
బీసీ సబ్‌ప్లాన్‌కు బీజేపీ మహాదీక్ష ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారతంలోనూ బలహీనవర్గాలకు తీరని అన్యాయమే జరుగుతోందని, బీసీ సబ్ ప్లానే దీనికి పరిష్కారమంటూ బీజేపీ సోమవారమిక్కడ 48 గంటల మహాదీక్ష చేపట్టింది. ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకూ రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్ చేసింది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోవడం వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొంది. తొలిరోజు దీక్షలో పార్టీ రాష్ట్ర నేతలతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాయకత్వంలో చేపట్టిన ఈ మహాదీక్ష మంగళవారం కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి, అరుణ జ్యోతి, టి.ఆచారీ, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సహా వివిధ కుల సంఘాల నాయకులు ప్రసంగించారు.