దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ కూటమిలో భాగస్వామి అయితేనే ప్రయోజనమా అనే చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ విధానాలు, తమ సిద్ధాంతాలు, తమ వెనుక ఉండే ఓట్ బ్యాంక్ ఆధారంగా జాతీయ పార్టీల కూటమిలో కలవాలా? వద్దా? అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు పూర్తి అవకాశవాదంతో ఎటు వెళితే ఉపయోగమని అనుకుంటాయో అటు వెళుతున్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఒకప్పుడు రాష్ట్రాలలోని రాజకీయాలలో అంతగా తలదూర్చేవి కావు. కానీ రాను, రాను అవి కూడా ప్రాంతీయ పార్టీల ధోరణిలో ఆలోచించడం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో పట్టు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా జాతీయ పార్టీలతో చెలిమి చేస్తున్నాయి.
స్వాతంత్రం వచ్చినప్పటినుంచి పలు ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. వాటిలో అనేకం జాతీయ పార్టీలలో విలీనం అవడమో, లేక పొత్తు పెట్టుకుని మనుగడ సాగించడమో చేశాయి. నాయకత్వ స్థాయిని బట్టి అవి కొంతకాలం నిలబడగలుగుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉవ్వెత్తున పైకి లేచినా, అనతికాలంలోనే పడిపోయింది. ఒంటరిగా పోటీచేసి అధికారం సాధించలేకపోవడంతో తర్వాత కాలంలో కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది.
ఉమ్మడి ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో తన ప్రయాణం ఆరంభించి 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దశకు ఎదిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో టీఆర్ఎస్ కూడా ఉంటేనే ఏపీలో అధికారం సాధించగలుగుతామని నాయకత్వం భావించి పొత్తుపెట్టుకుంది. అది ఫలించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయి రెండు చోట్ల అధికారం పొందింది. టీఆర్ఎస్ తెలంగాణ సాధనకు ఏర్పాటైన ఉద్యమ పార్టీ కనుక కొద్దికాలానికే కూటమి నుంచి విడిపోయింది. తదుపరి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఫలితం పొందలేకపోయింది.
ఆ తర్వాత పరిణామాలలో తెలంగాణ రాష్ట్రం రావడం, ఒంటరిగా టీఆర్ఎస్ పోటీ చేసి అధికారం సాధించడంతో పార్టీకి ఖ్యాతి వచ్చింది. తొమ్మిదినర్రేళ్లపాటు పవర్ లో ఉంది. ఆ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ వంటి పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడం విశేషం. కానీ 2023లో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలవడంతో సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అదే టీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో! ఒక దశలో బీజేపీతో స్నేహంగానే ఉన్నా, మరో సందర్భంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సహకరించినా ఒంటరిగానే రాష్ట్రంలో రాజకీయం చేసింది.
ఆ రెండు పార్టీలు ప్రత్యర్ధి పార్టీలుగా మారడంతో బీఆర్ఎస్(పేరు మారిన టీఆర్ఎస్) ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పనిలో పడింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారం సాధించడానికి యత్నిస్తున్న పార్టీ కావడం, బీజేపీ పొత్తు వల్ల తమకు ముస్లిం మైనార్టీల మధ్దతు రాదేమోనన్న అనుమానంతో పొత్తు వైపు బీఆర్ఎస్ చూడలేదు. పైగా తనకు మళ్లీ అధికారం వస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంది. కానీ అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఏదో ఒక కూటమిగానే ఉండడం విశేషం. తొలుత సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నా, తదుపరి కాలంలో బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో స్నేహం సాగించింది.
1994, 1996, 1998లలో వామపక్షాలతో కూటమి కట్టిన టీడీపీ 1999 లో బీజేపీ వైపు జంప్ చేసింది. 2004లో ఓటమి తర్వాత 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీచేసింది. అది ఫలించలేదు. దాంతో తిరిగి 2014 నాటికి బీజేపీతో జత కట్టి లాభం పొందింది. అప్పుడే ఏర్పడిన జనసేన కూడా ఉపయోగపడింది. 2018లో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ కూటమిలో టీడీపీ చేరి తెలంగాణలో పోటీ చేసింది. అది సఫలం కాకపోవడంతో 2019 ఏపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అలాగే జనసేన కూడా 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కూటమి కట్టినా ప్రయోజనం కలగలేదు. దానిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది.
పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ అధినాయకత్వం ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఖర్చీఫ్ వేసింది. ఈలోగా టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించి తన తరపున పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వ్యూహాలలో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి. తొలుత బీజేపీకి అంత ఇష్టం లేకపోయినా, జనసేన ఒత్తిడితో మళ్లీ టీడీపీని ఎన్డీఏ లో చేర్చుకున్నారు. అది సత్ఫలితాన్ని ఇచ్చి రాష్ట్రంలో అధికారం పొందడమే కాక, కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇచ్చే దశకు టీడీపీ చేరుకుంది.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్సార్సీపీను ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే ప్రయాణం సాగించారు. దానినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 2019లో విజయం తర్వాత వైఎస్సార్సీపీ కనుక ఎన్డీఏ లో చేరి ఉన్నట్లయితే కేంద్రంలో తనకు మంచి పట్టు లభించినట్లయ్యేది. కానీ తన వెనుక ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కువగా బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉంటుందన్న భావనతో అలా చేయలేకపోయారు. కానీ ప్రధాని మోదీతో ఉన్న స్నేహం కారణంగా, కాంగ్రెస్ తో సరిపడదు కనుక ఎన్డీఏకే అవసరమైన అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి వారి అభిమానాన్ని పొందారు.
2024 ఎన్నికల ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం వైఎస్సార్సీపీకి పొత్తు ఆఫర్ ఇచ్చినా అందుకు సిద్దపడలేదని చెబుతారు. ఒకవైపు చంద్రబాబు జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన అవకాశాలను మెరుగుపరచుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ఉన్న ఆత్మ విశ్వాసంతో దెబ్బతిన్నారనిపిస్తుంది. చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఇప్పుడు కలవగలిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ మోదీపై విమర్శలు చేయలేదు. కానీ ఎన్డీఏతో జతకట్టడానికి సిద్దపడలేదు. ప్రస్తుతం రాజ్యసభలో పదకుండు మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు వైఎస్సార్సీపీకి ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏతో సంబంధాలు మెరుగుపరచుకోవడం మంచిదని చెప్పాలి. అలా వైఎస్సార్సీపీ చేస్తుందో, లేదో తెలియదు.
ఒడిషాలో బిజు జనతాదళ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. బీజేపీతో పొత్తు చర్చలు విఫలం అవడంతో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అదే ఎలాగొలా రాజీపడి పొత్తుపెట్టుకుని ఉంటే నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారేమో! అంటే జాతీయ పార్టీతో పొత్తుతో చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి నేతలు రాజకీయంగా, ఇతరత్రా లబ్దిపొందుతుండడం గమనించదగ్గ అంశం.
ఇతర రాష్ట్రాలను చూస్తే తమిళనాడులో డీఎంకే గత కొంతకాలంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇది ఈసారి లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రతిఫలించింది. అన్నా డీఎంకే గతంలో మాదిరి బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా నష్టపోయింది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంటూ జాతీయ స్థాయిలో ఒక అండ పొందిందని చెప్పాలి. అదే సమయంలో రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంలతో పోటీ పడుతోంది. ఇదేమీ కొత్త కాదు. కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు పరస్పరం పోటీ పడుతాయి. ఢిల్లీ స్థాయిలో మాత్రం కలిసి ఒక కూటమిగా ఉంటున్నాయి. అలాగే వైఎస్సార్సీపీ వంటి పార్టీలు కూడా ఆ తరహా ప్రయత్నాలు చేస్తాయా? లేదా? అన్నది చూడాలి.
ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ మొన్నటి వరకు ఏ కూటమిలో లేదు. బీజేపీ నుంచి తీవ్రమైన సమస్యలు ఎదుర్కుంటోంది. మద్యం స్కామ్ పేరుతో ఆప్ ను బీజేపీ దడదడలాడిస్తోందన్న భావన ఉంది. దాంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇండి కూటమిలో చేరారు. బీహారులో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలం కాంగ్రెస్, ఆర్జెడిలతో కలిసి, మరికొంతకాలం బీజేపీతో కలిసి రాజకీయం సాగిస్తూ ఇంతవరకు సఫలం అయ్యారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన బీజేపీతో జట్టుకట్టడం ఉపయోగపడింది.
ఢిల్లీ స్థాయిలో కీలకమైన వ్యక్తిగా మారారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్.సీ.సీలలో చీలిక తెచ్చి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కర్నాటకలో బీజేపీతో జెడిఎస్ జట్టుకట్టడం వల్ల కేంద్రంలో ఆ పార్టీ అధినేత కుమారస్వామి మంత్రి కాగలిగారు. జమ్ము-కశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉంటాయి. సిక్కింలో ఘన విజయం సాధించిన సిక్కిం ప్రాంతీయ పార్టీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తోంది.
ఓవరాల్ గా చూసినప్పుడు వీలైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీతో కూటమిలో భాగస్వామి అవడమో లేదా సత్సంబంధాలు పెట్టుకోవడమో చేయక తప్పని పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకు ఏర్పడుతున్నట్లు అనిపిస్తుంది. అధికార పార్టీతో వీలు కాకపోతే ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో అయినా చేరితే ఏదో ఒక అండ దొరికినట్లవుతుందన్న భావన ఏర్పడుతోంది. దేశ రాజకీయాలలో ఇది అత్యంత కీలమైన పరిణామంగా కనిపిస్తుంది. లేకుంటే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment