
పీఓకేపైకి భారత్ ప్రతిదాడి చేయొచ్చని అనుమానాలు
ముందుజాగ్రత్తగా ఉగ్రవాదులను సరిహద్దు నుంచి దూరంగా పంపేస్తున్న పాక్ సైన్యం
పీఓకేలో 42 ఉగ్రస్థావరాలను గుర్తించిన భారత సైన్యం
శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసకాండ తర్వాత కోపంతో రగిలిపోతున్న భారతసైన్యం ఏక్షణంలోనైనా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయొచ్చనే భయా నుమానాలు పాక్ సైన్యంలో ఎక్కువయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ తాము పెంచి పోషించిన ఉగ్రవాదులను పాక్ సైన్యం వెంటనే ఆయా ‘లాంచ్‌ప్యాడ్’ల నుంచి సురక్షితంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ముందస్తుగా ఆ ముష్కరులను తమ సైనిక శిబిరాలు, బంకర్లలోకి పంపేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సరిహద్దు వెంట ఉన్న లాంచ్‌ప్యాడ్‌లను ఖాళీచేయిస్తోంది. ఈ లాంచ్‌ప్యాడ్లు క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భారత సైనిక నిఘా వర్గాలు పసిగట్టడంతో ముందుజాగ్రత్తగా పాక్ సైన్యం అప్రమత్తమై అక్కడి ఉగ్రవాదులను వేరే చోట్లకు పంపేస్తోంది.
ఇవన్నీ కీలక స్థావరాలు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కేల్, సర్దీ, దుధ్‌నియాల్, అథ్‌ముఖాన్, జురా, లిపా, పచ్ఛిబన్, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ, ఖుయిరాట్టా, మంధార్, నిఖాయిల్, ఛమన్‌కోట్, జాన్‌కోటేలలో ఈ ఉగ్రస్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలన్నింటి నుంచీ ఉగ్రవాదులు తాత్కాలికంగా వెళ్లిపోతున్నట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఉగ్రవాదులకు కీలక స్థావరాలు(లాంచ్‌ప్యాడ్). వాస్తవాధీన రేఖ గుండా భారత్‌లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ఈ స్థావరాల నుంచే బయల్దేరతారు.
ఇక్కడే వీళ్లకు నెలల తరబడి ఉగ్రశిక్షణ ఇస్తారని తెలుస్తోంది. పీఓకేలో క్రియాశీలంకంగా ఉన్న 42 లాంచ్‌ప్యాడ్‌లను ఇటీవల భారత భద్రతా బలగాలు గుర్తించాయి. పహల్గాం దాడి ఉదంతం తర్వాత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న భారతసైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే ఉద్దేశంతో ఉగ్రవాదులను పాక్ సైన్యం హుటాహుటిన ఇతర ప్రదేశాలకు పంపేస్తోంది.
ఇలా తరలిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 150 నుంచి 200దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే హిజ్బుల్ మొజాహిదీన్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 60 మంది విదేశీ కిరాయి ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడ్డారని జాతీయ మీడియాలో కథనం వెలువడింది. వీరిలో 17 మంది స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సరిహద్దు వెంట గాలింపును మరింత ఉధృతంచేసింది.