హత్యకు గురైన రాజ్‌కుమార్ రాయ్
కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర దినాజ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రహత్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ రాయ్, రాయ్‌గంజ్‌లోని ఇతహార్ ప్రాంతానికి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వెళ్లారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అడ్డుకొవడానికి ప్రయత్నించగా ఆయన వారిని ప్రతిఘటించారు.
అయితే పోలింగ్ పూర్తైన అనంతరం రాయ్ అకస్మాత్తుగా అదృశ్యమై పోయారు. ఎన్నికల రోజు తన భర్త రాయ్ పోలింగ్ బూత్‌లో ఉండగా రాత్రి 8 గంటలకు మాట్లాడానని, ఆతరువాత మాట్లాడటానికి ప్రయత్నించిన కుదరలేదని ఆయన భార్య అర్పిత తెలిపారు. దీంతో అనుమానం వచ్చి రాయ్ కిడ్నాప్ అయ్యారని ఇతహర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మరుసటి రోజు సోనాదంగి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు పట్టలేనంత స్థితిలో రాయ్ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడివుంది. రాయ్ మరణంపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
పథకం ప్రకారం రాయ్ ప్రాణాలు తీశారని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని అర్పిత డిమాండ్ చేశారు. రాజ్‌కుమార్ రాయ్ దారుణ హత్యపై ఇతర ఎన్నికల అధికారులు, పాఠశాల ఉద్యోగులు బుధవారం నిరసనకు దిగారు. రాయ్ మరణంపై తగిన న్యాయం చేయాలంటూ రోడ్లను దిగ్భందించారు. రాయ్ హత్యపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరస్కరించారని వారు ఆరోపించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. అయతే దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. కేసు విచారణను సీఐడీకి అప్పగించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment