కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశం అంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు టీడీపీవారు. తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు ఆశించినా రెండు మాత్రమే లభించాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు లభించింది.
వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత. భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా, ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు అవుతారని ఎవరూ ఊహించలేదు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమనడానికి వర్మ ఒక ఉదాహరణ అవుతారు. ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆయన టీవీ షోలలో బీజేపీ తరపున చర్చలలో పాల్గొంటుండేవారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.
తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీచేయాలని వైఎస్సార్‌సీపీ దూరం అయిన సిట్టింగ్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పక్షం సీటు ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని అందువల్లే టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీవారు చెప్పినా, అది సాకు అని చాలా మంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి స్థానం నుంచి పోటీచేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఈయనే ప్రముఖుడుగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్చించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ, పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడ నుంచి గెలుస్తారా? లేదా? అనే సంశయం తొలుత ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ తన అభ్యర్ధిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం వర్మకు కలిసి వచ్చిందని చెప్పాలి.
నరసాపురంలో ఎక్కువసార్లు క్షత్రియవర్గం వారే ఎంపీలు అవుతూ వచ్చారు. ఆ సామాజికవర్గం తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారి పలుకుబడి చాలా పెద్దదిగా భావిస్తారు. అదంతా వర్మకు ప్లస్ పాయింట్ అయింది. మనిషి కూడా సౌమ్యుడుగా పేరొందారు. అన్నీ కలిసి వచ్చి వర్మ ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఇది కలయో, నిజమో అనుకునేంతలోనే ఈ రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. రాజకీయాలలో కాకలు తీరిన సీ.ఎమ్ రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలను కాదని వర్మవైపు బీజేపీ మొగ్గుచూపి కేంద్రంలో స్థానం కల్పించారు. ఒకరకంగా రమేష్, పురందేశ్వరిలకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమే అయినా, దాని గురించి మాట్లాడకపోవచ్చు.
పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014, 2019లలో పోటీచేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మాజీ సీఎం ఎన్.టి రామారావు కుమార్తెగా కూడా ఆమె అందరికి తెలిసిన నేతగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నం చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం రాలేదు. స్పీకర్ లేదా, డిప్యూటి స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.
ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యభూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునేలా అధిష్టానాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారని చెబుతారు. ఆ తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టిక్కెట్ సాధించగలిగారు.
కడప జిల్లాకు చెందినవారైనప్పటికీ, తన అంగ, అర్ధ బలంతోపాటు, అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసినవారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా ఆయన విజయం సాధించిన తర్వాత కచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్ సభకు ఎన్నికై మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతే.
రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ప్రంట్ టైమ్ లో మంత్రి పదవి చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ టైమ్ లో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జి.ఎమ్.సి బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. కానీ గుజరాత్ పరిణామాల నేపథ్యంలో పదవి తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో ఎర్రన్నాయుడు కు మళ్లీ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు పదవి దక్కడం విశేషం. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు, కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ భాషలలో పట్టు ఉండడం ఈయనకు కలిసి వచ్చే పాయింట్ అని చెప్పాలి. యువకుడు, పార్టీకి కట్టుబడి పనిచేయడం ప్లస్ అయింది. టీడీపీ ఎంపీలలో వరసగా మూడుసార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గల్లా జయదేవ్ పోటీచేయకపోవడంతో రామ్మోహన్ కు పోటీ లేకపోయిందని చెప్పవచ్చు.
గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా కేంద్రంలో పదవి రావడం విశేషం. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈయనకు చాన్స్ వస్తుందన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. ఆరువేల కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి. బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉండేవారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి మచిలీపట్నంలో గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్దపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అంబర్ పేట నుంచి ఓటమి చెందడమే ఈయనకు వరం అయింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించడం, మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కడం జరిగిపోయాయి. ఆ రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో క్యాబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. ప్రజలతో మమేకం అవడం ద్వారా ఆదరణ చూరగొన్నారు. మరో నేత బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్తానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం.
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పొందినా, తదుపరి కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్ గా అనతికాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యపరచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. దానిని గుర్తించిన పార్టీ నాయకత్వం పార్టీలో జాతీయ హోదా కల్పించింది. తిరిగి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది.
సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటల రాజేందర్ లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినందున అరుణకు అవకాశం ఉండదు. అలాగే బండి సంజయ్ కు లభించిన తర్వాత ఈటలకు చాన్స్ రాదు. కాకపోతే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఈటల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కున్నారు. ఒక షెల్టర్ గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందినా, మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు.
మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు అందుకే పదవులు దక్కాయి. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, డి.కె అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. ముగ్గురు అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికి అభినందనలు చెబుదాం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment