న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment