నైట్‌ పెట్రోలింగ్‌ ఉండాలి | Union Health Ministry issues Office Memorandum on National Task Force | Sakshi
Sakshi News home page

నైట్‌ పెట్రోలింగ్‌ ఉండాలి

Published Thu, Aug 29 2024 4:43 AM | Last Updated on Thu, Aug 29 2024 4:43 AM

Union Health Ministry issues Office Memorandum on National Task Force

ఆస్పత్రులు సీసీటీవీల తాలూకు నిఘా నీడలో ఉండాలి

వైద్య సిబ్బందిపై దాడుల నేపథ్యంలో ఆస్పత్రుల్లో మెరుగైన భద్రతా చర్యలు

రాష్ట్రాలకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రప్రభుత్వం

న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై రేప్, హత్య ఘటనసహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై లైంగికదాడుల ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. వైద్య సిబ్బంది భద్రతకు ఆస్పత్రుల్లో అమలుచేయాల్సిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసింది. బుధవారం వర్చువల్‌ విధానంలో జరిగిన నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..

→ పెద్ద ఆస్పత్రుల్లో జనం పెద్దగా తిరగని చోట్ల, చీకటి ప్రాంతాలు, మూలగా ఉండే చోట్ల సీసీటీవీలు బిగించాలి
→ ఆస్పత్రుల్లో భద్రతపై జిల్లా కలెక్టర్లు, డీఎస్పీలు, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకోవాలి
→ సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని భద్రతా తనిఖీలు చేయాలి
→ రాత్రుళ్లు అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్‌ తరచూ జరుపుతుండాలి
→ పెద్ద జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. సీసీటీవీలను ఎప్పటికప్పుడు చెక్‌చేస్తూనే డాటాను కూడా తరచూ బ్యాకప్‌ తీసుకోవాలి
→ అత్యవసర కాల్స్‌కు స్పందించి కంట్రోల్‌ రూమ్, సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్ట్‌ సెక్యూరిటీ సిబ్బంది శారీరకదారుఢ్యం మెరుగు కోసం వారికి శిక్షణ ఇప్పించాలి
→ రోగులను స్ట్రెచర్, ట్రాలీ, చక్రాల కుర్చీల్లోకి మారుస్తూ ఎక్కువ మంది బంధువులు ఆస్పత్రుల్లో పోగుబడుతున్నారు. వీరి సంఖ్యను తగ్గించేందుకు ఆస్పత్రులే ఈ పనులకు తగు సిబ్బందిని నియమించాలి
→ వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న భారతీయ న్యాయ సంహిత చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి
→ తమ రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్‌ నంబర్లు 100, 112 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చాలా రాష్ట్రాలు స్పష్టంచేశాయి.
→ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయని ఆయా రాష్ట్రాలను కేంద్రం మెచ్చుకోవడం విశేషం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement