కోల్‌కతా: వైద్యురాలి హత్యాచారంపై నిరసనల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. వామపక్షాలూ ఈ కుట్రలో భాగమయ్యాయన్నారు. సచివాలయం నబన్నాలో సోమవారం ఒక అధికారిక సమీక్షలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఉదంతంలో నెలరోజులుగా బెంగాల్‌లో ప్రజలు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
బాధితురాలి తల్లిదండ్రులకు తానెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని మమత అన్నారు. ఈమేరకు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. దుర్గాపూజ సమీపిస్తున్నందున నిరసనలు వీడి.. పండుగ ఏర్పాట్లు చేపట్టాలని ప్రజలను కోరారు. ‘వైద్యురాలి కుటుంబానికి నేనెప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదు. అభాండాలు వేస్తున్నారు. కూతురి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టదలిస్తే మా ప్రభుత్వం అండగా ఉంటుందని తల్లిదండ్రులకు చెప్పాను.
ఎప్పుడేం మాట్లాడాలో నాకు తెలుసు. నిరసనలు ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్రే. కొన్ని వామపక్ష పార్టీలకు ఇందులో భాగస్వామ్యముంది. పొరుగుదేశంలో అస్థిరత చూసి.. ఇక్కడా అలాంటి ఆందోళనలు రేకెత్తించాలని కొందరు చూస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్‌లు రెండు వేర్వేరు దేశాలని వారు మర్చిపోయారు’ అని మమత ధ్వజమెత్తారు. ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని, దుర్గాపూజ వేళ శాంతి భద్రతలపై పట్టున్న అధికారి అవసరం ఉందని దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment