బ్యాలెట్‌బాక్స్‌కు నిప్పు పెట్టిన దృశ్యం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రం దద్దరిల్లింది. ఈ హింసాత్మక ఘటనల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది టీఎంసీ కార్యకర్తలు. బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్‌ఎఫ్ పార్టీలకు చెందిన వారు మరణించారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి.
ముర్షీదాబాద్, నాడియా, కూచ్ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్‌లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ఆనంద బోస్ ఉత్తర 24 పరగణా జిల్లాలో స్వయంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. మృతి చెందిన వారిలో బీజేపీకి పోలింగ్ ఏజెంట్ మధాబ్ బిశ్వాస్ కూచ్‌బెహార్ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరణించారు.
ఉత్తర దింజాపూర్‌లోని గోల్‌పోఖార్‌లో టీఎంసీ, కాంగ్రెస్ మద్య ఘర్షణల్లో టీఎంసీ పంచాయతీ అధ్యక్షురాలి భర్తను హత్య చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీ, ఖర్గామ్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త సబీరుద్దీన్, కూచ్ బెహార్ జిల్లా తుఫాన్‌గంజ్‌లో బూతు కమిటీ సభ్యుడు గణేశ్ సర్కార్ మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపైనే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి చంపేశారని టీఎంసీ ఆరోపించింది. మూడంచెలున్న పంచాయతీల్లో 73,887 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
పార్టీల పరస్పర ఆరోపణలు
ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ మంత్రి శశిపంజా ప్రశ్నించారు. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. ఈ ఘర్షణలకు టీఎంసీ కారణమంటూ బీజేపీ చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. హింసకు తామే కారణమైతే అంత మంది టీఎంసీ కార్యకర్తలు ఎందుకు చనిపోతారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో బాంబుల సంస్కృతి‡ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చని మమత భావిస్తున్నారని ఆరోపించారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్ నాయకుడు కౌస్తవ్ బగ్చి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment