ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం అధికార బీజేపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విపక్ష నేతలతో ఆ పార్టీ ఎడతెగని చర్చలు జరుపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం లోక్ జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్, ఎస్పీ నేతలు రాంగోపాల్ యాదవ్, నరేష్ అగర్వాల్‌తో భేటీ అయ్యారు. అలాగే ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరిపి ఈ నెల 23న లోపు అభ్యర్థి పేరును వెల్లడిస్తామన్నారు.
మరోవైపు అరుణ్ జైట్లీ కూడా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తృణముల్, బీజేడీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు వివిధ పార్టీల అభిప్రాయాలను వెంకయ్య ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది. కాగా ఎల్లుండి జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ జరగనుంది. వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ ఇటు అధికార బీజేపీ కానీ, అటు ప్రతిపక్షాలు కానీ తమ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాయి.