ప్రధానితో వెంకయ్య, రాజ్‌నాథ్ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ముగ్గురు సభ్యులతో ఆ పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో కమిటీ సభ్యులు సమావేశమై చర్చలు జరిపారు.
కమిటీ సభ్యులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా భేటీ వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. 17 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వెంకయ్య ఈ సందర్భంగా మోదీతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే మిగతా పార్టీలతోను సంప్రదించాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నారు. మోదీ అమెరికా పర్యటనకు ముందే రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని ఈ నెల 25,26న అమెరికా పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. కాగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
కాగా ఎన్నికలు దగ్గరపడుతున్నా అధికార ఎన్డీయే, విపక్షం తమ అభ్యర్థుల ఎంపిక కోసం ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నాయి. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలెబట్టడానికి యత్నిస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే నామినేషన్ల ఉపసంహరణకు గడువైన జూలై 1 నాటికి పలువురు బరిలో నిలుస్తారు.