
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి పదవి చేపట్టాక దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 130 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ 2.0 పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిందని, అంత్యోదయ స్ఫూర్తి వల్ల లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో మార్పు చోటుచేసుకుందని చెప్పారు. మోదీ నాయకత్వంలో రెండోసారి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలపై కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంలో కేంద్రం అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అనేక అంశాలకు ఈ ఏడాది పాలనలో పరిష్కారం దొరికిందన్నారు. అనంతరం పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
ప్రశ్న: కరోనా నిర్వహణలో కేంద్రం విఫలమైందన్న విమర్శలపై ఏమంటారు?
జవాబు: కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఏ దేశంతో పోల్చి చూసినా మనం మెరుగ్గా ఉన్నాం. కేసులు, మరణాలు, రికవరీ రేటులో మెరుగైన పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ప్రధాని తీసుకున్న చర్యలే. ఆర్థిక ప్యాకేజీ, లాక్‌డౌన్.. ఇలా అన్ని చర్యలను చాలా దేశాలు అభినందించాయి.
ప్రశ్న: లాక్‌డౌన్ ఫెయిలైందని భావించొచ్చా?
జవాబు: లాక్‌డౌన్‌ను ఫెయిల్యూర్ అనలేం. వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చేవారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఒత్తిడి తెచ్చారు. దీంతో మానవీయ కోణంలో వలస కార్మికులను రైళ్లు, బస్సుల ద్వారా పంపాం. లాక్‌డౌన్ ఎత్తివేసినా, పొడిగించినా ఆ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయా?
జవాబు: కరోనా చికిత్సకు ఉద్దేశించిన ప్రత్యేక ఆస్పత్రుల్లో 5 శాతం కూడా వినియోగంలో లేవు. మేం 4,39,244 పడకలు సిద్ధం చేశాం. ఇందులో 80 వేల పడకలు మాత్రమే వినియోగించాం. ఇంకా 3.5 లక్షల పడకలు ఖాళీగానే ఉన్నాయి. 31 వేల వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఉత్పత్తి అవుతోంది. దిగుమతులు కూడా చేసుకుంటున్నాం.
ప్రశ్న: కరోనా టెస్టులకు ఫిక్స్‌డ్ చార్జీలు ఉన్నట్లుగా ప్రైవేటు ఆస్పత్రుల చార్జీలను నియంత్రించే ఆలోచన ఉందా?
జవాబు: ఆయుష్మాన్ భారత్ కింద కరోనా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నాం. మీరు (విలేకరులు) చెప్పిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. కార్పొరేట్ ఆస్పత్రులకు ముకుతాడు వేసి పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా రేట్లు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకొనేందుకు వెనుకంజవేయం.
ప్రశ్న: విరసం నేత వరవరరావు విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని వారి కుటుంబం కోరడంపై ఏమంటారు?
జవాబు: తప్పకుండా. మానవీయ కోణంలో ఆలోచించి చట్టపరిధిలో తగినరీతిలో చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: తెలుగు రాష్ట్రాలకు కిషన్‌రెడ్డి ఈ ఏడాదిలో ఎలాంటి సేవ అందించారు?
జవాబు: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ సమస్య నా దృష్టికి వచ్చినా స్పందించా. భవిష్యత్తులోనూ కృషి చేస్తా.
ప్రశ్న: తెలంగాణలో ఏదైనా సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చేందుకు కృషి చేస్తారా?
జవాబు: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ ప్రకటించలేదు. అవకాశం ఉంటే తప్పకుండా చేస్తుంది. మేం కూడా అందుకోసం పనిచేస్తాం.
ప్రశ్న: రెండు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఎలాంటి చొరవ చూపనుంది?
జవాబు: ఇది గత 70 ఏళ్లుగా ఉన్న సమస్య. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉంది. ఇప్పుడూ ఉంది. రెండు రాష్ట్రాలూ పరస్పరం చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి.
Comments
Please login to add a commentAdd a comment