All political parties
-
గెలుపులు.. మలుపులు.. ప్రాంతీయ పార్టీల ‘జాతీయ’ బంధాలు..
దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ కూటమిలో భాగస్వామి అయితేనే ప్రయోజనమా అనే చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ విధానాలు, తమ సిద్ధాంతాలు, తమ వెనుక ఉండే ఓట్ బ్యాంక్ ఆధారంగా జాతీయ పార్టీల కూటమిలో కలవాలా? వద్దా? అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు పూర్తి అవకాశవాదంతో ఎటు వెళితే ఉపయోగమని అనుకుంటాయో అటు వెళుతున్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఒకప్పుడు రాష్ట్రాలలోని రాజకీయాలలో అంతగా తలదూర్చేవి కావు. కానీ రాను, రాను అవి కూడా ప్రాంతీయ పార్టీల ధోరణిలో ఆలోచించడం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో పట్టు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా జాతీయ పార్టీలతో చెలిమి చేస్తున్నాయి.స్వాతంత్రం వచ్చినప్పటినుంచి పలు ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. వాటిలో అనేకం జాతీయ పార్టీలలో విలీనం అవడమో, లేక పొత్తు పెట్టుకుని మనుగడ సాగించడమో చేశాయి. నాయకత్వ స్థాయిని బట్టి అవి కొంతకాలం నిలబడగలుగుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉవ్వెత్తున పైకి లేచినా, అనతికాలంలోనే పడిపోయింది. ఒంటరిగా పోటీచేసి అధికారం సాధించలేకపోవడంతో తర్వాత కాలంలో కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది.ఉమ్మడి ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో తన ప్రయాణం ఆరంభించి 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దశకు ఎదిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో టీఆర్ఎస్ కూడా ఉంటేనే ఏపీలో అధికారం సాధించగలుగుతామని నాయకత్వం భావించి పొత్తుపెట్టుకుంది. అది ఫలించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయి రెండు చోట్ల అధికారం పొందింది. టీఆర్ఎస్ తెలంగాణ సాధనకు ఏర్పాటైన ఉద్యమ పార్టీ కనుక కొద్దికాలానికే కూటమి నుంచి విడిపోయింది. తదుపరి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఫలితం పొందలేకపోయింది.ఆ తర్వాత పరిణామాలలో తెలంగాణ రాష్ట్రం రావడం, ఒంటరిగా టీఆర్ఎస్ పోటీ చేసి అధికారం సాధించడంతో పార్టీకి ఖ్యాతి వచ్చింది. తొమ్మిదినర్రేళ్లపాటు పవర్ లో ఉంది. ఆ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ వంటి పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడం విశేషం. కానీ 2023లో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలవడంతో సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అదే టీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో! ఒక దశలో బీజేపీతో స్నేహంగానే ఉన్నా, మరో సందర్భంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సహకరించినా ఒంటరిగానే రాష్ట్రంలో రాజకీయం చేసింది.ఆ రెండు పార్టీలు ప్రత్యర్ధి పార్టీలుగా మారడంతో బీఆర్ఎస్(పేరు మారిన టీఆర్ఎస్) ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పనిలో పడింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారం సాధించడానికి యత్నిస్తున్న పార్టీ కావడం, బీజేపీ పొత్తు వల్ల తమకు ముస్లిం మైనార్టీల మధ్దతు రాదేమోనన్న అనుమానంతో పొత్తు వైపు బీఆర్ఎస్ చూడలేదు. పైగా తనకు మళ్లీ అధికారం వస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంది. కానీ అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఏదో ఒక కూటమిగానే ఉండడం విశేషం. తొలుత సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నా, తదుపరి కాలంలో బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో స్నేహం సాగించింది.1994, 1996, 1998లలో వామపక్షాలతో కూటమి కట్టిన టీడీపీ 1999 లో బీజేపీ వైపు జంప్ చేసింది. 2004లో ఓటమి తర్వాత 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీచేసింది. అది ఫలించలేదు. దాంతో తిరిగి 2014 నాటికి బీజేపీతో జత కట్టి లాభం పొందింది. అప్పుడే ఏర్పడిన జనసేన కూడా ఉపయోగపడింది. 2018లో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ కూటమిలో టీడీపీ చేరి తెలంగాణలో పోటీ చేసింది. అది సఫలం కాకపోవడంతో 2019 ఏపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అలాగే జనసేన కూడా 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కూటమి కట్టినా ప్రయోజనం కలగలేదు. దానిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ అధినాయకత్వం ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఖర్చీఫ్ వేసింది. ఈలోగా టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించి తన తరపున పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వ్యూహాలలో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి. తొలుత బీజేపీకి అంత ఇష్టం లేకపోయినా, జనసేన ఒత్తిడితో మళ్లీ టీడీపీని ఎన్డీఏ లో చేర్చుకున్నారు. అది సత్ఫలితాన్ని ఇచ్చి రాష్ట్రంలో అధికారం పొందడమే కాక, కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇచ్చే దశకు టీడీపీ చేరుకుంది.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్సార్సీపీను ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే ప్రయాణం సాగించారు. దానినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 2019లో విజయం తర్వాత వైఎస్సార్సీపీ కనుక ఎన్డీఏ లో చేరి ఉన్నట్లయితే కేంద్రంలో తనకు మంచి పట్టు లభించినట్లయ్యేది. కానీ తన వెనుక ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కువగా బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉంటుందన్న భావనతో అలా చేయలేకపోయారు. కానీ ప్రధాని మోదీతో ఉన్న స్నేహం కారణంగా, కాంగ్రెస్ తో సరిపడదు కనుక ఎన్డీఏకే అవసరమైన అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి వారి అభిమానాన్ని పొందారు.2024 ఎన్నికల ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం వైఎస్సార్సీపీకి పొత్తు ఆఫర్ ఇచ్చినా అందుకు సిద్దపడలేదని చెబుతారు. ఒకవైపు చంద్రబాబు జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన అవకాశాలను మెరుగుపరచుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ఉన్న ఆత్మ విశ్వాసంతో దెబ్బతిన్నారనిపిస్తుంది. చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఇప్పుడు కలవగలిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ మోదీపై విమర్శలు చేయలేదు. కానీ ఎన్డీఏతో జతకట్టడానికి సిద్దపడలేదు. ప్రస్తుతం రాజ్యసభలో పదకుండు మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు వైఎస్సార్సీపీకి ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏతో సంబంధాలు మెరుగుపరచుకోవడం మంచిదని చెప్పాలి. అలా వైఎస్సార్సీపీ చేస్తుందో, లేదో తెలియదు.ఒడిషాలో బిజు జనతాదళ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. బీజేపీతో పొత్తు చర్చలు విఫలం అవడంతో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అదే ఎలాగొలా రాజీపడి పొత్తుపెట్టుకుని ఉంటే నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారేమో! అంటే జాతీయ పార్టీతో పొత్తుతో చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి నేతలు రాజకీయంగా, ఇతరత్రా లబ్దిపొందుతుండడం గమనించదగ్గ అంశం.ఇతర రాష్ట్రాలను చూస్తే తమిళనాడులో డీఎంకే గత కొంతకాలంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇది ఈసారి లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రతిఫలించింది. అన్నా డీఎంకే గతంలో మాదిరి బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా నష్టపోయింది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంటూ జాతీయ స్థాయిలో ఒక అండ పొందిందని చెప్పాలి. అదే సమయంలో రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంలతో పోటీ పడుతోంది. ఇదేమీ కొత్త కాదు. కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు పరస్పరం పోటీ పడుతాయి. ఢిల్లీ స్థాయిలో మాత్రం కలిసి ఒక కూటమిగా ఉంటున్నాయి. అలాగే వైఎస్సార్సీపీ వంటి పార్టీలు కూడా ఆ తరహా ప్రయత్నాలు చేస్తాయా? లేదా? అన్నది చూడాలి.ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ మొన్నటి వరకు ఏ కూటమిలో లేదు. బీజేపీ నుంచి తీవ్రమైన సమస్యలు ఎదుర్కుంటోంది. మద్యం స్కామ్ పేరుతో ఆప్ ను బీజేపీ దడదడలాడిస్తోందన్న భావన ఉంది. దాంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇండి కూటమిలో చేరారు. బీహారులో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలం కాంగ్రెస్, ఆర్జెడిలతో కలిసి, మరికొంతకాలం బీజేపీతో కలిసి రాజకీయం సాగిస్తూ ఇంతవరకు సఫలం అయ్యారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన బీజేపీతో జట్టుకట్టడం ఉపయోగపడింది.ఢిల్లీ స్థాయిలో కీలకమైన వ్యక్తిగా మారారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్.సీ.సీలలో చీలిక తెచ్చి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కర్నాటకలో బీజేపీతో జెడిఎస్ జట్టుకట్టడం వల్ల కేంద్రంలో ఆ పార్టీ అధినేత కుమారస్వామి మంత్రి కాగలిగారు. జమ్ము-కశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉంటాయి. సిక్కింలో ఘన విజయం సాధించిన సిక్కిం ప్రాంతీయ పార్టీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తోంది.ఓవరాల్ గా చూసినప్పుడు వీలైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీతో కూటమిలో భాగస్వామి అవడమో లేదా సత్సంబంధాలు పెట్టుకోవడమో చేయక తప్పని పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకు ఏర్పడుతున్నట్లు అనిపిస్తుంది. అధికార పార్టీతో వీలు కాకపోతే ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో అయినా చేరితే ఏదో ఒక అండ దొరికినట్లవుతుందన్న భావన ఏర్పడుతోంది. దేశ రాజకీయాలలో ఇది అత్యంత కీలమైన పరిణామంగా కనిపిస్తుంది. లేకుంటే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జమిలి ఎన్నికలు ఎన్నడు?
'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి వుంది. ఈ లోపు నిర్ణయం వెలువడి ఎన్నికలు జమిలిగా జరుగతాయని అనుకోవడం సత్యదూరమనే చెప్పాలి.ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు.మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. ఇప్పటివరకూ సుమారు 5వేలకు పైగా ఈ - మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ జనవరి 15లోపు పంపాలని ఇప్పటికే తెలియజేసారు. ఇప్పటి వరకూ రెండు సార్లు సమావేశాలు జరిగాయి. కేంద్రం ఇటీవలే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాలతో తమ ఇదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు. అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తృణమూల్ పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తున్నారు. ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2024లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని లా కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి.వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి.కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి.ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది. అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి. ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా బలహీనంగా ఉంది.తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది.కొన్ని నెలల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి. ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ కూడా బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు. సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి.ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు. 2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
పొలిటికల్ పటాకులు.. పేలుతున్న డైలాగులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఐదేళ్లకోసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల పండుగకు ఈసారి దీపావళి తోడైంది. ఈ వేడుకలు అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గుర్తుకువచ్చేది టపాసులే. తోకబాంబుల నుంచి చిచ్చుబుడ్లు, రాకెట్లు, బాంబులు, భూచక్రాలు తదితరాలను ఎంతో ఇష్టపడి కాలుస్తుంటారు. ఓవైపు దీపావళికి జనాలు సిద్ధమవుతున్న తరుణంలో నాయకులు తమ విమర్శలకు పదును పెడుతున్నారు. మాటలను తూటాలుగా చేసి, ప్రత్యర్థులపై సంధిస్తున్నారు. సీనియర్ నాయకులు మరో అడుగు ముందుకేసి, తమ ఆరోపణాస్త్రాలను టపాసుల్లా పేలుస్తున్నారు. తమ నోటి నుంచి వచ్చే ఆరోపణలు, మాటలు, హామీలను చిచ్చుబుడ్డి, రాకెట్, భూచక్రాలు, తోక పటాకుల్లా సందర్భాన్ని బట్టి తమకు అనుకూలంగా మలచుకొని, ప్రయోగిస్తున్నారు. ఇవి పేలగానే జనాలు చప్పట్లతో స్వాగతిస్తున్నారు. అలాంటి తూటాల్లాంటి మాటలు కొన్నింటిని గుర్తు చేసుకుందాం! తెలంగాణతో నాది కుటుంబ బంధం! ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అనేక పంచ్ డైలాగులు విసిరారు. అందులో తెలంగాణతో నాది రాజకీయ బంధం కాదు, కుటుంబ బంధం అంటూ సభికులను కలుపుకుపోతూ చెప్పిన మాటలు వారి మనసును రాకెట్లలా తాకాయి. రాహుల్‌కు ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా? ఇటీవల ధర్మపురిలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్‌కు ఎద్దు ఎరుకనా? ఎవుసం ఎరుకనా? ఏమీ తెలియని వాడు కూడా ధరణిని తొలగిస్తాం అంటున్నాడని వ్యాఖ్యానించారు. గులుగుడు గులుగుడే.. గుద్దుడు.. గుద్దుడే! సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ కొన్ని రోజులుగా ప్రతీ వేదిక మీద చెబుతున్న భూచక్రాల్లాంటి మాటలివి. ప్రజలంతా తమవైపే ఉన్నారని, ఒకరిద్దరు వ్యతిరేకంగా ఉన్నా.. కారుకే ఓటేస్తారని చెప్పే క్రమంలో గులుగుడు.. గులుగుడే.. గుద్దుడు.. గుద్దుడే అన్న మాటలు ట్రెండ్ అవుతున్నాయి. సంక్షేమమా? సంక్షోభమా? హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్‌కు హాజరైన మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే ఈటల మాటలకు మోసపోవద్దని, బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని అన్నారు. సంక్షోభం కావాలా? సంక్షేమం కావాలా? తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఐదేళ్లు నా రక్తం ధారపోస్తా! అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో 20 రోజులు కష్టపడండి.. రాబోయే ఐదేళ్లు నా రక్తాన్ని ధారపోస్తా అని మంత్రి గంగుల కమలాకర్ అన్న మాటలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడే పుట్టిన.. ఈ గడ్డ మీద పెరిగిన నేను ఇక్కడే పుట్టిన.. ఈ గడ్డ మీద పెరిగిన.. ఇక్కడ గాలి పీల్చి న.. మీతోనే ఎదిగిన.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న.. అని బీఆర్ఎస్ కో రుట్ల అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ అ న్నారు. వాళ్లంతా ఎన్నికల టైంలో వచ్చేటోళ్లు.. మళ్లీ కనబడరు.. యాదించుకోండ్రి.. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీఎంకు గుంట భూమి ఎక్కువ.. ధరణి పోర్టల్‌ను విమర్శించే క్రమంలో 53 ఎకరాల 30 గుంటలకు బదులు 53 ఎకరాల 31 గుంటలు చూపిస్తోంది అని సీఎం కేసీఆర్ అఫిడవిట్‌ను చూపిస్తూ బండి సంజయ్‌కుమార్ చేసిన కామెంట్లు చిచ్చుబుడ్డిలా పేలుతున్నాయి. రైతు రాజ్యమా? రాబంధుల రాజ్యమా? బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట్, రుణమాఫీ లాంటి పథకాలతో రైతులు సుభిక్షంగా ఉండేలా చర్యలు తీసుకుందని బీఆర్ఎస్ జగిత్యాల అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వారు వస్తే మూడు గంటల కరెంట్, ధరణిని ఎత్తివేస్తామంటూ, రైతుబంధును కుదిస్తామంటూ మాట్లాడుతున్నారని.. రైతు రాజ్యం కావాలో.. రాబంధుల రాజ్యం కావాలో తేల్చుకోవాలని జగిత్యాల ప్రజలను కోరారు. ఇవి చదవండి: విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా.. -
పశ్చిమ బెంగాల్: ఎన్నికల్లో రక్తచరిత్ర.. ఎందుకీ హింస?
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ హింస రాజుకోవడం కొత్త కాదు. కాల్పులు, బాంబుల మోత, గృహదహనాలు, రాళ్లు విసురుకోవడాలు, బ్యాలెట్ బాక్స్‌లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు సర్వసాధారణం. రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరగడం ఒక రివాజుగా మారింది. ఏ ఎన్నికలైనా, ఎవరు అధికారంలో ఉన్నా ఒక రక్తచరిత్రను తలపిస్తూ ఉంటాయి. కుల, మతపరమైన హింస దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తే రాజకీయ పార్టీల వారీగా ప్రజల్లో ఇక్కడ విభజన ఎక్కువ. ఎన్నికల వేళ ఈ విభేదాలు మరింత ముదిరి హింసకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగడం, ఎన్నికల సంఘం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండడం ఎన్నికల హింసకు ఒక కారణమేనని రాజకీయ విశ్లేషకుడు స్నిగ్ధేందు భట్టాచార్య వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువని, అందుకే ఎన్నికల సమయంలో హింస రాజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో బీజేపీ బెంగాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయ కక్షసాధింపులే కేంద్రంగా ఉన్న బెంగాల్లో మైనార్టీ బుజ్జగింపు చర్యలు, మతపరమైన రాజకీయాలు తోడు కావడంతో హింస ప్రజ్వరిల్లింది. టీఎంసీ కార్యకర్త హత్యకి ప్రతీకారంగా 2021 మార్చిలో బిర్భూమ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికలకి లిట్మస్ టెస్ట్ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు విషమ పరీక్షే. కాంగ్రెస్, లెఫ్ట్‌లతో చేతులు కలిపిన టీఎంసీ ఒకవైపు, బీజేపీ మరోవైపు రెండు శిబిరాలుగా మారిపోవడంతో ఘర్షణలు మరింతగా పెరుగుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ టీఎంసీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. అప్పట్నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ పోరు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎస్ఎస్సీ, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లో టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ గురిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో అమీతుమీకి ఇరుపక్షాలు సిద్ధపడడం హింసను పెంచుతోంది. భద్రత ఇలా.. ► పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మళ్లీ రక్తమోడింది. కేంద్ర బలగాలు రంగంలోకి దింపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని 61,636 పోలింగ్ స్టేషన్లలో భారీగా భద్రతా ఏర్పాట్లు, ముందస్తు అరెస్ట్‌లు, ఆయుధాల స్వా«దీనం వంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బుల్లెట్ పేలకుండా బ్యాలెట్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. పంచాయతీల్లో రాజకీయ నాయకులు తమ ధనబలం, కండబలంతో ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు సీపీఐ(ఎం) రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల హింస తారాస్థాయికి చేరుకుంది. ధనబలం.. ► ఇటీవల పంచాయతీలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరగడం హింసకు ఒక కారణంగా మారింది. ఒక జిల్లా కౌన్సిల్ ఐదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఒక గ్రామ పంచాయతీ రూ.5–15 కోట్లు ఖర్చు పెట్టుకునే వీలుంది. ప్రతీ ఏడాది గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయిస్తుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించడానికైనా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ► గత నెల జూన్ 8 – 27 మధ్య బెంగాల్లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 337 మందికి గాయాలయ్యాయి. ► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ బెంగాల్లోనే 38 వరకు మరణించారు. ► 2018లో పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు 13 వరకు జరిగాయి. అదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 30 మంది మరణిస్తే, 12 మంది పోలింగ్ రోజునే ప్రాణాలు కోల్పోయారు. ► 2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిడ్నాపూర్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది మరణించారు. ► లెఫ్ట్ అధికారంలో ఉన్న సమయంలో 2003లో 70 మంది 2008లో 36 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీ–20పై నేడు అఖిలపక్షం
న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. -
Gujarat Assembly Election 2022: వారసులపైనే ఆశలు!
వారసత్వ రాజకీయాలు.. దేశాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యమని కేవలం ప్రజాస్వామ్యవాదులే కాదు, సాక్షాత్తూ రాజకీయ పార్టీలు సైతం నిందిస్తుంటాయి. ఆచరణలో మాత్రం అన్ని పార్టీలదీ అదే వరుస. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని చెప్పే పార్టీలు చివరకు గెలుపు గుర్రాల పేరుతో వారసులకే పట్టం కడుతున్నాయి. రాజకీయాల్లో వారసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అధికార బీజేపీ గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో అదే బాటలో సాగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలుండగా, దాదాపు 20 స్థానాల్లో వారసులకే పార్టీలు టికెట్లిచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 13 మందికి, బీజేపీ ఏడుగురికి టికెట్లు ఇవ్వడం గమనార్హం. ప్రోత్సాహం ఇందుకే.. ఆర్థికంగా బలవంతులు కావడం, ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొట్టే సామర్థ్యం ఉండడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి లేకపోవడం వంటి కారణాలతో పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పదిసార్లు విజయం సాధించిన గిరిజన నేత మోహన్ సిన్హ్ రాథ్వా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం ఆయన కుమారుడు రాజేంద్ర సిన్హ్ రాథ్వాకు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన చోటా ఉదయ్‌పూర్ టిక్కెట్ కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి నరాన్బాయి రాథ్వా కుమారుడు సంగ్రామ్ సిన్హ్ రాథ్వా పోటీ చేస్తుండడం గమనార్హం. సనంద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కరణ్ సిన్హ్ పటేల్ కుమారుడు కానూ పటేల్ పోటీకి దిగుతున్నారు. థాస్రా నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్‌ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్ సిన్హ్ పర్మార్ కుమారుడు యోగేంద్ర పర్మార్ దక్కించుకున్నారు. వారసత్వం.. మా హక్కు అన్ని పార్టీల్లో కొన్ని కుటుంబాలు రాజకీయాలను తమకు దక్కిన వారసత్వంగా భావిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది చెప్పారు. తమ నియోజకవర్గాలపై పట్టు నిలుపుకుంటున్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారసత్వాన్ని అంగీకరించాల్సి వస్తోందని వెల్లడించారు. బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మరొకరు సాహసించడం లేదని చెప్పారు. ఫలితంగా అక్కడ వారసులే పాగా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నేతలను పక్కనపెట్టాల్సి వస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వారి కుమారులు, కుమార్తెలు, భార్యలే పార్టీలకు దిక్కవుతున్నారని తెలియజేశారు. మాజీ సీఎం కుమారుడికి మళ్లీ చాన్స్ దనిలీమ్దా స్థానంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనూబాయి పర్మార్ కుమారుడు శైలేశ్ పర్మార్‌కు ఆ పార్టీ నుంచి టికెట్ లభించింది. బయాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మహేంద్రసిన్హ్ వాఘేలా మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీలో చేరిన మహేంద్రసిన్హ్ వాఘేలా గత నెలలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గుజరాత్ మాజీ సీఎం అమర్‌సిన్హ్ చౌదరీ కుమారుడైన తుషార్ చౌదరీ బార్దోలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సోషల్ ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ‘సామాజిక అత్యవసర పరిస్థితి(సోషల్ ఎమర్జెన్సీ)’ తరహా అసాధారణ స్థితి నెలకొని ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా నెలకొన్న ఈ స్థితి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రతీ ప్రాణాన్ని కాపాడటమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా అప్రమత్తతను కొనసాగించాలని కోరారు. పార్లమెంట్‌లోని విపక్ష, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతల సూచనలను స్వీకరించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కొన్ని రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారులు, ఇతర నిపుణులు సూచిస్తున్నారని ప్రధాని ఆ భేటీలో వివరించారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలనే నిర్ణయానికి సంబంధించి ఈ సమావేశంలో ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు పలువురు నేతలు ఆ తరువాత తెలిపారు. కరోనా కారణంగా దేశంలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి వేగాన్ని భారత్ విజయవంతంగా అడ్డుకోగలిగిందన్నారు. మానవ జాతి చరిత్రలోనే ప్రస్తుత స్థితి ఒక కీలక మలుపు అని, దీని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో.. పని సంస్కృతి, పని విధానాల్లో మార్పు తీసుకువచ్చేందుకు అంతా కృషి చేయాలని ప్రధాని సూచించారు. కరోనా మహమ్మారిపై పోరులో పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటిగా కలిసివచ్చి నిర్మాణాత్మక, సానుకూల రాజకీయాలు చేయడాన్ని దేశం చూసిందని వ్యాఖ్యానించారు. ఈ కష్ట సమయంలో ప్రజలు కూడా ఎంతో నిబద్ధత, క్రమశిక్షణతో వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. భౌతిక దూరం పాటించడంలో, జనతా కర్ఫ్యూను, లాక్‌డౌన్‌ను పాటించడంలో ప్రజలు ప్రశంసనీయ ధోరణి ప్రదర్శించారన్నారు. కరోనాపై పోరులో కేంద్రానికి అన్ని రాష్ట్రాలు అద్భుతంగా సహకరించాయని ఆయన కొనియాడారు. తగినన్ని పీపీఈలు అందుబాటులో ఉంచాలి లాక్‌డౌన్‌ను కొనసాగించే విషయంపై, లాక్డౌన్ అనంతర పరిస్థితులను ఎదుర్కొనే విషయంపై ఈ భేటీలో పలువురు నేతలు ప్రధానికి పలు సూచనలు చేశారు. కరోనాపై పోరులో ముందున్న వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని, నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదుకోవాలని కోరారు. వైద్య సిబ్బందికి తగినన్ని పీపీఈలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి విరమించుకోవాలని పలువురు సూచించారు. ఆర్థికరంగం సహా పలు రంగాల్లో పునరుత్తేజానికి తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలను వారు ప్రధానికి వివరించారు. ఈ భేటీలో కాంగ్రెస్ నుంచి రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, రామ్‌గోపాల్ యాదవ్(ఎస్పీ), సతీశ్ మిశ్రా(బీఎస్పీ), చిరాగ్ పాశ్వాన్(లోక్‌జనశక్తి పార్టీ), టీఆర్ బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన).. తదితరులు పాల్గొన్నారు. తొలుత నిరాకరించినప్పటికీ.. టీఎంసీ తన ప్రతినిధిగా సుదీప్ బంధోపాధ్యాయను పంపించింది. ఒకేసారి ఎత్తేయబోం: ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేసే ఆలోచన లేదని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ప్రధాని స్పష్టం చేశారని బీజేపీ నేత పినాకి మిశ్రా వెల్లడించారు. కరోనా ముందు, కరోనా తరువాత పరిస్థితులు ఒకేలా ఉండబోవని ప్రధాని వ్యాఖ్యానించారన్నారు. శనివారం సీఎంలతో కాన్ఫరెన్స్ ప్రధాని మోదీ ఈ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. లాక్డౌన్ ఎత్తివేత సహా కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు, ఇతర నిపుణులు కోరుతున్న నేపథ్యంలో ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ విషయంపై ప్రధాని స్పష్టత ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. -
‘నోటా’ నొక్కండి.. మాకు తోడుండండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ కీలకమైన సమయంలో నగరంలోని క్యాబ్ డ్రైవర్లు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఏ పార్టీకి ఓటు వేసినా లాభం లేదంటూ ‘నోటా’పాట అందుకున్నారు. ‘నోటా’పై నొక్కాలని ప్రజలను కోరుతున్నారు. వేలాది డ్రైవర్లు తమ వాహనాలపైన ఈ తరహా పోస్టర్లను అతికించుకొని తిరుగుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ‘నోటా’ప్రచారం పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్ధులను హడలెత్తిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరించాయని, ఏ మేనిఫెస్టోలోనూ తమ సమస్యలను ప్రస్తావించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సంస్థల మోసాల బారి నుంచి కాపాడాలంటూ రాజకీయ పార్టీలకు, నేతలకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్, భాగస్వాముల మధ్య పోటీని తీవ్రతరం చేసిన క్యాబ్ సంస్థలు తమను తీవ్రంగా దోచుకుంటున్నాయని, ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వలేదన్నారు. తమకు సహకారాన్ని అందించని రాజకీయ పార్టీలపైన నమ్మకాన్ని కోల్పోయి ‘నోటా’ప్రచారానికి దిగినట్లు సలావుద్దీన్ తెలిపారు. తెలంగాణ క్యాబ్, ట్యాక్సీ, ఆటో, తదితర సంఘటిత, అసంఘటిత రంగాల్లో కొనసాగుతున్న లక్షలాది మంది డ్రైవర్ల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది డ్రైవర్ల ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. -
విపక్షాల్ని సంప్రదిస్తాం: వెంకయ్య
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. అన్ని పార్టీలతో మాట్లాడతామని, అలాగే అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికపై విపక్షాల్ని సంప్రదించి, సలహాలు తీసుకుంటామని వెంకయ్య పేర్కొన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను బీజేపీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ముగ్గురు కేంద్ర మంత్రులతో కూడిన ఒక కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేశారు. మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి అనువుగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి ఈ కమిటీ వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం కాని పక్షంలో జూలై 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
'గోదావరి పుష్కరాలకు రండి'
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు రావాలని ఆంధ్రప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలకు ఆహ్వానించింది. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆయా పార్టీల నేతలకు ఫోన్లు చేసి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఉదయం గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్నారు. -
'అఖిలపక్ష భేటీని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాలి'
కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష భేటీని బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి అన్ని రాజకీయపార్టీలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికట్ 3ను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన వేదకను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టి ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజన చేయడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. అయితే అఖిల పక్ష సమావేశానికి కేంద్రం ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్‌పై మండిపడ్డ రాజకీయ పక్షాలు