వైద్యులకు సీఎం మమత వినతి
ఆరోగ్య శాఖ కార్యదర్శిని తొలగించేది లేదని స్పష్టికరణ
కోల్‌కతా: ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు.
ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్‌లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment