నిశీధి వీధుల్లో అగ్ని నక్షత్రాలు.. | Reclaim the Night: Protesters reclaim the night in Kolkata, over RG Kar doctor rape murder issue | Sakshi
Sakshi News home page

Reclaim the Night: నిశీధి వీధుల్లో అగ్ని నక్షత్రాలు..

Published Tue, Sep 10 2024 12:43 AM | Last Updated on Tue, Sep 10 2024 8:45 AM

Reclaim the Night: Protesters reclaim the night in Kolkata, over RG Kar doctor rape murder issue

కోల్‌కతా ఘటన

రాత్రిళ్లు తారలు కనపడటం సహజం. కాని కోల్‌కతా వీధుల్లో అగ్ని నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. ‘రీక్లయిమ్‌ ది నైట్‌’ పేరుతో మహిళలు అనూహ్య సంఖ్యలో రాత్రిళ్లు దివిటీలతో నిరసనలు చేస్తున్నారు. అభయ ఘటన జరిగి నెల అయిన సందర్భంగా సెప్టెంబర్‌ 8 రాత్రి కోల్‌కతాలోని ఏ కూడలిలో చూసినా దగ్ధ కాగడాలు చేతబూనిన స్త్రీలే. కోల్‌కతాలో సాగుతున్న నిరసనలపై కథనం.

‘రాత్రి ఎవరిది?’ ఈ ప్రశ్న పిక్కటిల్లుతోంది కోల్‌కతాలో. ‘రాత్రి మాది కూడా’ అని అక్కడి స్త్రీలు ఎలుగెత్తి నినదిస్తున్నారు. వందల వేల సంఖ్యలో స్త్రీలు రాత్రిళ్లు బయటకు రావడం... కాగడానో, కొవ్వొత్తినో, సెల్‌ఫోన్‌ లైట్‌నో వెలిగిస్తూ సామూహికంగా నడవడం... ఆ నగరం ఎప్పుడూ ఎరగదు. ఇప్పుడు చూస్తోంది. ‘కోల్‌కతాలో దుర్గాపూజ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుంది. కాని అభయ విషయంలో న్యాయం కోసం స్త్రీలు రోడ్ల మీదకు వస్తున్నారు. పురుషులు కూడా వారికి స΄ోర్ట్‌ ఇస్తున్నారు’ అంటున్నారు స్త్రీలు.

ఎన్నడూ ఎరగని భయం
కోల్‌కతాలో క్రైమ్‌ రేటు ఉన్నా ఆగస్టు 8 రాత్రి అభయపై జరిగిన అత్యాచారం, హత్యవల్ల నగరం పూర్తిగా భయపడి΄ోతోంది. స్త్రీలు బయటకు రావాలంటేనే సంకోచించే స్థితి ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్నా మెల్లమెల్లగా ఎందుకు బయటకు రాకూడదనే తెగింపు కూడా మొదలయ్యింది. ఆగస్టు 14 అర్ధరాత్రి (స్వాతంత్య్రం వచ్చిన సమయం) రాత్రి భారీస్థాయిలో స్త్రీలు రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 

అయితే పార్టీలు ఉసికొల్పడం వల్ల ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. కాని ఆ తర్వాత ఏ పార్టీతో సంబంధం లేని రిమ్‌ఝిమ్‌ శర్మ అనే సామాజిక కార్యకర్త న్యాయం కోసం నిరసన తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో అర్ధరాత్రి నిరసనలకు పిలుపునిచ్చింది. నెప్టెంబర్‌ 4న కోల్‌కతా పట్టపగలులా మారింది. వేలాదిగా మహిళలు బయటకు వచ్చారు. ఈసారి వారందరి చేతుల్లో పార్టీల జండాలు కాకుండా త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. ఇది జనం నిరసన. కోల్‌కతా నగరం దిగ్గున వెలిగింది– న్యాయ ఆకాంక్షతో.

నెల రోజుల రాత్రి
ఆగస్టు 8 రాత్రి కోల్‌కతాలోని ఆర్‌.జి. కార్‌ ఆస్పత్రిలో ‘అభయ’ అనే జూనియర్‌ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం, హత్య జరిగి నెల రోజులు అవుతుండటంతో ‘ఇంకా జరగని న్యాయానికి’ నిరసనగా పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా ‘నైట్‌ ఆఫ్‌ అభయ’ పేరుతో నిరసనకు సామాజిక కార్యకర్తలు పిలుపునివ్వడంతో కోల్‌కతాతో పాటు ముఖ్యపట్టణాల్లో స్త్రీలు సెప్టెంబర్‌ 8 (ఆదివారం) రాత్రి వేలాదిగా రోడ్ల మీదకు వచ్చారు. 

నినాదాలు, పాటలు, కవితలు... రోడ్ల మీద బొమ్మలు వేయడం ఎక్కడ చూసినా చైతన్యజ్వాలలు. ‘ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌’ నినాదం మార్మోగి΄ోయింది. సి.బి.ఐ అనునిత్యం ఏవో స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆస్పత్రిలోని మూడు గదులను త్రీడి మ్యాపింగ్‌ ద్వారా విశ్లేషిస్తున్నామని చెప్పడం పాలిగ్రాఫ్‌ పరీక్షలు చేయించడం తప్ప అసలు ఏం జరిగిందో దీని వెనుక ఎవరున్నారో తెలుపడం లేదు. అభయ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 9న (నిన్న) విచారణ చేసినా అందులో అటాప్సీ రి΄ోర్టులో కీలకపత్రం లేక΄ోవడాన్ని గుర్తించి నిలదీసింది. అంటే ఈ కేసు అంతు లేకుండా సాగేలా ఉంది.

గగుర్పాటు క్షణం
‘ఘటన జరిగి నెల రోజులైనా నా కూతురు ఆ క్షణంలో ఎంత తల్లడిల్లి ఉంటుందో గుర్తుకొస్తే నేటికీ గగుర్పాటుకు గురవుతూనే ఉన్నాను’ అని అభయ తల్లి సెప్టెంబర్‌ 8 రాత్రి నిరసనలో తెలిపింది. మరోవైపు ఆర్‌.జి. కార్‌ ఆస్పత్రిలోని జూనియర్‌ డాక్టర్లు ఆస్పత్రిలోని పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదని, íసీసీ కెమెరాలు బిగించలేదని, భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రోడ్లపైకి వస్తున్న మహిళలను అడిగితే ‘దేశంలో పెరిగి΄ోయిన రేప్‌ కల్చర్‌తో విసిగి΄ోయాం. దీనికి ముగింపు పలకాల్సిందే. అంతవరకూ రోడ్ల మీదకు వస్తూనే ఉంటాం’ అంటున్నారు.  ఏ జాగృదావస్థ అయినా ప్రక్షాళనకే దారి తీస్తుంది. ఈ ప్రక్షాళనే ఇప్పుడు కావాల్సింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement