
సాక్షి, న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు చొరవ చూపటం లేదంటూ ఆయన అసంతృప్తి వెల్లగక్కారు.
శుక్రవారం ఆయన సభలో మాట్లాడుతూ... ‘15 రోజులుగా సభలో ఒకే తరహా పరిస్థితి. ప్రారంభం.. వాయిదా. రాజ్యసభ చైర్మన్‌గా నా వంతు ప్రయత్నం నేను చేశా. కానీ, అవేవీ ఫలించలేదు. ఇది పెద్దల సభ. ప్రజల నుంచి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు అధికార పక్షం చొరవ తీసుకుని ప్రతిపక్షాలతో చర్చించి సభ సజావుగా సాగేందుకు తొడ్పడ్డాయి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎందుకు కనిపించటం లేదంటూ? ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సభలో చర్చించాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయని.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జోక్యం చేసుకుని విపక్షాలతో చర్చించి సోమవారం కల్లా పరిస్థితిని ఓ కొలిక్కి తెస్తారని భావిస్తున్నట్లు ఆయన సభలో తెలిపారు. అప్పటికీ సభలో అదే తీరు కొనసాగితే మాత్రం ఇక ఎంపీలకే విజ్ఞతను వదిలేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.