
దాడి నుంచి బయటపడ్డ మైసూరువాసి కథనం
పహల్గాం ఉగ్రవాదుల దాడి ప్రత్యక్ష సాక్షులను ఇంకా వెంటాడుతోంది. ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న మైసూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన అనుభవాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన కుటుంబంతో పాటు మరో 35–40 మంది ఎలా ప్రాణాలతో బయటపడ్డారో వివరిస్తూ ఆయన రాసిన పోస్టు అందరినీ కదిలిస్తోంది.
‘అదో రాక్షస చర్య. స్వర్గ సౌందర్యాన్ని రక్తపు మరకలతో ఎరుపెక్కించిన ఓ భయా నక అనుభవం. దాన్నుంచి మేం బయటపడ్డాం. ప్రతికూల వాతావరణం కారణంగా మా పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 22 మధ్యాహ్నం భార్య, తమ్ముడు, మరదలితో కలిసి కశ్మీర్ వెళ్లాం. నా సోదరుడు ఇండియన్ ఆర్మీలో సీనియర్ అధికారి. మాతో పాటు ట్రిప్‌లో ఉన్నాడు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు పహల్గాం పట్టణానికి చేరుకుని.. పోనీ రైడ్‌లో బైసారన్ లోయకు 1:35 గంటలకు చేరుకున్నాము. ఆ గంభీరమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఓ కప్పు టీ తాగాం. 2:00 గంటలకు ఫోటోలు తీసుకోవడానికి లేచాం. ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న దిశలో కదలడం మా అదృష్టం.
పిల్లలు, తల్లిదండ్రుల గురించే ఆందోళన
అలా మేం నలుగురం సంఘటనా స్థలానికి కొన్ని వందల మీటర్ల దూరంలో చెట్ల కింద ఉన్న ఇరుకైన గుంతలోకి వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటల వరకు తుపాకీ కాల్పుల శబ్దం లోయలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అక్కడే ఉండాలా? మరోవైపు పరుగెత్తాలా? తెలియడం లేదు. అక్కడ ఉన్నంత సేపు ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులు, పిల్లల గురించి ఆందోళన చెందుతున్నాం. మధ్యాహ్నం 3.40 గంటలకు హెలికాప్టర్ శబ్దం వినిపించింది. భద్రతా దళాలు వచ్చాయని నిర్ధారించుకున్నాక బయటకు వచ్చాం. ఆ తుపాకీ కాల్పులు ఇప్పటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలాంటి భయానక అనుభవాలు ఎవ్వరికీ రాకూడదని ప్రారి్థస్తున్నా. వారి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నా’అని భట్ పేర్కొన్నారు.
క్షణాల్లో రెండు మృతదేహాలు..
ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటుండగా మధ్యాహ్నం 2.25 గంటల సమయంలో మొదటి రెండు తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు నిశ్శబ్దం. ఏం జరిగిందో అందరికీ అర్థమైంది. క్షణాల్లోనే రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని చూశాం. ఇది ఉగ్రదాడి అని నా సోదరుడికి తెలిసిపోయింది. తుపాకీ శబ్దాలు పేలాయి. గందరగోళం ఏర్పడింది. జనం బిగ్గరగా అరుస్తూ ప్రాణాల కోసం పరిగెత్తుతున్నారు. మా దిశలో ఒక ఉగ్రవాది రావడాన్ని మేము గమనించాం. పరిస్థితిని అంచనా వేసిన మా తమ్ముడు 35–40 మంది పర్యాటకులతో మమ్మల్ని వ్యతిరేక దిశలో నడిపించాడు. అదృష్టవశాత్తూ ఫెన్సింగ్ కింద ఇరుకైన మార్గం కనబడింది. మాతోపాటు చాలా మంది ప్రజలు కంచె గుండా జారి వేరే మార్గంలో పరిగెత్తడం ప్రారంభించారు. అది కొంచెం లోయలా ఉండటంతో మేం ఎవరికీ కనిపించలేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్