నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది.
ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్‌బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు.
కోల్‌కతాలోని కంకుర్‌గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు.
భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment