విపక్షాల్ని సంప్రదిస్తాం: వెంకయ్య
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. అన్ని పార్టీలతో మాట్లాడతామని, అలాగే అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికపై విపక్షాల్ని సంప్రదించి, సలహాలు తీసుకుంటామని వెంకయ్య పేర్కొన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేందుకు వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను బీజేపీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ముగ్గురు కేంద్ర మంత్రులతో కూడిన ఒక కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేశారు. మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి అనువుగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి ఈ కమిటీ వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం కాని పక్షంలో జూలై 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.