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. అలా.. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రెండు పదవుల్లోనూ కొనసాగించే అవకాశం ఉంది. మోదీతోనూ ప్రత్యేక అనుబంధం.. ప్రధాని నరేంద్ర మోదీతో కిషన్‌రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేసిన సమయంలో మోదీకి దగ్గరయ్యారు. అప్పట్లో బీజేపీ జాతీయ నేతలంతా కలసి పర్యటించిన నేపథ్యంలో మోదీ, కిషన్‌రెడ్డి ఒకే గదిలో బస చేసిన సందర్భం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలా వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి అది కూడా ఒక కారణమైందన్న చర్చ గతంలో జోరుగా నడిచింది కూడా. కిషన్‌రెడ్డి కంప్లీట్ ప్రొఫైల్ జననం : జూన్ 15, 1964 తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ భార్య: కావ్య, పిల్లలు: వైష్ణవి, తన్మయ్ రాజకీయ ప్రవేశం: 1977లో జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీలో చేరిక 1980 : భారతీయ జనతా పార్టీ పూర్తికాల కార్యకర్తగా నమోదు 1980 - 83 : యువ మోర్చా రంగారెడ్డి కమిటీ కోశాధికారి, కన్వీనర్ 1986 - 90 : యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు 1990 - 92: యువ మోర్చా జాతీయ కార్యదర్శి 1992 - 94: యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు 1994 - 2001: యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి 2001 - 02: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి 2002: యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు 2003 - 05: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి 2004: మొదటిసారిగా హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక 2010 - 14: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 2009, 2014: అంబర్‌పేట ఎమ్మెల్యే 2018: అంబర్‌పేట అసెంబ్లీ ఎన్నికల్లో 1,016 ఓట్ల తేడాతో ఓటమి 2019: సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా విజయం.. కేంద్ర మంత్రి పదవి 2023, జులై 5: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇదీ చదవండి: బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారు? -
తెలంగాణకు కిషన్‌రెడ్డి.. ఏపీకి పురంధేశ్వరి
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యూహంలో భాగంగా.. భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను మార్చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణకు కొత్తగా జి. కిషన్‌రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్‌గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది. అలాగే.. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని సైతం తీసుకుంది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అయిన అనంతరం.. పలు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. అలాగే.. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్ పేరును ప్రకటించారు. కిందటి ఏడాది మేలో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి జంప్ కొట్టారు. పంజాబ్‌లో జాతీయవాదం, ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకే తాను పార్టీ మారానంటూ ఆ టైంలో ప్రకటించుకున్నారాయన. ఇక.. జార్ఖండ్ బీజేపీ చీఫ్‌గా బాబూలాల్ మారాండి పేర్లను ప్రకటించారు. జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారాయన. కిషన్ రెడ్డి గురించి.. జి.కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఉండడం విశేషం. (ఆనాటి అమెరికా పర్యటనలో కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ) కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే 2009లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర 2019లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నిక ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు హోంశాఖ సహాయ మంత్రిగా చేయడం వల్ల ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి దగ్గరగా పని చేసే అవకాశం పురంధేశ్వరి గురించి..రాజకీయ ప్రస్థానం దగ్గుబాటి పురంధేశ్వరి.. చెన్నైలో ఏప్రిల్ 22, 1959లో జన్మించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు. 14, 15వ లోక్‌సభకు రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికై.. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో కాంగ్రెస్ తరపున బాపట్ల ఎంపీగా నెగ్గిన ఆమె.. ఆ సమయంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2009లోనూ విశాఖపట్నం నుంచి రెండోసారి ఎంపీగా నెగ్గి మరోసారి కేంద్ర సహాయశాఖ మంత్రిగా పని చేశారు. గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసింది. 2014లో బీజేపీలో చేరి.. రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలకుగానూ ‘‘దక్షిణాది సుష్మా స్వరాజ్’’ బిరుదును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బీజేపీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారామె. -
చేతగాక పారిపోయిన వ్యక్తా.. మా భవిష్యత్తు తేల్చేది!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలో తేల్చాల్సింది తెలంగాణ ప్రజలేగానీ.. అసమర్థుడైన రాహుల్‌గాంధీ కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ ఖతమైపోయిందంటూ ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మిడిమిడి జ్ఞానంతో, ఏమాత్రం అవగాహన లేకుండా రాహుల్ చేసిన ఉపన్యాసం విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఏ పార్టీ ఖతం అవుతుందనేది నాలుగు నెలల్లో రాహుల్‌కు అర్థం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనని.. రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసు లాంటివని పేర్కొన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలనే కాపాడుకోలేక.. కాంగ్రెస్ పార్టీని నడపలేనంటూ, చేతగానితనంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన రాహుల్ గాందీకి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘2018లో తెలంగాణ ప్రజలు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. 12 మంది బీఆర్ఎస్లో చేరారు. కొందరు అమ్ముడుపోతే, మరికొందరు పదవుల కోసం పార్టీ ఫిరాయించారు. అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలందరూ కట్టగట్టుకొని బీఆర్ఎస్లో విలీనం చేసిన చరిత్ర రాహుల్‌గాందీకి గుర్తుకులేదా?’’అని ప్రశ్నించారు. ఎవరికి ఎవరు ‘బీ టీం’ అనేది ప్రజలకు తెలుసు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకుని, పక్కా ప్రణాళికతో బీజేపీపై కుట్రకు పాల్పడుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి పనిచేశాయని.. ఎవరికి ఎవరు బీ టీం అనేది ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కుటుంబ రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని.. రాహుల్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొనే రాజకీయాల్లోకి వచ్చారు కదా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను దోచుకుంటుందని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 8న వరంగల్‌లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కోసం కలసి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వారి ఆకాంక్షలను నెరవేర్చేలా ముందుకు నడుస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. గతాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై విమర్శలు గత నెలలో పట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్‌తో కలసి పాల్గొన్న అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలవడం వెనక వాళ్ల బంధమేంటో అర్థమవుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే నాయకుడిగా ఎదిగారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్తో కలసి పనిచేసిన విషయాన్ని కప్పిపుచ్చుకొనేందుకే.. బీజేపీపై రాహుల్‌గాంధీ అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ అంతే దూరమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో కలసి బీజేపీ ఎప్పుడూ పనిచేయలేదని, భవిష్యత్‌లోనూ కలసి పనిచేయబోమని చెప్పారు. తెలంగాణలో మజ్లిస్ ను పెంచిపోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది అయితే.. దానితో కలసి ఊరేగుతున్న చరిత్ర బీఆర్ఎస్దని విమర్శించారు. -
వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందిస్తున్నా.. రాష్ట్ర సర్కారు తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధికే ఎక్కువ నిధులు ప్రాజెక్టులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌కు రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, జాతీయ నాయకులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం ఆయన నగరంలో పర్యటించారు. కాజీపేట అయోధ్యపురంలో పీఓహెచ్, వ్యాగన్ల తయారీ కేంద్ర నిర్మాణ ప్రాంతం, బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. ఎస్వీ కన్వెన్షన్ హాల్లో మోదీ విజయసంకల్ప సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘బయ్యారం’ఏమైందో కేసీఆర్ చెప్పాలి.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివిధ కారణాలతో సాధ్యం కాలేదని, దీంతో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్‌తో పాటు అదనంగా వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8వ తేదీలోగా దీనికి భూమి కేటాయింపు కూడా పూర్తవుతుందన్నారు. కాగా సుమారు రూ.5,587 కోట్ల వ్యయంతో వరంగల్‌ను కలిపే, పలు జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఏర్పాటు చేయకున్నా.. రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందు ఇచి్చన హామీ ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీదేనని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రైలు.. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.26 వేల కోట్ల మేరకు ఖర్చవుతుందని చెప్పారు. ట్రిపుల్ ఆర్కు అనుసంధానంగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని తెలిపారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని, సిటీకి రాకుండా సరిహద్దుల నుంచే గమ్యస్థానాలకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, భూసేకరణ పూర్తయితే వెంటనే పనులు మొదలు పెడతామని వివరించారు. అధ్యక్షుడి మార్పుపై ఎవరైనా చెప్పారా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి నేరుగా స్పందించకుండా జవాబు దాటవేసే ప్రయత్నం చేశారు. ‘అధ్యక్ష మార్పు ఉంటుందని ఎవరైనా మీకు చెప్పారా.. అందరం వేదికపై కలిసే ఉన్నాముగా.. ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది.. అలాంటిదేమీ లేదు’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కిరాణ దుకాణం లాంటిది.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంటేనే ద్రోహం, కుట్రలకు ప్రతిరూపమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా కేసీఆర్ మాత్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగితే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందో అన్న భయంతోనే సహకరించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని సంజయ్ చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అల్లూరి’ చరిత్రను భావితరాలకు చెప్పాలి
మాదాపూర్: అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని, ఆయన చరిత్రను భావితరాలకు తెలియజెప్పాలని కేంద్ర సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని సీసీఆర్టీలో శుక్రవారం ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా సన్నాహక సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం, క్షత్రియ సేవా సమితితో కలిసి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం నుంచి అల్లూరిసీతారామరాజు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు సమితి సభ్యులను అభినందించారు. ఢిల్లీలోనూ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనుందన్నారు. నటుడు కృష్ణ అల్లూరి సీతారామ రాజు సినిమాను తీయకపోతే తనలాంటి వారికి ఆయన గొప్పతనం తెలిసేది కాదన్నారు. తన జీవితంలో ఎక్కువ సార్లు అల్లూరి సీతారామరాజు సినిమా చూసినట్లు తెలిపారు. ఆ పేరులోనే త్యాగం, స్ఫూర్తి, సాహసం ఉన్నాయన్నారు. భావితరాలకు కూడా ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. గిరిజనులను సంఘటితం చేసిన అల్లూరికి దక్కుతుందని, ఆయన పోరాట వీరుడే కాక ఆధ్యాత్మిక వేత్తగా పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో అనేక మార్పులను తీసుకువచ్చారన్నారు. మంచి, చెడు వివరించి వారిని సంఘటితం చేశారన్నారు. పోరాటాల్లోనూ నైతిక విలువలు పాటించారని, చెప్పి మరీ దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్లే వారన్నారు. అల్లూరి సీతారామరాజు పై కార్టూన్ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి దేశప్రధాని మోదీ, ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ము హాజరుకానుండటం సంతోషకరమన్నారు. ఏ గిరిజనుల కోసం ఆయన పోరాటం చేశాడో అదే గిరిజన మహిళ నేడు దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని, ఆయన జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ రావడం గర్వకారణమన్నారు. అల్లూరి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సినీనటుడు మురళీమోహన్‌లతో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి వివక్ష లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపడం లేదని.. వివిధ రూపాల్లో రాష్ట్రానికి గణనీయంగా నిధులు అందాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మోదీ అన్ని రాష్ట్రాలకూ ప్రధానమంత్రి అని, ఏ రాష్ట్రానికీ తక్కువ నిధులు ఇవ్వలేదని చెప్పారు. కొన్ని రంగాలు, పథకాలు, కేటాయింపులను పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే అధిక కేటాయింపులు దక్కాయన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో గుజరాత్ కన్నా తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సహకారాన్ని అందిస్తోందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో.. గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు వివిధ శాఖలు, రంగాలవారీగా వివిధ రూపాల్లో అందజేసిన నిధులు, రుణాలు, వివిధ సంస్థలకు చేసిన కేటాయింపుల వివరాలను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు ‘రిపోర్ట్ టు పీపుల్’ పేరిట వీడియోతోపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకం కాదు తనది రాజకీయ పార్టీ కార్యక్రమమో, ఒక ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకంగా ఇచ్చిన ప్రజెంటేషనో కాదని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యమని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను అధికారిక డాక్యుమెంట్ల ద్వారా రాష్ట్ర ప్రజల పరిశీలనకోసం అందుబాటులో ఉంచుతున్నట్టు వివరించారు. కేంద్రం ఇంత చేస్తున్నా ఏమీ చేయడం లేదంటూ రాష్ట్రంలో కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు అండగా నిలుస్తామన్నారు. కిషన్‌రెడ్డి ప్రజెంటేషన్‌లో పేర్కొన్న గణాంకాలివీ.. ► కేంద్రం తెలంగాణకు పన్నుల వాటా రూపంలో ఇచ్చిన నిధులు రూ.1.78 లక్షల కోట్లు ► కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో చేసిన ఖర్చు రూ.4.99 లక్షల కోట్లు ► వేస్ అండ్ మీన్స్ అలవెన్సులు, ఓడీలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి అనేక సార్లు ఆర్బీఐ అందించిన సహకారం రూ.2.31 లక్షల కోట్లు ► తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం కేంద్రం చేసిన ఖర్చు (ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతుధర వంటివి) రూ.1.58 లక్షల కోట్లు ► 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి పరిహారంగా అందినది రూ.8,379 కోట్లు. 2020–22 మధ్య (కరోనా కాలంలో) ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణం (దీనిని కేంద్రమే భరిస్తుంది) కూడా కలిపితే రూ.15,329 కోట్లు. ► కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా 2014 నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలు, అభివృద్ధి పనుల రూపంలో కేటాయించిన/విడుదలైన నిధులు సుమారు రూ.5లక్షల కోట్లు. ► 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు.. కేంద్రం, దాని ఆధ్వర్యంలోని సంస్థలు, పీఎస్‌యూల ద్వారా అందిన రుణాల మొత్తం (బడ్జెటేతర రుణాలతో సహా) దాదాపు రూ 7.5 లక్షల కోట్లు. ► రాష్ట్ర ప్రజలకు, వివిధ వర్గాలకు కేంద్రం ద్వారా అందించిన రుణాలు దాదాపు రూ.9.26 లక్షల కోట్లు సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ.నాగేశ్వర్. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివిధ రంగాల వారీగా కేటాయింపులు/నిధులు మౌలిక సదుపాయాల కల్పనకు.. – తెలంగాణలో 1947– 2014 మధ్య నిర్మించిన జాతీయ రహదారులకు సమానంగా గత తొమ్మిదేళ్లలోనే మోదీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారులను నిర్మించింది. – రోడ్ల కోసం చేసిన ఖర్చు రూ.1.08 లక్షల కోట్లు (2014–2022 మధ్య నిర్మించిన రోడ్ల పొడవు 2,500 కి.మీ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు 2,269 కి.మీ). – హైదరాబాద్ రీజనల్ రింగ్‌రోడ్డు (348 కి.మీ) అంచనా వ్యయం రూ.21,201 కోట్లు – రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు రూ.32,823 కోట్లు – విద్యుత్, నీటిపారుదల కోసం రూ.23,937 కోట్లు – గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాల కోసం రూ.34,090 కోట్లు – ఐటీ, డిజిటలీకరణకు రూ.7,479 కోట్లు రంగాలు, సంక్షేమ పథకాలకు.. – వ్యవసాయం, అనుబంధరంగాలు, పశు సంవర్థక, మత్స్యపరిశ్రమకు రూ.40,559 కోట్లు – రసాయనాలు, ఎరువులకు రూ.39,649 కోట్లు – ఆరోగ్యం, పారిశుధ్యం కోసం రూ.14,572 కోట్లు – జీవనోపాధి, కరోనా సమయంలో మద్దతు కింద రూ.38,256 కోట్లు – అడవులు, పర్యావరణం కోసం రూ.3,205 కోట్లు మానవాభివృద్ధి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వం కోసం – విద్య, క్రీడలకు రూ.18,657 కోట్లు – మహిళాశిశు సంక్షేమానికి రూ.8,031 కోట్లు – ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.2,802 కోట్లు – మైనారిటీలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.1,568 కోట్లు కేంద్ర శాఖల ఆధ్వర్యంలో ఖర్చు – రక్షణశాఖ నుంచి రూ.1.15 లక్షల కోట్లు, హోంశాఖ రూ.6,218 కోట్లు తెలంగాణలో వ్యయం – కేంద్రం తెలంగాణలో ఉన్న రక్షణ రంగ సంస్థలకు రూ.78 వేల కోట్లు ఇచ్చింది. 5 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. తెలంగాణ అప్పుల గణాంకాలివీ.. – రాష్ట్రం మొత్తంగా తీసుకున్న అప్పులు: రూ. 7,49,982 కోట్లు – పీఎఫ్సీ ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో టాప్ తెలంగాణ – నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో 5వ స్థానం.. తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ – ఆర్ఈసీ ద్వారా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ – వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులు 1.31 లక్షల కోట్లు -
కర్ణాటక ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత వల్లే ఓటమిపాలైందని భావిస్తున్నట్లు తెలిపారాయన. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ వ్యతిరేకతకు బహుశా అక్కడి ఎమ్మెల్యేల పని తీరు కూడా కొంత కారణం కావొచ్చు. నరేంద్ర మోదీపై అక్కడి ప్రజలకు అభిమానం ఉన్నప్పటికీ.. ఫలితాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా వచ్చాయి. కానీ, పార్లమెంట ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుస్తామని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కర్ణాటకలో మాదిరే తెలంగాణలోనూ ఇక్కడి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉంది. ఇక్కడ ప్రతిపక్షంగా మేం ప్రభుత్వ నిరంకుశ పాలనను, పనితీరును ఎండగడుతున్నాం. కాబట్టి, తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం అని తెలిపారాయన. ఇదీ చదవండి: కాంగ్రెస్ విక్టరీ.. సంక్షేమ హామీలు పని చేశాయి -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో ఈ కేసులో దొంగల ముసుగులు తొలిగాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనటంపై కౌంటర్ ఇచ్చారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అయ్యిందని ఆరోపించారు. హైదబారాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి కేటీఆర్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగల ముసుగులు తొలిగాయి. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మమేంటి? దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారు. నేరం చేసిన వాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోరు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటకు వస్తున్నారు.’ అని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఇదీ చదవండి: హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి -
సహనానికి హద్దుంటుంది.. టీఆర్ఎస్కు కేంద్రమంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బతికి ఉన్నవారికీ సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టీఆర్ఎస్ తెర తీసిందని, కనీస నైతిక, మానవతా విలువలు, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట సమాధి కట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా.. ఆయన మీద ఎందుకు ఈ అక్కసు’అని ప్రశ్నించారు. బతికున్న వ్యక్తికి సమాధి కట్టే నీచ, నికృష్ట చర్యలకు దిగడం ద్వారా అన్ని పరిమితులు, లక్షణరేఖను టీఆర్ఎస్ దాటి దిగజారిందని మండిపడ్డారు. గతంలో తన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారని, తమ సహనాన్ని అసమర్థతగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా తెలంగాణను మారుస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపెడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలతో తొండి చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు. దత్తత అంటారు.. ఆ తర్వాత మర్చిపోతారు.. ‘ఒక ముఖ్యమంత్రి ఉపఎన్నికలో ఒక గ్రామానికి ఇన్‌చార్జీగా ఉండటమనేది గతంలో ఎప్పుడూ లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇస్తారు. ఆ తరువాత మర్చిపోతారు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ పెడతామని తాము ఎప్పుడు హామీ ఇవ్వలేదని, స్టీల్ ప్లాంట్ కడతామని కేసీఆర్, కేటీఆర్‌లే హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో కమిషన్లు లేకుండా కాంట్రాక్ట్‌లు లేవని, కల్వకుంట్ల కుటుంబం దోచుకోని రంగం లేదని, ఉద్యమకారులను వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు వదిలి పెట్టే సమయం వచ్చిందన్నారు. ‘మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీద ఒత్తిడి తెచ్చారు. కోర్ట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసీఆర్ ఇష్ట ప్రకారం గుర్తుల కేటాయింపు జరగదు, దానికి ఓ పద్ధతి ఉంటుంది’అని కిషన్‌రెడ్డి అన్నారు. -
ఏడాది పాటు విమోచన దినోత్సవాలు
రసూల్‌పుర : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూరైన సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అందులోభాగంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. శుక్రవారం పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కిషన్‌రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...విమోచన దినోత్సవాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఆధ్వర్యంలో నేడు జరగనున్న కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహరాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే హాజరవుతారని చెప్పారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌లతో పాటు మొత్తం 12 సైనికదళాలు (రెండు మహిళా బృందాలతో సహా) ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొని దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, చక్రాల కుర్చీలు, కృత్రిమ తయారీ పరికరాలు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డా, ప్రకాశ్‌రెడ్డి, రాకేశ్, శ్రీవర్ధన్, రాముయాదవ్, చింతల రాం చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు -
జూలై 4న భీమవరానికి ప్రధాని మోదీ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: ప్రధాని మోదీ జూలై 4న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పర్యటించే అవకాశా లున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్స వాలను మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ బన్సీలాల్ పేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడి యాతో మాట్లాడుతూ ఇప్పటికే ఏపీలో ట్రైబల్ మ్యూజియం పనులు మొదలుకాగా, ఇక్కడ అలాంటి మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కనీసం స్థలం కూడా కేటాయించ లేదన్నారు. సీఎం కేసీఆర్ ‘భారత్ రాష్ట్రీయ సమితి’ పెట్టబోతు న్నారన్న దానిపై స్పందించాలని విలేకరులు కోరగా.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవటం లేదు, దేశాన్ని పంచుకోవాలనుకుంటు న్నారని కిషన్‌రెడ్డి ఆరో పించారు. కేసీ ఆర్ జాతీయ నాయకుడిగా ఎదగడంలో తప్పులేదన్నారు. కుటుంబ పార్టీలకు అండగా ఉంటారా? దేశాన్ని కాపాడే వారికి అండగా ఉంటారనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అలగే రాష్ట్రంలో టీఆర్ఎస్ కుటుంబపాలనను అంతమొందించడానికి, ఫామ్ హౌస్ పాలన పోవడానికి ప్రజలు బీజేపీకి అండగా ఉండాలని కోరారు. -
స్వల్పకాలంలో అనితరసాధ్య ప్రగతి..!
ప్రజాసేవలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే అనేక రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. మహమ్మారి సమయంలో టీకాల సరఫరాలో చూపిన చొరవ, సుపరిపాలన కోసం చేపట్టిన అనేక సంస్కరణలు, పేదలకు అన్ని విధాలుగా అండగా ఉండటం ఈ ఎనిమిదేళ్లలో ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి. అలాగే సహకార సమాఖ్య వ్యవస్థను పరిరక్షిస్తూ, రాష్ట్రాలకు అందవలసిన పన్నుల వాటాను కేంద్రం సక్రమంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంక్ ఖాతాలను పేద ప్రజల కోసం తెరిచింది. సుమారుగా 3 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి. 9 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు, 18 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరిగింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్‌పై వేస్తున్న పన్నును తగ్గించుకొని ప్రజలకు ఉపశమనం కలిగిం చాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో పెట్రోల్‌పై లీటరుకు రూ. 9.5, డీజిల్‌పై లీటరుకు రూ. 7, వంటగ్యాస్‌పై రూ. 200 చొప్పున తగ్గింది. గత 2021 నవంబర్‌లో కూడా పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 5, డీజిల్‌పై లీటర్‌కు రూ. 10 చొప్పున తగ్గించింది. గత ఆరు నెలల్లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. ఇలా రెండు సార్లు తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వం మీద రూ. 2.20 లక్షల కోట్ల రూపాయల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దేశంలో మౌలిక వసతుల కల్పన, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. 2014–22 వరకు 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అభివృద్ధి వ్యయం రూ. 90.9 లక్షల కోట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం 8 సంవత్సరాలలో ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలపై ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం రూ. 24.85 లక్షల కోట్లు. మూలధన సృష్టి కోసం రూ. 26.3 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రజాసేవలో మోదీ ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సేవ, సుపరిపాలన, గరీబ్ కల్యాణ్ అనే మూడు ప్రాథమిక సూత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. సేవ విష యానికి వస్తే, మహమ్మారి సమయంలో ప్రధాని మోదీ టీకా పరిశో ధన నుండి దాని సరఫరా వరకు ముందుండి నడిపించిన విధానం గురించీ, ఆయన చూపిన చొరవ, అవిశ్రాంత కృషి గురించీ చెప్పు కోవాలి. రెండవది సుపరిపాలన కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు, కార్యక్రమాలు. మూడవదీ, అత్యంత ముఖ్యమైనదీ పేదలకు అండగా ఉండటమే. సహకార సమాఖ్య ద్వారా... మౌలిక వసతుల కల్పన, సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేపట్టిన అనేక రకాల పథకాలు... అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు జరగాలని ప్రధాని భావించారు. అందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని నిర్ధరించారు. అందరూ సమష్టిగా కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమని భావించారు. కో–ఆపరేటివ్ ఫెడరలిజం ఫ్రేమ్ వర్క్‌ను కొనసాగించడంలో భారత ప్రభుత్వం అన్ని అంశాలలో కృషి చేస్తుంది. ఇది స్థూల, సూక్ష్మ స్థాయులు రెండింటిలోనూ చూడవచ్చు. కేంద్ర పన్నుల వికేంద్రీకరణ రూపంలో గరిష్ఠ మొత్తంగా నిధులను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేసేలా నిరంతరంగా చర్యలు తీసు కుంటూనే ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 42%, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 41% కేంద్రం పన్నులలో ఆయా రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నది. అంటే కేంద్రం వసూలు చేసిన 40% కంటే ఎక్కువ పన్నులు ముందుగా రాష్ట్రాలకు నేరుగా తిరిగి వెళ్తాయి. గతంలో 13వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు 32% వాటా ఉంటే, ప్రస్తుత 42% వాటా – అంటే 10% అదనంగా రాష్ట్రాలకు ప్రభుత్వం ఉదారంగా అందిస్తున్నది. నిధుల అధిక వికేంద్రీకరణ ఫలితంగా, భారత ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించిన 9 బడ్జెట్లలో భాగంగా రాష్ట్రాలకు సుమారు రూ. 57 లక్షల కోట్లు బదిలీ చేస్తోంది. సేవా, మౌలిక సదుపాయల కల్పన కోసం ‘మిషన్ – మోడ్’ ఫోకస్ ద్వారా కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చిన నిధులలో 42% నేరుగా రాష్ట్రాలకు బదిలీ అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న 58% నిధులను ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే ప్రశ్న చాలామంది పదే పదే లేవనెత్తుతున్నారు. మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాథమికంగా మౌలిక సదుపాయాలను అందించడంలో నిమగ్నమై ఉంది. ‘ప్రధానమంత్రి గతిశక్తి’లో భాగంగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఉమ్మడి రవాణా, జల మార్గాలతో పాటు లాజిస్టిక్స్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ వంటి ఏడు అభివృద్ధి రంగాల అభివృద్ధికి సమన్వయం కోసం పునాది వేసింది. కేవలం రోడ్లు, రైల్వేల అభివృద్ధి మాత్రమే కాకుండా వైద్య, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్ లాంటి అనేక రంగాలలో సదుపాయాల కల్పనలో దేశం ‘ఆత్మ నిర్భర్’ స్ఫూర్తితో ముందుకు వెళ్లడం జరుగుతోంది. పేద ప్రజల కనీస అవసరాలపై చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా ‘గరీబ్ కల్యాణ్’ నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంక్ ఖాతాలను పేద ప్రజల కోసం తెరిచారు. సుమారుగా 3 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి. దేశ వ్యాప్తంగా 9 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లను అందించాం. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం కోసం అర్హులందరికీ 18 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేయడం జరిగింది. 3 వేలకు పైగా హాస్పిటల్స్‌ను ఈ పథకంలో చేర్చి ప్రజలకు వైద్యాన్ని సులభతరం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలలో, ప్రభుత్వ రంగంలోని 132 వైద్య కళాశాలలు, అలాగే ప్రైవేట్ రంగంలో 77 వైద్య కళాశాలలు ఆమోదం పొందాయి. మోదీ ప్రభుత్వం నిరుపేదల సాధికారత కోసం పనిచేస్తోంది. కోవిడ్ – 19, దాని తర్వాత వచ్చిన ఇబ్బందుల సమయాల్లో దేశంలో 80 కోట్ల మందికి రూ. 3 లక్షల 60 వేల కోట్ల విలువ చేసే బియ్యాన్ని ఉచితంగా అందచేయడం జరిగింది. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ అన్ని విధాల కృషి చేస్తున్నారు. ధాన్య సేకరణ సీజన్లలో 1 కోటి 31 లక్షల మంది రైతుల నుండి దాదాపు 900 లక్షల మెట్రిక్ టన్నుల వరినీ, 50 లక్షల మంది రైతుల నుండి 430 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలనూ కొనుగోలు చేయడం ద్వారా రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోంది. శాంతి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, రాజ కీయ ప్రమేయం ప్రముఖంగా అవసరమయ్యే దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు చాలావరకు పరిష్కారానికి నోచుకున్నాయి. జమ్మూ– కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఫలితంగా ‘ఒకే దేశం, ఒక రాజ్యాంగం’ చిరకాల ప్రతిష్ఠాత్మక లక్ష్యం నెరవేరింది. ఈశాన్య ప్రాంతం శాంతి యుత వాతావరణం చూడగలుగుతోంది. ఈశాన్య ప్రాంతంలో మిలి టెంట్ల కారణంగా ఏర్పడే ఉద్రిక్త సంఘటనలు 74% తగ్గాయి, పౌరుల మరణాలు 84% తగ్గాయి. మనం శాంతిపై దృష్టి పెడుతూనే మన దేశ రక్షణకు సంబంధించిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకున్నాం. దానితో పాటు మన రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను కూడా పెంపొం దించుకున్నాం. ఉరీ, బాలాకోట్ వైమానిక దాడులకు ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజీ పడదని ప్రపంచానికి చాటి చెప్పాం. వలస పాలన నుండి స్వాతంత్య్రం పొందిన 75వ సంవత్సరాన్ని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద భారతదేశం వివిధ కార్య క్రమాల ద్వారా స్మరించుకుంటోంది. రాబోయే 25 ఏళ్లలో మనం చూడాలనుకునే సుసంపన్నమైన, బలమైన భారతదేశం కోసం విధాన పరమైన నమూనాలను నిర్ణయించేందుకు ఇది అవకాశం ఇస్తుంది. గత 8 సంవత్సరాలలో గణనీయమైన విజయాలను మోదీ ప్రభుత్వం సాధించింది. పైనచెప్పినవి ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘మనం గమ్యస్థానానికి చేరేముందు ఎన్నో మైళ్ల దూరం ప్రయా ణించాల్సి ఉంటుంద’న్న ప్రధానమంత్రి మాటలు మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేద్దాం, రండి! వ్యాసకర్త: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి -
కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్‌లో తవ్వకాలు జరిపాలని భారత పురావస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్ మినార్ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కెర్లు కొట్టడంతో.. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. మరోవైపు శనివారం కుతుబ్‌మినార్‌ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించెదవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్ సందర్శనేని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 12వ శతాబ్ధానికి చెందినదిగా భావిస్తున్న కుతుబ్‌మినార్ కట్టడపు కాంప్లెక్స్‌లో ఉన్న రెండు గణేష్ విగ్రహాలను.. తదుపరి ఆదేశాల ఇచ్చేంతవరకు తొలగించవద్దని గతంలో ఢిల్లీ కోర్టు ASIని ఆదేశించింది. రెండు విగ్రహాలను ‘ఉల్టా గణేష్’, ‘పంజరంలో వినాయకుడు’గా పిలుస్తున్నారు. కుతుబ్‌మినార్‌ను UNESCO 1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఆ ఆలయాలను పునర్నిర్మించాలి దేశంలో ఒకప్పుడు ధ్వంసం చేసిన ఆలయాలన్నిటినీ పునర్నిర్మించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో పోర్చుగీసు పరిపాలనలో ధ్వంసమైన ఆలయాలను తిరిగి నిర్మించడానికి తాము బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గోవాలో సాంస్కృతిక టూరిజంను కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని సావంత్ తెలిపారు. చదవండి: అది కుతుబ్‌మినార్ కాదు.. సూర్య గోపురం!! -
అంతర్జాతీయ చైతన్య గీతిక
భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. 2014లో ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు మానవాళికి యోగా ఒక సాధనమైంది. మరో 50 రోజుల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఆ రోజు అందరం సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృ త్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014 మే నెలలో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన జీవన వ్యవస్థపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. 2014 నవంబర్‌లో ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయడం ద్వారా ఆయుర్వేదం, యోగా వంటి ఏడు సంప్రదాయ భారతీయ పద్ధతులను ప్రజారోగ్య సంక్షేమ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. 2014 డిసెంబర్ నాటికి ఐక్యరాజ్య సమితిలోని 177 దేశాలు కలిసి యోగా ఆవశ్యకతను అంగీకరించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. 2016 జూన్‌లో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ... యోగా విషయంలో భారతదేశం మేధా సంపత్తి హక్కులను (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) తీసుకోలేదనీ, భారతీయ జ్ఞానసంపద సమస్త మానవాళికి నిరంతరం అందుబాటులోనే ఉంటుందనీ పేర్కొన్నారు. ‘యోగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజ లందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశం ఇచ్చిన విలువైన కానుక’ అని వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ప్రధాన మంత్రి బహిరంగంగానే వెల్లడించారు. ఇది అందరి ఆస్తి యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి, సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావననూ, ప్రాపంచిక దృక్పథాన్నీ బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించాయి. తూర్పున ఉన్న వ్లాదివస్తోక్ నుంచి పశ్చిమాన ఉన్న వాంకోవర్ వరకు, దక్షిణాన ఉన్న కేప్‌టౌన్ నుంచి ఉత్తరాన ఉన్న కోపెన్హాగన్ వరకు ప్రతి నగరం యోగాలోని శక్తినీ, రోగనిరోధక సామర్థ్యాన్నీ గుర్తించి వినియో గంలోకి తీసుకొచ్చింది. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న వారందరూ... ఆనందకర జీవితాన్ని పొందుతున్న తీరే ఇందుకు నిదర్శనం. వివిధ వ్యాధులకు సరైన చికిత్స నుంచి మరికొన్ని సమస్యలు రాకుండా నివారించుకునేందుకు యోగా ఓ సాధనంగా మారింది. 21వ శతాబ్దపు ఉరుకులు, పరుగుల జీవితం వల్ల కలిగే ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా యోగా మానవాళి ఆరోగ్యానికి అత్యవసర, నిత్యావసర సాధనకు వేదికైంది. ఎన్డీయే కృషి యోగా అత్యంత ప్రాచీనమైన భారతీయ సంపద అయినప్పటికీ... ఇటీవలి కాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా యోగాను ఆమోదించి తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవడం వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పోషించిన పాత్ర చిరస్మరణీయం, అభినందనీయం. 2014కి ముందు అప్పటి ప్రభుత్వ హయాంలో లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీలు లేవనెత్తిన రెండు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుంటే... యోగా, సంప్రదాయ భారతీయ విజ్ఞాన వ్యవస్థల పట్ల అప్పటి ప్రభుత్వం చూపించిన ఉదాసీనత, నిర్లక్ష్యం ఎలాంటివో చక్కగా అర్థమవుతాయి. 2007 ఆగస్టులో లోక్‌సభలో ‘అమెరికాకు చెందిన పేటెంట్స్, ట్రేడ్ మార్క్ ఆఫీసు వారు యోగాపై మేధా సంపత్తి హక్కులను అమెరికా ప్రభుత్వానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. యోగా భారతీయ సనాతన సంప్రదాయ విధానం అయినందున, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిం చిందా, లేదా?’ అన్న ప్రశ్న వచ్చింది. నాటి ప్రభుత్వం ‘ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలేమీ లేదు’ అని సుస్పష్టంగా సమాధానం ఇచ్చింది. అదే విధంగా 2014 ఫిబ్ర వరిలో, అంటే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యేం దుకు కొద్దిరోజుల ముందు, నాటి ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... మార్చి 2009లో యోగాపై ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ ఇంతవరకు తమ నివేదికను సభకు అందజేయలేదని తెలిపింది. గత ప్రభుత్వాలు యోగా, భారతీయ సనాతన వ్యవస్థ విష యంలో నిర్లిప్తతను ప్రదర్శిస్తే... ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు దక్కేలా కృషి చేసింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే! ఎనిమిదో వేడుకకు సిద్ధం మరో 50 రోజుల్లో అంటే జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకొనేందుకు ప్రపంచం సిద్ధమవుతున్న సందర్భమిది. ఏడాదికేడాది యోగాపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. గతేడాది కరోనా నేపథ్యంలో మన దేశంలో 15 కోట్లకు పైగా మంది అంతర్జాతీయ యోగా ఉత్సవం నాడు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర సాధనకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటున్న ప్రస్తుత తరుణంలో ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడాది వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టడం, మన స్వాతంత్య్ర సంగ్రామంలో సర్వస్వాన్నీ త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఘనకీర్తిని స్మరించుకోవడం, అసువులు బాసిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చేస్తున్నాం. మన సంస్కృతీ సంప్రదాయాలనూ, వైభవోపేతమైన చరిత్రనూ, ఘనమైన వారసత్వ సంపదనూ కాపాడుకునేందుకు నడుం బిగిస్తున్నాం. కలిసి చేద్దాం యోగా! మన చరిత్రనూ, మన సనాతన జీవన విధానాలనూ చెరిపేసేందుకు జరిగిన ఎన్నో కుట్రలను ఎదుర్కొని మన సాంస్కృతిక వైభవాన్ని కాపాడేందుకు మన పెద్దలు చేసిన త్యాగం నిరుపమానమైనది. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన సనాతన జీవన జ్ఞాన సంపదను గుర్తుచేసుకుంటూ, వారు వారసత్వంగా ఇచ్చిన యోగాలో నిగూఢంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను ఘనమైన ఉత్సవంగా జరుపుకొనేందుకూ ఇంతకు మించిన మరో సందర్భం ఏముంటుంది! ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. అయితే దీన్ని మరపురాని ఘట్టంగా మార్చేందుకు ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వేతర సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, యోగా ప్రేమికులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోట్లాది మంది జీవితాల్లో ఓ భాగంగా మారిన యోగాను మరింత ముందుకు తీసుకెళ్లాలి. యోగా ద్వారా మెరుగైన జీవనం, అద్భుతమైన ఆరోగ్యం, ఉత్తమ ఆలోచనలతో పాటు జాతీయ చైతన్య భావన జాగృతమైంది. రండి, అందరూ కలసి రండి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం రోజు మీ ఇంట్లో, మీ బస్తీలో, మీ వాడల్లో, గ్రామాలలో, విద్యా సంస్థలలో, మీ కార్యాలయాలలో యోగా చేయండి. సామూహికంగా, స్వచ్ఛందంగా పాల్గొందాం. మన వారసత్వ సంపదను మన జీవితాలలో నిత్యకృత్యంగా మార్చుకుందాం. వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా
ఢిల్లీ: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. చిన్నపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తనకు కరోనా రావడంతో సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు కిషన్‌రెడ్డి ట్వీటర్ ద్వారా వెల్లడించారు. అన్ని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. I have tested positive for COVID-19 today with mild symptoms. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. I request all those who have recently come in contact with me to isolate themselves and get tested. — G Kishan Reddy (@kishanreddybjp) January 20, 2022 -
సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన కేంద్ర మంత్రి
Union Minister Kishan Reddy Met Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని సాయిధరమ్ తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం రోడ్డు ప్రమాదం, తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్లో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించినందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు సాయిధరమ్ తేజ్. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. రెండు నెలల క్రితం సాయిధరమ్ తేజ్ బైక్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సుమారు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం తన బర్త్‌డే రోజు డిశ్చార్జ్ అయిన సాయిధరమ్ తేజ్ ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటి నుంచి అనేక మంది సాయిధరమ్ తేజ్‌ను వచ్చి కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చి పరామర్శించారు. ఇటీవల సాయిధరమ్ తేజ్ తన ఫ్యాన్స్‌కు ఆడియో ద్వారా సందేశం పంపిన సంగతి తెలిసిందే. Thank you @Kishanreddybjp Garu for making time to affectionately visit me at home despite your busy schedule and for your warm and kind words. Wishing you a great year ahead. pic.twitter.com/Lne2XNv4uJ — Sai Dharam Tej (@IamSaiDharamTej) January 1, 2022 ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు సాయి ధరమ్ తేజ్ వాయిస్ మెసేజ్ -
సిరివెన్నెల మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
AP CM YS Jagan Mourns On Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 చదవండి: సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..? సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు: సీఎం కేసీఆర్ ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహిత్య లోకానికి తీరని లోటు: విశ్వభూషన్ హరిచందన్ ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ ప్రస్తుతించారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు: అవంతి ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. తెలుగు సినిమా సాహిత్యానికి సొబగులు అద్దిన దిగ్గజ సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’.. సీతారామశాస్త్రి మృతి సాహితీ ప్రియులు, సినీ ప్రేమికులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’ అన్నారు మంత్రి అవంతి. సిరివెన్నెల జాతీయ భావజాలం కలిగిన కవి: కిషన్‌రెడ్డి ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులు. జాతీయ భావజాలం కలిగిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. 1985 నుంచి ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. 15 రోజుల కిందటే ఆయన నాకు జాతీయ గీతాల సీడీ ఇచ్చారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’’ అన్నారు కేంద్ర పర్యటక మంత్రి కిషన్ రెడ్డి. -
Telangana: ‘యునెస్కో’కు మరో 25 ప్రతిపాదనలు
సాక్షిప్రతినిధి, వరంగల్: పురాతన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు సాధించడం గర్వకారణంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల తరఫున రామప్పకు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో మరో 25 పర్యాటక ప్రాంతాలను యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపుతామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆయన గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి సబ్సిడీతో అతి తక్కువ విమాన చార్జీలతో పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. 2016 నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని, అయితే అప్పుడు పలు దేశాలు తిరస్కరించాయన్నారు. ఆయా దేశాలతో విదేశాంగ శాఖ తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడి, వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేసేలా చేశారని తెలిపారు. ఇందులోభాగంగా 17 దేశాలు రామప్పకు జై కొట్టాయన్నారు. తెలంగాణలో కాకతీయుల కట్టడాలు శిల్పకళా నైపుణ్యం పరిరక్షించుకోవాలని, నేటి యువతరానికి వాటి గురించి తెలియ చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని చెప్పా రు. తర్వాత కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు వేయిస్తంభాల గుడిని సందర్శించారు. అక్కడి నుంచి కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటకు వెళ్లారు. టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు.