
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేళ హింస రాజుకోవడం కొత్త కాదు. కాల్పులు, బాంబుల మోత, గృహదహనాలు, రాళ్లు విసురుకోవడాలు, బ్యాలెట్ బాక్స్‌లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలు సర్వసాధారణం. రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరగడం ఒక రివాజుగా మారింది. ఏ ఎన్నికలైనా, ఎవరు అధికారంలో ఉన్నా ఒక రక్తచరిత్రను తలపిస్తూ ఉంటాయి.
కుల, మతపరమైన హింస దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తే రాజకీయ పార్టీల వారీగా ప్రజల్లో ఇక్కడ విభజన ఎక్కువ. ఎన్నికల వేళ ఈ విభేదాలు మరింత ముదిరి హింసకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో ఎన్నికలు జరగడం, ఎన్నికల సంఘం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండడం ఎన్నికల హింసకు ఒక కారణమేనని రాజకీయ విశ్లేషకుడు స్నిగ్ధేందు భట్టాచార్య వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువని, అందుకే ఎన్నికల సమయంలో హింస రాజుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో బీజేపీ బెంగాల్‌లో క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయ కక్షసాధింపులే కేంద్రంగా ఉన్న బెంగాల్‌లో మైనార్టీ బుజ్జగింపు చర్యలు, మతపరమైన రాజకీయాలు తోడు కావడంతో హింస ప్రజ్వరిల్లింది. టీఎంసీ కార్యకర్త హత్యకి ప్రతీకారంగా 2021 మార్చిలో బిర్‌భూమ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
లోక్‌సభ ఎన్నికలకి లిట్మస్ టెస్ట్
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు విషమ పరీక్షే. కాంగ్రెస్, లెఫ్ట్‌లతో చేతులు కలిపిన టీఎంసీ ఒకవైపు, బీజేపీ మరోవైపు రెండు శిబిరాలుగా మారిపోవడంతో ఘర్షణలు మరింతగా పెరుగుతున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ టీఎంసీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. అప్పట్నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ పోరు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఎస్‌ఎస్‌సీ, బొగ్గు స్మగ్లింగ్ కేసుల్లో టీఎంసీ నేతలు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ గురిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో అమీతుమీకి ఇరుపక్షాలు సిద్ధపడడం హింసను పెంచుతోంది.
భద్రత ఇలా..
► పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ మళ్లీ రక్తమోడింది. కేంద్ర బలగాలు రంగంలోకి దింపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని 61,636 పోలింగ్ స్టేషన్లలో భారీగా భద్రతా ఏర్పాట్లు, ముందస్తు అరెస్ట్‌లు, ఆయుధాల స్వా«దీనం వంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ.. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బుల్లెట్ పేలకుండా బ్యాలెట్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. పంచాయతీల్లో రాజకీయ నాయకులు తమ ధనబలం, కండబలంతో ఎన్నికలు గెలుస్తూ వస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘంగా మూడు దశాబ్దాల పాటు సీపీఐ(ఎం) రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల హింస తారాస్థాయికి చేరుకుంది.
ధనబలం..
► ఇటీవల పంచాయతీలకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరగడం హింసకు ఒక కారణంగా మారింది. ఒక జిల్లా కౌన్సిల్ ఐదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఒక గ్రామ పంచాయతీ రూ.5–15 కోట్లు ఖర్చు పెట్టుకునే వీలుంది. ప్రతీ ఏడాది గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయిస్తుంది. అందుకే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించడానికైనా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
► గత నెల జూన్ 8 – 27 మధ్య బెంగాల్‌లో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 337 మందికి
గాయాలయ్యాయి.
► 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ బెంగాల్‌లోనే 38 వరకు మరణించారు.
► 2018లో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హత్యలు 13 వరకు జరిగాయి. అదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 30 మంది మరణిస్తే, 12 మంది పోలింగ్ రోజునే ప్రాణాలు కోల్పోయారు.
► 2011లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిడ్నాపూర్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది మరణించారు.
► లెఫ్ట్ అధికారంలో ఉన్న సమయంలో 2003లో 70 మంది 2008లో 36 మంది మరణించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్