Gujarat Assembly Election 2022: BJP and Congress allotted tickets to heirs - Sakshi
Sakshi News home page

Gujarat Assembly Election 2022: వారసులపైనే ఆశలు!

Published Tue, Nov 22 2022 5:49 AM | Last Updated on Tue, Nov 22 2022 10:05 AM

Gujarat Assembly Election 2022: BJP, Congress allotted tickets to heirs, - Sakshi

వారసత్వ రాజకీయాలు.. దేశాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యమని కేవలం ప్రజాస్వామ్యవాదులే కాదు, సాక్షాత్తూ రాజకీయ పార్టీలు సైతం నిందిస్తుంటాయి. ఆచరణలో మాత్రం అన్ని పార్టీలదీ అదే వరుస. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని చెప్పే పార్టీలు చివరకు గెలుపు గుర్రాల పేరుతో వారసులకే పట్టం కడుతున్నాయి. రాజకీయాల్లో వారసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అధికార బీజేపీ గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో అదే బాటలో సాగుతోంది. గుజరాత్‌ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలుండగా, దాదాపు 20 స్థానాల్లో వారసులకే పార్టీలు టికెట్లిచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌ 13 మందికి, బీజేపీ ఏడుగురికి టికెట్లు ఇవ్వడం గమనార్హం.  
 
ప్రోత్సాహం ఇందుకే..

ఆర్థికంగా బలవంతులు కావడం, ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొట్టే సామర్థ్యం ఉండడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి లేకపోవడం వంటి కారణాలతో పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా పదిసార్లు విజయం సాధించిన గిరిజన నేత మోహన్‌ సిన్హ్‌ రాథ్వా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం ఆయన కుమారుడు రాజేంద్ర సిన్హ్‌ రాథ్వాకు ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన చోటా ఉదయ్‌పూర్‌ టిక్కెట్‌ కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి నరాన్‌బాయి రాథ్వా కుమారుడు సంగ్రామ్‌ సిన్హ్‌ రాథ్వా పోటీ చేస్తుండడం గమనార్హం. సనంద్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కరణ్‌ సిన్హ్‌ పటేల్‌ కుమారుడు కానూ పటేల్‌ పోటీకి దిగుతున్నారు. థాస్రా నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్‌ను కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే రామ్‌ సిన్హ్‌ పర్మార్‌ కుమారుడు యోగేంద్ర పర్మార్‌ దక్కించుకున్నారు. 

వారసత్వం.. మా హక్కు  
అన్ని పార్టీల్లో కొన్ని కుటుంబాలు రాజకీయాలను తమకు దక్కిన వారసత్వంగా భావిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది చెప్పారు. తమ నియోజకవర్గాలపై పట్టు నిలుపుకుంటున్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారసత్వాన్ని అంగీకరించాల్సి వస్తోందని వెల్లడించారు. బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మరొకరు సాహసించడం లేదని చెప్పారు. ఫలితంగా అక్కడ వారసులే పాగా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నేతలను పక్కనపెట్టాల్సి వస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వారి కుమారులు, కుమార్తెలు, భార్యలే పార్టీలకు దిక్కవుతున్నారని తెలియజేశారు.  

మాజీ సీఎం కుమారుడికి మళ్లీ చాన్స్‌  
దనిలీమ్దా స్థానంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే  మనూబాయి పర్మార్‌ కుమారుడు శైలేశ్‌ పర్మార్‌కు ఆ పార్టీ నుంచి టికెట్‌ లభించింది. బయాద్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్‌ వాఘేలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మహేంద్రసిన్హ్‌ వాఘేలా మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీలో చేరిన మహేంద్రసిన్హ్‌ వాఘేలా గత నెలలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గుజరాత్‌ మాజీ సీఎం అమర్‌సిన్హ్‌ చౌదరీ కుమారుడైన తుషార్‌ చౌదరీ బార్దోలీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement