Guidelines issued
-
నైట్ పెట్రోలింగ్ ఉండాలి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై రేప్, హత్య ఘటనసహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై లైంగికదాడుల ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్య సిబ్బంది భద్రతకు ఆస్పత్రుల్లో అమలుచేయాల్సిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసింది. బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన నేషనల్ టాస్క్ ఫోర్స్ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..→ పెద్ద ఆస్పత్రుల్లో జనం పెద్దగా తిరగని చోట్ల, చీకటి ప్రాంతాలు, మూలగా ఉండే చోట్ల సీసీటీవీలు బిగించాలి→ ఆస్పత్రుల్లో భద్రతపై జిల్లా కలెక్టర్లు, డీఎస్పీలు, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకోవాలి→ సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని భద్రతా తనిఖీలు చేయాలి→ రాత్రుళ్లు అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ తరచూ జరుపుతుండాలి→ పెద్ద జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. సీసీటీవీలను ఎప్పటికప్పుడు చెక్చేస్తూనే డాటాను కూడా తరచూ బ్యాకప్ తీసుకోవాలి→ అత్యవసర కాల్స్‌కు స్పందించి కంట్రోల్ రూమ్, సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బంది శారీరకదారుఢ్యం మెరుగు కోసం వారికి శిక్షణ ఇప్పించాలి→ రోగులను స్ట్రెచర్, ట్రాలీ, చక్రాల కుర్చీల్లోకి మారుస్తూ ఎక్కువ మంది బంధువులు ఆస్పత్రుల్లో పోగుబడుతున్నారు. వీరి సంఖ్యను తగ్గించేందుకు ఆస్పత్రులే ఈ పనులకు తగు సిబ్బందిని నియమించాలి→ వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న భారతీయ న్యాయ సంహిత చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి→ తమ రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చాలా రాష్ట్రాలు స్పష్టంచేశాయి.→ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయని ఆయా రాష్ట్రాలను కేంద్రం మెచ్చుకోవడం విశేషం. -
లిస్టెడ్ కంపెనీలు స్పందించాల్సిందే
న్యూఢిల్లీ: మార్కెట్ పుకార్లు లేదా వార్తలు తదితరాలపై లిస్టెడ్ కంపెనీలు స్పందించవలసి ఉంటుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. అక్టోబర్ 1నుంచి డిస్క్లోజర్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వెరసి ఇకపై లిస్టెడ్ కంపెనీలు ప్రధాన మీడియా సంస్థలలో వెలువడే మార్కెట్ రూమర్లను ఖండించడం, లేదా స్పష్టతనివ్వడం వంటివి చేపట్టవలసి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా టాప్–100 కంపెనీలకు ఆదేశాలు అక్టోబర్ 1నుంచి వర్తించనున్నట్లు సెబీ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ బాటలో టాప్–250 లిస్టెడ్ కంపెనీలకు 2024 ఏప్రిల్ 1నుంచి డిస్క్లోజర్ నిబంధనలు అమలుకానున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రధాన మీడియాలో వచ్చే మార్కెట్ పుకార్లను ఖండించడం లేదా వివరణ ఇవ్వడం లేదా స్పష్టం చేయడం వంటివి చేపట్టవలసి ఉంటుంది. అసహజరీతిలో పుట్టే పుకార్లు లేదా వార్తలు లేదా ఇతర సమాచారంపై కంపెనీలు 24 గంటల్లోగా స్పష్టతను ఇవ్వవలసి ఉంటుంది. ప్రత్యేక హక్కులపై.. లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ పాలనను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా సెబీ ప్రత్యేక హక్కుల జారీపైనా మార్గదర్శకాలను విడుదల చేసింది. తద్వారా కొంతమంది ప్రధాన వాటాదారులకు నిరంతరంగా ప్రత్యేక హక్కులను కల్పించడంపైనా సెబీ దృష్టిపెట్టింది. లిస్టెడ్ కంపెనీలు ఎవరికి ఎలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినా సాధారణ సమావేశంలో వాటాదారుల నుంచి అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక హక్కులను కేటాయించినప్పటినుంచి ప్రతీ ఐదేళ్లలో ఒకసారి ఇందుకు ప్రత్యేక పద్ధతిలో వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ప్రమోటర్లు, వ్యవస్థాపకులు, ఇతర కార్పొరేట్ బాడీ సభ్యులకు ఇలాంటి ప్రత్యేక హక్కులను జారీ చేయడంపై కొంతకాలంగా సాధారణ వాటాదారులతోపాటు సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు తెరతీసింది. 2024 ఏప్రిల్ నుంచి సెబీ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై లిస్టెడ్ కంపెనీలు డైరెక్టర్ల ఎంపికలోనూ సాధారణ వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. 2024 ఏప్రిల్ 1నుంచి ఐదేళ్ల కాలంలో కనీసం ఒకసారైనా వాటాదారుల అనుమతి కోరవలసి ఉంటుంది. 2024 మార్చికల్లా బోర్డులోగల ఎవరైనా గత ఐదేళ్లలో వాటాదారుల నుంచి అనుమతి పొందకుంటే తప్పనిసరిగా అదే ఏడాది మార్చి 31 తదుపరి బోర్డును సమావేశపరచి వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందవలసి ఉంటుంది. కొనుగోళ్లు, షేర్ల కన్సాలిడేషన్, సెక్యూరిటీల బైబ్యాక్ తదితర మెటీరియల్ సమాచారాన్ని వెల్లడించే గడువును 24 గంటల నుంచి 12 గంటలకు కుదించింది. ఇదేవిధంగా డైరెక్టర్ల బోర్డు తీసుకునే నిర్ణయాలను సమావేశం ముగిసిన తదుపరి 30 నిమిషాలకు వెల్లడించవలసి ఉంటుంది. -
బ్యాంకుల్లో గవర్నెన్స్ లోపాలు
ముంబై: కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకుల్లో వాటి అమలు తీరులో మాత్రం లోపాలు ఉన్నట్లు తేలిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాటిని అధిగమించగలిగామని, లేకపోతే ఎంతో కొంత ఒడిదుడుకులు తలెత్తేవని ఆయన పేర్కొన్నారు. ‘కార్పొరేట్ గవర్నెన్స్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో ఒడిదుడుకులకు దారి తీసేలా కొన్ని బ్యాంకుల్లో గవర్నెన్స్‌పరమైన లోపాలు బైటపడటం ఆందోళనకరమైన విషయం‘ అని బ్యాంక్ బోర్డుల డైరెక్టర్లతో సోమవారం జరిగిన సమావేశంలో దాస్ పేర్కొన్నారు. బ్యాంకుల బోర్డులు, యాజమాన్యాలు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మోసాలు.. మొండిపద్దులపరమైన ఒత్తిళ్లను దాచి పెట్టేందుకు, కృత్రిమంగా ఆర్థిక పనితీరును గొప్పగా చూపించుకునేందుకు బ్యాంకులు ‘స్మార్ట్ అకౌంటింగ్’ విధానాలను ఆశ్రయించడాన్ని దాస్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇందుకోసం బ్యాంకులు పాటిస్తున్న విధానాలను ప్రస్తావించారు. ఖాతాల్లో మొండిబాకీల భారాన్ని తగ్గించుకునేందుకు ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు సందర్భాన్ని బట్టి తమ రుణాలను విక్రయించి, తిరిగి బైబ్యాక్ చేయడం .. రుణగ్రహీత చెల్లించాల్సిన రీపేమెంట్లను అంతర్గతంగా ఖాతాల్లో సర్దుబాటు చేయడంలాంటివి వీటిలో ఉన్నట్లు దాస్ పేర్కొన్నారు. -
ఇక పక్కాగా ఇన్ఫెక్షన్ల కట్టడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఖరారు చేసింది. అందుకు సంబంధించిన మ్యాన్యువల్‌ను విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రి రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు తోడ్పడతాయని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, ఇటీవల మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు ఇన్ఫెక్షన్కు గురై మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, రోగుల చికిత్సలకు ఉపయోగించే పరికరాలను స్టెరిలైజ్ చేయడం, పీపీఈ కిట్లు వాడటం, లాండ్రీ నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి చేయడం వంటివి చేపట్టాలని మార్గదర్శకాల్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమైన మార్గదర్శకాలు... ►రోగుల మూత్ర నమూనాలు, ఆసుపత్రుల్లోని నీటి నమూనాలు, వెంటిలేటర్లపై ఉన్న రోగుల మందుల నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబ్‌లో పరీక్షించి వాటి ఫలితాలపై ఆసుపత్రి అంటువ్యాధుల నియంత్రణ కమిటీ తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ►రోగులకు అందించే ఆహారాన్ని ప్రతి 4 నెలలకోసారి పరీక్షించాలి. ►తాగునీటిలో ఉండే బ్యాక్టీరియాపై నెలవారీ నిఘా చేపట్టాలి. పేషెంట్ కేర్ యూనిట్లు, హాస్పిటల్ కిచెన్, క్యాంటీన్లు, హాస్టళ్ల నుంచి ల్యాబ్‌లో ప్రతి నెలా ఒకసారి తాగునీటి పరీక్ష నిర్వహించాలి. ►వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులకు చేతి శుభ్రత శిక్షణా కార్యక్రమాన్ని నెలకోసారి తప్పనిసరిగా నిర్వహించాలి. ►బయో వ్యర్థాల నిర్వహణ, పారబోత విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. సెంట్రల్ స్టోరేజీ ఏరియాలో బయోమెడికల్ వ్యర్థాలను నిల్వ చేయడానికి సురక్షితమైన, వెంటిలేషన్ ఉన్న ప్రాంతం కేటాయించాలి. ఆయా సిబ్బందికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ►అంటువ్యాధుల తీవ్రత ఉన్నప్పుడు రోగులు, సిబ్బంది, సందర్శకుల రాకపోకలను తగ్గించాలి. రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. ►అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్న సమయంలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. ►ఒకేసారి అవుట్‌బ్రేక్ జరిగితే వ్యాప్తిని గుర్తించి ప్రమాదంలో ఉన్నవారెవరో తెలుసుకోవాలి. -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇకపై అక్కడ మాస్క్ తప్పనిసరి!
బెంగళూరు: చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో భారత్ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. పండగలు, కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా నాలుగో వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో పబ్‌లు, రెస్టారెంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. కరోనాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీ మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదని కోరారు. యూపీలో అలర్ట్.. ఉన్నావ్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. అంతకు ముందే పరీక్షలు చేసుకోగా ప్రస్తుతం పాజిటివ్‌గా తేలింది. అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. చైనా నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా తేలిన మరుసటి రోజునే ఈ విషయం బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్లు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని కోరారు. ఇదీ చదవండి: చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు! -
వేధించకండి! రుణ రికవరీ ఏజెంట్లపై ఆర్బీఐ ఉక్కుపాదం!
ముంబై: రుణ వసూళ్ల ఏజెంట్లు అనైతిక విధానాలకు పాల్పడకుండా ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. రుణాలు చెల్లించాలంటూ రుణ గ్రహీతలను బెదిరించడాన్ని నిషేధించింది. అలాగే, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య రుణం కోసం కాల్ చేయడం కూడా కుదరని స్పష్టం చేసింది. తన నియంత్రణలోని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (ఆర్ఈలు), ఏఆర్సీలకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) రుణాలను వసూలు చేసే ఏజెంట్లు భౌతికంగా లేదా మాటల రూపంలో వేధింపులకు పాల్పడకుండా ఆర్ఈలు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. ఏ రూపంలోనూ అనుచిత సందేశాలు పంపకూడదని, గుర్తు తెలియని కాల్స్ రూపంలో వేధించకూడదని స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్లు ఇటీవలి కాలంలో ఆమోదనీయం కాని చర్యలకు పాల్పడుతున్నట్టు తెలియడంతో ఆర్బీఐ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ -
‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ చట్టం దుర్విని యోగం కాకుండా నియంత్రించగలిగామని చెప్పా రు. దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్జీ వొంబట్కెరే, ఎడిటర్స్ గిల్డ్ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇటీవల మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్టు కేసును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘దేశంలో ఏం జరుగుతోందో కోర్టుకు తెలుసు. హనుమాన్ చాలీసా చదువుతామన్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలే గానీ విస్తృత ధర్మాసనం అవసరం లేదు. సెక్షన్ 142ఏ చెల్లుబాటుపై కేదార్నా«థ్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించాల్సి ఉంది. కేంద్రం వైఖరి చెప్పాల్సి ఉంది’’ అని ఏజీ వేణుగోపాల్ తెలిపారు. సెక్షన్ 124ఏను రద్దు చేయొచ్చు రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ కేంద్రంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు సిద్ధం చేసిన ముసాయిదాకు ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. భారతదేశంలో తమ పాలనను కాపాడుకోవడానికి బ్రిటిషర్లు చేసిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ చట్టం కారణంగా స్వేచ్ఛాభారతంలో జర్నలిస్టులు, విద్యార్థులు అరెస్టవుతున్నారని వాపోయారు. ‘‘సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలుకు సోమవారం వరకూ సమయం ఇస్తున్నాం. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై వాదప్రతివాదులు లిఖితపూర్వక అభ్యర్థనలను శనివారం ఉదయం అందజేయాలి. మే 10 మధ్యాహ్నం విచారిస్తాం. వాయిదాకు అంగీకరించబోం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు! సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. వీటి భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులైతే సుప్రీంకోర్టు ఇక పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలాను సుప్రీం జడ్జీలుగా నియమించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీనిని ఆమోదిస్తే జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలా జడ్జిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. -
మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఢిల్లీలో కలవరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.. ఒక్క ఢిల్లీలోనే 461 మందికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. వైరస్ బాధితుల్లో ఇద్దరు చనిపోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.95 నుంచి 5.33 శాతానికి పెరిగింది. తాజా కేసులతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 4,30,42,097 చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 11,558 కు చేరిందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.03 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని పేర్కొంది. ఇక కేసులు భారీగా బయటపడిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్‌లో కరోనా నిబంధనలు పాటించాలంటూ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అలాగే ఢిల్లీ వాసులకు ఉచితంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని ఆప్ సర్కార్ నిర్ణయించింది. రాజధానిలో అగ్ని ప్రమాదం ఢిల్లీలోని గ్రీన్‌పార్క్ వద్ద ఉపహార్ థియేటర్లో అగ్నిప్రమాదం తలెత్తింది. దీంతో మంటలు చెలరేగాయి. 9 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదుని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కాగా, 1997, జూన్ 13న ఇదే థియేటర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా హాల్ వినియోగంలో లేదు. -
‘కేంద్రం’ వాటాకు ‘కత్తెర’
సాక్షి, అమరావతి: దేశంలో కొత్తగా జాతీయ హోదా పొందిన సాగు నీటి ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం ఇచ్చే నిధులకు కత్తెర వేసింది. కొత్త జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం మాత్రమే కేంద్రం ఇవ్వనుంది. మిగతా 40 శాతం ఆయా రాష్ట్రాలే భరించాలి. దేశ విస్తృత ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు వాటికి జాతీయ హోదా కల్పించి, అంచనా వ్యయంలో 90 శాతం నిధులను ఇప్పటివరకూ కేంద్రం భరిస్తోంది. ఇప్పుడా నిధుల్లో కోత పెట్టింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానం కింద చేపట్టే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరితో పాటు ఇతర ప్రాజెక్టులకూ ఇదే రీతిలో నిధులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, రెండు హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్), కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ–కశ్మీర్, లడఖ్‌లకు పాత విధానంలోనే 90 శాతం ఇవ్వనుంది. ఇంతకు ముందే ఆమోదం పొందిన పోలవరంతోపాటు 15 జాతీయ ప్రాజెక్టులకు ప్రస్తుత పద్ధతి ప్రకారమే 90 శాతం నిధులిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తెలిపింది. జాతీయ హోదా కల్పన, నిధులు మరింత క్లిష్టం ► తాజా మార్గదర్శకాల ప్రకారం.. నిర్మాణ వ్యయం, పునరావాసం, విద్యుదుత్పత్తి వ్యయం తదితర సమస్యల వల్ల నిధుల కొరతతో నిర్మాణం పూర్తి కాని అంతర్రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టులకు కొత్తగా జాతీయ హోదా కల్పించి, సత్వరమే పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నీటి లభ్యత, పంపిణీ సమస్య లేకుండా ఒక రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లు అంతకంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించనుంది. ► ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో నిధుల లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి మాత్రమే జాతీయ హోదా కల్పిస్తారు. ► రాష్ట్రం తన వాటా నిధులను జమ చేసి.. 75 శాతం ఖర్చు చేయకపోతే కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే.. ఆమోదం పొందిన పెరిగిన వ్యయంలో 20 శాతమే కేంద్రం భరిస్తుంది. మిగతా నిధులను ఆయా రాష్ట్రాలే భరించాలి. ► పాత విధానంలో కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టే జాతీయ హోదా కింద కేంద్రం నిధులిచ్చే చివరి ప్రాజెక్టు. ఏఐబీపీ నిధుల మంజూరులోనూ కోత నిధుల కొరత వల్ల సకాలంలో పూర్తి కాని దేశంలోని 99 ప్రాజెక్టులకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద కేంద్రం నిధులిస్తోంది. కొత్తగా ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకూ నిధుల మంజూరులో కోతలు పెడుతూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ► ఎనిమిది ఈశాన్య, రెండు హిమాలయ రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, లఢఖ్‌లలో ఏఐబీపీ కింద కొత్త ఎంపిక చేసే ప్రాజెక్టులకు వాటి అంచనా వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రం ఇస్తుంది. ► కరవు నివారణ పథకం (డీపీఏపీ), ఎడారి నివారణ పథకం(డీడీపీ) అమలవుతున్న ప్రాంతాలు, గిరిజన, వరద ప్రభావిత, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, బుందేల్‌ఖండ్, విదర్భ, మరఠ్వాడ, కేబీకే (ఒడిశా) ప్రాంతాల్లో కొత్తగా ఎంపిక చేసే ఏఐబీపీ ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 60 శాతం ఇవ్వనుంది. మిగతా ప్రాంతాల్లో ఏఐబీపీ కింద ఎంపిక చేసే ప్రాజెక్టులకు అంచనా వ్యయంలో 25 శాతం నిధులిస్తుంది. మిగతా వ్యయాన్ని ఆ రాష్ట్రాలే భరించాలి. -
ఐసీఎంఆర్ కొత్త గైడ్‌లైన్స్.. ఈ లక్షణాలు ఉంటేనే కోవిడ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్‌కు కూడా పరీక్షలు అవసరం లేదని పేర్కొంది. హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. (చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి!) -
నిజాయితీపరులైన బ్యాంకు ఉద్యోగులకు భరోసా
న్యూఢిల్లీ: నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. సిబ్బంది జవాబుదారీతనానికి సంబంధించి నిబంధనలు సూచించింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది. కేవలం నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని, దురుద్దేశంతో తీసుకున్న వాటికి వర్తించబోవని ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి కేసుల్లో విచారణ జరిపేందుకు పాటించాల్సిన విధానాలను వివరించింది. రుణాన్ని మొండిబాకీగా వర్గీకరించిన ఆరు నెలల్లోగా జవాబుదారీగా వ్యవహరించాల్సిన వారిని గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఓవైపు నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూనే మరోవైపు సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా ఈ మార్గదర్శకాలు ప్రోత్సహించగలవని ఆర్థిక శాఖ పేర్కొంది. ఓ సంస్థ రుణ ఎగవేత కేసుకు సంబంధించి ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా పలువురు బ్యాంకర్లు రుణ డిఫాల్ట్ కేసుల్లో అరెస్ట్ అవ్వడం గమనార్హం. సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) విచారణలకు భయపడి, కొన్ని రకాల రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ భయాలను పోగొట్టి, రుణ వితరణను మెరుగుపర్చేలా బ్యాంకర్లను ప్రోత్సహించేందుకు తాజా మార్గదర్శకాలు ఉపయోగపడగలవని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ ఎస్ కృష్ణన్ తెలిపారు. -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
Telangana: ఎల్ఆర్ఎస్కు ఓకే.. కీలక మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారుల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)–2020 కింద వచ్చిన దరఖాస్తులకు మోక్షం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు దశలు ఇలా.. తొలి దశలో గ్రామపంచాయతీ/ మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చిన దరఖాస్తులను... గ్రామం/ సర్వే నంబర్ /ప్రాంతం / కాలనీల వారీగా వేర్వేరు క్లస్టర్లుగా విభజించి, స్థల పరిశీలన కోసం సిద్ధంగా ఉంచాలని సూచించారు. రెండో దశలో.. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, స్థానిక టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు/ డీటీసీపీఓలతో జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసిన బృందాలు ప్రతి క్లస్టర్‌ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా పరిశీలించిన అంశాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఈ బృందాలను కోరారు. ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం దరఖాస్తు ఉందా ? లేదా ? అని పరిశీలించి ఇదే అంశాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు నివేదించాలని సూచించారు. ఈ మేరకు తక్షణమే బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియలను పూర్తి చేసి ఎల్ఆర్ఎల్ దరఖాస్తుల పురోగతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్లు సమర్పిస్తే, తదుపరి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ లిస్ట్ మేరకు నిర్ణయం తీసుకోవాలి దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా ? లేదా ? అన్న అంశాన్ని గుర్తించడానికి పురపాలక శాఖ చెక్ లిస్ట్ రూపొందించి విడుదల చేసింది. లేఅవుట్, ప్లాట్ తనిఖీకి వెళ్ళినప్పుడు అధికారుల బృందం ఈ చెక్ లిస్ట్ ఆధారంగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సైట్ ఇన్స్పెక్షన్ ముగిసిన తర్వాత ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న/ క్రమబద్ధీకరణకు అర్హత లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించనుంది. క్రమబద్ధీకరణకు అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ మళ్ళీ కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. అర్హత గల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన అదనపు సమాచారాన్ని, సంబంధిత శాఖల నుంచి కావాల్సిన ఎన్ఓసీలు సమర్పించడానికి దరఖాస్తుదారులకు నెల రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రకాలుగా అర్హమైన దరఖాస్తుల విషయంలో చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులను దరఖాస్తుదారులకు ఆన్లైన్ ద్వారా నోటిఫై చేయడంతో పాటు చెల్లింపునకు తగినంత సమయం కూడా ప్రభుత్వం ఇవ్వనుందని అధికారవర్గాలు తెలిపాయి. మొత్తం 25 లక్షల దరఖాస్తులు.. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు గతేడాది ఆగస్టులో ఎల్ఆర్ఎస్–2020 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, రికార్డు స్థాయిలో 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ఈ దరఖాస్తుల పరిష్కారానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తుల క్లస్టరింగ్ (గ్రూపులుగా విభజించడం), సైట్ ఇన్స్పెక్షన్ (స్థల తనిఖీ) అనే రెండు ప్రక్రియలను వచ్చే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు (మెమో) జారీ చేశారు. -
పిల్లల్లో నాలుగు దశల్లో కరోనా.. ఈ లక్షణాలతో జాగ్రత్త
►పిల్లల్లో కోవిడ్–19 వస్తే... తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి. ►సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు. ►పిల్లల్లోనూ అసింప్టమాటిక్ (లక్షణాలు లేకపోవడం), మైల్డ్ (కొద్దిగా), మోడరేట్ (మధ్యస్థాయి), సివియర్ (తీవ్రం) అనే నాలుగు దశలు ఉంటాయి. ►పిల్లల విషయంలో సీటీ స్కాన్‌కు బదులుగా చెస్ట్ ఎక్స్‌రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు. సాక్షి, హైదరాబాద్: పిల్లలకు కోవిడ్–19తో పెద్ద ప్రమాదం లేదు. అయినప్పటికీ అలక్ష్యం, అలసత్వం కూడదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సూచిస్తోంది. కోవిడ్–19 పెద్దలతో పాటు పిల్లల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. అయితే పెద్దలతో పోలిస్తే పిల్లల్లో దుష్ప్రభావాలు అతి తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం వ్యాక్సిన్ ఇస్తూ వారికి రక్షణ కల్పిస్తోంది. కానీ ఆలోపు వయసున్న వారికి టీకాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకు కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స, సూచనలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీజీహెచ్ఎస్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్–19 జాగ్రత్తల్లో ప్రధానమైంది మాస్కు ధరించడం. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్కు వినియోగించాల్సిన అవసరం లేదు. వారు మాస్కు సరిగ్గా వేసుకోకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి సమస్యను బయటకు వ్యక్తపరచలేకపోవడంతో కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక ఐదు సంవత్సరాల నుంచి పన్నెండేళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే మాస్కు ధరించాలి. పన్నెండేళ్లు పైబడిన వారంతా పెద్దలతో సమానంగా మాసు్కలు ధరించాలి. ఇక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేతులు తరచు శుభ్రం చేసుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తి అందరిలో ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రభావం చూపడంలో తేడాలుంటున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువ ప్రభావం చూపుతోంది. శ్వాసను పరిశీలిస్తుండాలి పిల్లల్లో కోవిడ్–19 వస్తే.. తీవ్రతను తెలుసుకునేందుకు ముఖ్యంగా వారు శ్వాస తీసుకునే విధానం పరిశీలించాలి. రెండు నెలల్లోపు పిల్లలు నిమిషానికి 60 సార్లు శ్వాస తీసుకుంటారు. 2 నుంచి 12 నెలల్లోపు పిల్లలు 50 సార్లు, ఐదేళ్లలోపు పిల్లలు 40 సార్లు, 5 సంవత్సరాలు పైబడిన వారంతా 30 సార్లు శ్వాస తీసుకుంటారు. సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు. ఐదు సంవత్సరాలు పైబడినవారు శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలించే ముందు ఆరు నిమిషాల పాటు నడిచిన తర్వాత ఎన్నిసార్లు తీసుకుంటున్నారనేది పరిగణించాలి. రోజుకు మూడుసార్లు ఈ పరీక్ష చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా ఓ ఫార్మాట్‌ను తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఆక్సీమీటర్ ఆధారంగా కూడా ఎస్పీఓ2 ను మూడుసార్లు పరిశీలించుకుని నిర్ధారించుకోవాలి. తల్లిదండ్రులు ఆందోళన పడకూడదు పిల్లలు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలితే తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన పడకూడదు. ప్రస్తుతం కరోనా సోకినవారిలో ఎక్కువమంది సీటీస్కాన్ తీయించి స్కోర్ చూస్తున్నారు. పిల్లల్లో మాత్రం సీటీ స్కాన్‌కు దూరంగా ఉండాలి. చిన్నపిల్లల్లో సాధారణంగా సీటీ స్కాన్‌లో తేడాలు ఉంటాయి. ఎదుగుదల ఆధారంగా వీటిలో మార్పులు నమోదవుతుంటాయి. సీటీకి బదులుగా చెస్ట్ ఎక్స్‌రేతో పరిస్థితిని సమీక్షించవచ్చు. ఈ లక్షణాలతో జాగ్రత్త పిల్లల్లో కోవిడ్–19 వచ్చి తగ్గిన రెండు వారాల తర్వాత మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్–సి (మిస్క్))కు అవకాశాలున్నాయి. గణాంకాల పరంగా అతి తక్కువే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ వచ్చి తగ్గిన 2వారాల తర్వాత మూడు రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండడం, శరీరంపైన రాషెస్, కళ్లు ఎరుపుగా ఉండడం, నోట్లో, చేతులు, కాళ్లపైన ఎర్రటి మచ్చలు ఏర్పడడం, బీపీ పడిపోవడం, గుండె సమస్యలు, డయేరియా, వాంతులు, కడుపులో నొప్పి తదితర లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. బ్లాక్ ఫంగస్‌కూ అవకాశం ఆస్పత్రిలో కోవిడ్–19 చికిత్స పొందిన చిన్నారులు అతి తక్కువ మందిలో బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం కూడా ఉంది. పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిíపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలి. పిల్లల్లో బ్లాక్ ఫంగస్ ప్రభావం ముక్కు, మెదడు, కడుపుల్లో ఉంటుంది. చర్మం నల్లబడడం, దంతాలు వదులు అయ్యి ఊడిపోవడం, కడుపు అప్సెట్ కావడం, వాంతులు, విరేచనాలు, పొట్ట భాగంలో వాపు లాంటివి ఈ కోవలోకే వస్తాయి. నాలుగు దశల్లో ఇలా.. 1.అసింప్టమాటిక్: శ్వాస గమనిస్తూ ఉండాలి కోవిడ్–19 సోకినప్పటికీ అసింప్టమాటిక్‌గా ఉన్న చిన్నారుల్లో శ్వాస తీసుకునే విధానాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తుండాలి. అదేవిధంగా రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. 2,మైల్డ్: యాంటీబయోటిక్స్ వద్దు వీరిలో ఎస్పీఓ2 (ఆక్సిజన్ శాచురేషన్ లెవల్) శాతం 94గా ఉంటుంది. ముక్కు కారడంతో పాటు జ్వరం ఉంటే అందుకు తగిన టాబ్లెట్లను వినియోగించాలి. దగ్గు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిని తాగించే ప్రయత్నం చేయాలి. వీరికి ఎలాంటి యాంటీబయోటిక్స్ వినియోగించొద్దు. వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవే„క్షిస్తుండాలి. 3.మోడరేట్: లక్షణాలను బట్టి చికిత్స అవసరం ఈ దశలోని పిల్లల్లో ఎస్పీఓ2 శాతం 90నుంచి 94 మధ్య ఉంటుంది. శ్వాస తీసుకునే విధానాన్ని వయసును బట్టి అంచనా వేయాలి. వీరిలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందించాలి. జ్వరం, దగ్గు ఉన్నప్పుడు అందుకు సంబంధించిన టాబ్లెట్లు తీసుకోవాలి. అవసరమైతేనే వైద్యుడి సలహా మేరకు ఆస్పత్రిలో చేర్చాలి. 4.సివియర్: ఆస్పత్రిలో చేర్చాల్సిందే ఈ దశలోని పిల్లల్లో ఎస్పీఓ2 శాతం 90 కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హోంఐసోలేషన్ కాకుండా తప్పకుండా ఆస్పత్రిల్లో చేర్చాల్సిందే. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత వైద్యులు పరిస్థితికి అనుగుణంగా చికిత్స ఇస్తారు. యాంటిబయాటిక్స్‌ను అవసరాన్ని బట్టి ఇస్తారు. మిస్క్తో ఆందోళన అవసరం లేదు పిల్లల్లో మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (మిస్క్) ఆందోళనకరం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసులు అరుదుగానే ఉన్నాయి. 40 లక్షల మంది కోవిడ్–19 బారిన పడ్డారు. అందులో ప్రతి 11వేల మందిలో ఒకరు మాత్రమే మిస్క్ బారినపడి చనిపోతున్నట్లు అమెరికాకు చెందిన సంస్థల పరిశోధనలు చెబుతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్ -
Telangana: ప్రభుత్వ భూముల అమ్మకాలకు మార్గదర్శకాలు ఖరారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ-వేలం ద్వారా పారదర్శకంగా ప్రభుత్వ భూముల విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకానుంది. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ పనిచేస్తుందని తెలిపింది. భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకాల పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. -
పిల్లలు గంట.. పెద్దలు 45 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని అందరికీ తెలుసు. కానీ ఏ వయసు వారు ఎంతసేపు, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా స్పష్టత ఇచ్చింది. ఐదేళ్ల పిల్లలు మొదలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, గర్భిణులను ఐదు కేటగిరీలుగా విభజించి ఎవరెంతసేపు ఎక్సర్సైజులు చేయాలో సూచించింది. బీపీ, షుగర్, ఎసిడిటీ, స్థూలకాయం, కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు తిరిగి ఆరోగ్యకర జీవనం సాగించేందుకు వీలుగా శారీరక శ్రమపై తొలిసారి శాస్త్రీయ మార్గదర్శకాలతో నివేదిక విడుదల చేసింది. 5–17 ఏళ్ల వయసువారు... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ఐదేళ్ల నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలు, ప్రతిరోజూ కనీసం గంటపాటు శక్తివంతమైన వ్యాయామాలు చేయాలి. ఎక్కువగా పరిగెత్తడం, జాగింగ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. వారంలో మూడురోజులు కండరాలు, ఎముకలను బలోపేతం చేసే ఎక్సర్సైజులు చేయాలి. ఆటలు ఆడాలి. 18–64 ఏళ్ల వయసువారు... ఈ విభాగంలోని వారు ప్రతివారం కనీసం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు (రోజుకు గరిష్టంగా సుమారు 45 నిమిషాలు) తేలికపాటి నుంచి కఠిన ఎక్సర్సైజులు చేయాలి. వారానికి కనీసం 95 నిమిషాల నుంచి రెండున్నర గంటల వరకు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, కేన్సర్, టైప్–2 డయాబెటీస్ నుంచి బయటపడొచ్చు. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు కోసం వ్యాయామం అవసరం. 65 ఏళ్లు పైబడినవారు... వృద్ధులు సైతం 18–64 ఏళ్ల వయసు కేటగిరీ వారు చేసే వ్యాయామాలన్నీ చేయవచ్చు. వాటితోపాటు వారు వారానికి కనీసం మూడు రోజులు శరీర బ్యాలెన్స్‌కు దోహదపడే ఎక్సర్సైజులు చేయడం మంచిది. వృద్ధులు తూలి కిందపడకుండా ఉండేందుకు ఈ తరహా వ్యాయామాలు ఉపయోగపడతాయి. గర్భిణులు... గర్భిణులు లేదా బాలింతలు ఎలాంటి సమస్యలు లేకపోతే డాక్టర్ల సూచన మేరకు ప్రతివారం కనీసం రెండున్నర గంటల వరకు పరిమితమైన ఏరోబిక్స్ చేయాలి. అయితే వ్యాయామ సమయంలో నిర్ణీత పరిమాణంలో మంచినీరు తప్పక తాగాలి. కఠినమైన వ్యాయామాలు చేయరాదు. దీర్ఘకాలిక అనారోగ్యాలున్నవారు... దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులున్న వారు వారానికి కనీసం గంటన్నర నుంచి ఐదు గంటలపాటు ఏరోబిక్స్ చేయాలి. లేదా వారానికి కనీసం 75 నిమిషాల నుంచి రెండున్నర గంటలపాటు కఠినమైన, శక్తివంతమైన ఏరోబిక్స్ చేయాలి. అలాగే వారానికి కొన్నిసార్లు, తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి బ్యాలెన్స్ వ్యాయామాలు చేయాలి. శారీరక శ్రమను ప్రోత్సహించాలి డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని మార్గదర్శకాలు అత్యంత శాస్త్రీయమైనవి. అందువల్ల శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి మానసిక ఉల్లాసం లభిస్తుంది. శారీరక శ్రమ చేసే గర్భిణుల్లో బీపీ సమస్య తలెత్తదు. ముందస్తు కాన్పుల సమస్య తగ్గుతుంది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్న అంశాలివి ►రోజుకు 10–12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారికంటే 1.5 రెట్లు ఎక్కువ. ►శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి. ►27.5 శాతం పెద్దలు, 81 శాతం యుక్త వయస్కులు శారీరక శ్రమ చేయడంలేదు. -
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ షురూ
కోవిడ్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. మే నెలలో జరగాల్సిన కాన్స్ చిత్రోత్సవాలు జరగలేదు. వచ్చే ఏడాది జరిగే గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్ అవార్డులను కొన్ని వారాలు వెనక్కి జరిపారు. ఈ ఏడాది జరగాల్సిన కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను వర్చువల్‌గా (ఆన్లైన్లో) జరపడానికి నిశ్చయించారు. అయితే వెనిస్ చిత్రోత్సవాలను కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ జరపబోతున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో సుమారు 50 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ సంబరానికి హాజరుకానున్న వాళ్లందరికీ ఉష్ణోగ్రత చూసే లోపలి అనుమతిస్తారట. ప్రతీ రెండో సీట్ ఖాళీగా ఉండేలా చూసుకుంటారట. ఈ ఫెస్టివల్‌కి హాజరు కావాలనుకున్నవాళ్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని కూడా తెలిపారు. -
విద్యా బోధన.. వయా వీడియో పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యా బోధన ప్రారంభానికి సంబంధించిన కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది. హైకోర్టుకు తమ విధానపర నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉన్నం దున కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇటీవల ప్రజ్ఞత పేరుతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శ కాల ప్రకారమే ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. అయితే అందులో ఆన్లైన్ బోధనతో పాటు రికార్డెడ్ వీడియో పాఠాల విధానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండింటి పైనా విద్యాశాఖ ఆలోచనలు చేస్తోం ది. వీలు కలిగిన పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ బోధన చేపట్టాలని, వీలుకాని గ్రామీణ ప్రాంతాల్లో వీడియో పాఠాలను టీశాట్, దూర దర్శన్ (యాదగిరి), ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ చానల్ వంటి వాటి ద్వారా బోధనను చేపట్టే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఆన్లైన్ బోధన చేపట్టాలంటే విద్యార్థులకు మొబైల్/ట్యాబ్ వంటివి అవసరం. అయితే విద్యార్థుల ఇళలో ఏ మేరకు ఆయా పరికరాలున్నాయో అనధికారిక సర్వే చేయాలని కేంద్రం ప్రజ్ఞతలో పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా విద్యా శాఖ చర్యలు చేపట్టాలని భావి స్తోంది. కరోనా కొంత అదుపు లోకి వచ్చే వరకు ఆన్లైన్, వీడియో పాఠాలనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం షిఫ్ట్ పద్ధతుల్లో బోధన చేపట్టే అంశాలను పరిశీలిస్తోంది. అందులోనూ ముం దుగా 9, 10 తరగతులకు బోధన నిర్వహించడం, కొన్ని రోజుల తర్వాత 6, 7, 8 తరగతులకు బోధన ప్రారంభించే అంశంపైనా పరిశీలన జరుపుతోంది. ఇక రెండు, మూడు నెలల తరువాతే ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధనను చేపట్టే అంశంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ స్కూళ్లలో 90% వీడియో పాఠాలే.. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠ శాలలుంటే అందులో 28 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. గురుకులాలు, ఇతర ప్రత్యేక విద్యా సంస్థలను మినహాయిస్తే 23 లక్షల మందికి పైగా విద్యార్థులు జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీటిల్లో 90% మంది విద్యార్థులకు వీడియో పాఠాలే బోధించే అంశంపై పరిశీలన జరుపు తున్నట్లు తెలిసింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న విద్యార్థులకు మాత్రం ఆన్లైన్లో పాఠాలు బోధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు దేనిపైనా ఓ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. వివిధ కోణాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ప్రైవేటులోనూ ఎక్కువ శాతం వీడియో పాఠాలవైపే.. రాష్ట్రంలోని 10 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 2 వేలకు పైగా ఉన్న కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ఇంటర్నేషనల్, ప్రముఖ పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ పాఠాలను ప్రారంభించాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలు, ఇతర జిల్లా కేంద్రాల్లోని మెజారిటీ ప్రైవేటు పాఠశాలలు ఇంకా ఆన్లైన్ బోధన చేపట్టలేదు. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా ఆచరణ ఎంత మేరకు సాధ్యమవుతుందన్న విషయంపై తర్జన భర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలు కూడా కొన్నాళ్ల వరకు వీడియో పాఠాల వైపే మొగ్గు చూపే అవకాశముంది. ఆన్లైన్ కష్టసాధ్యం.. అమలు చేసినా కొద్దిసేపే.. రాష్ట్రంలో వీలున్న స్కూళ్లలో ఆన్లైన్ తరగతులను ప్రారంభిస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం ప్రతి తరగతికి 2 నుంచి 3 గంటలే ఆన్లైన్ బోధన చేపట్టే అవకాశముంది. ఉన్నత పాఠశాల్లో గరిష్టంగా 4 సెషన్లలోనే, 1 నుంచి 8 తరగతులకు రెండు సెషన్లలోనే బోధనను నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అంతకుమించి ఎక్కువ బోధన చేపట్టే వీలుండదని, పైగా ఆన్లైన్ బోధనకు టీచర్లను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది కష్టసాధ్యమని పేర్కొన్నారు. వీటన్నింటికంటే వీడియో పాఠాలే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. -
రిస్క్ జోన్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే అది ఒక్కరికే పరిమితం కావడం లేదని, కుటుంబ సభ్యుల్లో సగటున 60 శాతానికి పైగా సోకుతోందని విశ్లేషించింది. కరోనా వైరస్ భారినపడుతున్న వారిలో ఎక్కువగా అపార్ట్మెంట్లు, గేటె డ్ కమ్యూనిటీ సొసైటీలు, రెసిడెన్షియ ల్ కాంప్లెక్స్‌ల్లో ఉండే వారే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సం క్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలనలో తే లింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అంచనాకందే స్థితిలో ఉన్నప్పటికీ జాగ్రత్తలు పాటించకుంటే వ్యాప్తి వేగం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రతులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో కూడా అందుబాటులో పెట్టింది. నిఘా కట్టుదిట్టం చేస్తేనే... గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలు, అపార్డ్‌మెంట్‌ల్లో ఎక్కువ సం ఖ్యలో కుటుంబాలు ఉండడంతో సాధారణంగా రాకపోకలు అధికంగానే ఉంటాయి. నివాసితులతో పాటు వారి కో సం వచ్చే విజిటర్స్ సంఖ్య కూడా ఎక్కువే. ఈ క్రమంలో నిఘా కట్టుదిట్టం చేసి జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విజిటర్స్‌ను అనుమతించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు మాస్కు, హ్యాండ్‌వాష్ లేక శానిటైజర్‌తో చేతు లు శుభ్రం చేసుకున్న తర్వాతే లోనికి రానివ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లొద్దని చెబుతున్న ప్రభుత్వం... ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన పదేళ్లలోపు పిల్లలంతా ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. అదేవిధంగా ముఖానికి ఫేస్‌షీల్డ్‌లు లేదా 3 లేయర్ల మాస్కు లు తప్పకుండా ధరించాలి. ఇతర వస్తువులు, వేరేచోట్ల చేతులతో తాకాల్సిన పరిస్థితుల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్ లేదా శానిటైజర్లతో చేతుల్ని శుభ్రంగా కడగాలి. బహిరంగంగా ఉమ్మివేయడాన్ని పూర్తిగా నిషేధించాలి. నిర్లక్ష్యం చేస్తున్నారు... కోవిడ్–19ను ఎదుర్కొవాలంటే ఈ వ్యాధి వ్యాప్తి, నిలువరిం చే అంశాలపై అవగాహన అతిముఖ్యమని ప్రభుత్వం చెబు తోంది. ఈ దిశగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. కానీ జాగ్రత్తలు పాటించడంలో చాలామంది నిర్లక్ష్యం చూపుతున్నారనే అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ సముదాయాల్లో నివాసితులు అవాస ప్రాంత పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో చర్చిం చుకుంటే మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలు, ఇతర కాలనీల్లో ఉంటున్న వారంతా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో టచ్‌లో ఉంటున్నారు. ఈ పద్ధతిని అందరూ కొనసాగిస్తే తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్–19ను వీలైనంత వరకు నిలువరించవచ్చునని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. -
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు
-
కరోనా కట్టడికి జాతీయ మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని జాతీయ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రజలంతా కచ్చితంగా పాటించాలని సూచించింది. అవి ఏమంటే.. ► బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరం. ఇందుకు రాష్ట్రాలు, స్థానిక యంత్రాంగాల చట్టా లు, నిబంధనలు అమల్లో ఉంటాయి. ► పబ్లిక్ ప్రదేశాల్లో, ప్రయాణ సమయాల్లో భౌతిక దూరం పాటించాలి. ► వివాహాల్లో భౌతిక దూరం పాటించాలి. 50 మంది కంటే ఎక్కువ అతిథులు ఉండరాదు. ► అంతిమ సంస్కారాల సమయంలోనూ భౌతిక దూరం పాటించాలి. 20 మంది కంటే ఎక్కువ హాజరుకారాదు. ► బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, పొగాకు, గుట్కా వినియోగాన్ని అనుమతించరు. ► దుకాణాలు రెండు గజాల దూరం నియమాన్ని పాటించాలి. ఐదుగురు కంటే ఎక్కువ మందిని దుకాణాల వద్ద అనుమతించరాదు. పని ప్రదేశాల్లో అదనపు మార్గదర్శకాలు ► వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియను అనుసరించాలి. ► కార్యాలయాలు, మార్కెట్లు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాల పని గంటలు నిర్ధిష్టంగా కాకుండా అస్థిరంగా ఉండాలి. ► కార్యాలయాల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, కామన్ ఏరియాల్లో థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ వాష్, శానిటైజర్ వంటి సదుపాయాలు ఉండాలి. ► డోర్ హ్యాండిళ్లు సహా సిబ్బంది తాకేందుకు అవకాశం ఉన్న అన్నింటినీ, కామన్ వసతులను, మొత్తం పని ప్రదేశాన్ని తరచుగా, శానిటైజ్(క్రిమి రహితం) చేయాలి. ► సిబ్బంది మధ్య భౌతిక దూరం ఉండేలా కార్యాలయ ఇన్‌ఛార్జులు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే షిఫ్టుల మధ్య తగినంత అంతరం ఉండేలా జాగ్రత్తపడాలి. -
రైలు బండి.. షరతులు ఇవేనండీ
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి ఊరట కల్పి స్తూ పరిమిత మార్గాల్లో రైలు ప్రయాణానికి పచ్చజెండా ఊపిన కేంద్రం ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బుకింగ్ ప్రొటోకాల్‌పై రైల్వే శాఖ పలు మార్గదర్శకాలు జారీచేసింది. ‘తొలుత 15 మార్గాల్లో 15 జతల (30 రానుపోను ప్రయాణాలు) రైళ్లను ప్రారంభిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఇతర రెగ్యులర్ ప్యాసింజర్ సర్వీసెస్, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబ్ అర్బన్ సర్వీసులు ఎలాంటి సేవలు అందించవు’ అని పేర్కొంది. మార్గదర్శకాలివీ... ► ప్రస్తుతం పనిచేయనున్న ప్రత్యేక రైళ్లలో ఏసీ తరగతులే ఉంటాయి. ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లే ఉంటాయి. ► రాజధాని రైళ్లలో రెగ్యులర్ టైమ్ టేబుల్ ప్రకారం ఉండే చార్జీలు ఈ స్పెషల్ ట్రైన్లకు వర్తిస్తాయి. కేటరింగ్ చార్జీలు ఉండవు. ► ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకునే వీలుంది. ► టికెట్ల బుకింగ్‌కు కౌంటర్లు ఉండవు. రైల్వే, ఐఆర్సీటీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవడానికి వీలు లేదు. ► రిజర్వేషన్ గరిష్టంగా తదుపరి ఏడు రోజులలోపు ప్రయాణానికి మాత్రమే. ► కన్ఫర్మ్డ్ టికెట్లను మాత్రమే అనుమతిస్తారు. ఆర్ఏసీ, వెయిటింగ్ టికెట్‌ను అనుమతించరు. ► కరెంట్ బుకింగ్, తత్కాల్ బుకింగ్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ అనుమతించరు. అన్ రిజర్వ్డ్ టికెట్లు(యూటీఎస్) అనుమతించరు.. భోజన వసతి లేదు ► ప్రయాణ చార్జీల్లో క్యాటరింగ్ చార్జీలు ఉండవు. æ ప్రీ పెయిడ్ మీల్ బుకింగ్ (భోజనం కోసం ముందస్తు చెల్లింపు), ఈ–క్యాటరింగ్ వెసులుబాటు ఉండదు. ► పరిమితమైన ఆహార పదార్థాలు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (నీటి సీసాలు) చెల్లింపు పద్ధతిలో అందించేందుకు ఐఆర్సీటీసీ ఏర్పాట్లు చేస్తుంది. బుకింగ్వేళ దీనికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. ► పొడిగా ఉండే ఆహారం, తినడానికి సిద్ధంగా ఉండే ఆహారం (రెడీ టూ ఈట్), నీటి సీసాలు చెల్లింపు పద్ధతిలో ప్రయాణంలో అందుబాటులో ఉంటాయి.. ► ప్రయాణికులందరినీ తప్పనిసరిగా స్క్రీనిం గ్ చేస్తారు. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ► రైల్లో ఎలాంటి బ్లాంకెట్లు, లినెన్ క్లాత్, కర్టెయిన్లు అందుబాటులో ఉండవు. అందువల్ల కోచ్‌లలో ఏసీ కూడా ఇందుకు అనుగుణంగా మెయింటేన్ చేస్తారు. ► బెడ్‌షీట్‌ను ప్రయాణికులు ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు. ► ప్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి స్టాళ్లు, బూత్‌లు తెరిచి ఉండవు. వెండర్ల అమ్మకాలు కూడా ఉండవు. ► రైల్వే స్టేషన్లకు చేరేందుకైనా, స్టేషన్ల నుంచి ఇంటికి వెళ్లేందుకైనా ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే ఆయా వాహనాల డ్రైవర్లకు సహా వెసులుబాటు ఉంటుంది. ► ప్రతి ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాన్సలేషన్ ఇలా.. ► టికెట్ రద్దు (క్యాన్సలేషన్) చేసుకోవాలనుకుంటే రైలు బయలుదేరే షెడ్యూలు సమయం కంటే 24 గంటల ముందు అనుమతిస్తారు. ► 24 గంటల కంటే తక్కువ సమయం ఉంటే టికెట్ రద్దుకు అనుమతించరు. ► క్యాన్సలేషన్ చార్జీగా టికెట్ ధరలో 50 శాతం విధిస్తారు. ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రైలు ఎక్కేటప్పుడు, రైలు ప్రయాణంలో తప్పనిసరిగా మాస్క్ లేదా ఫేస్ కవర్ ధరించాలి. ► షెడ్యూలు సమయం కంటే 90 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ► ప్రయాణికులు స్టేషన్లలో, రైళ్లలో భౌతిక దూరం పాటించాలి. ► గమ్యం చేరాక ప్రయాణికులు ఆయా రాష్ట్రాలు విధించిన ఆరోగ్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. -
ఆసుపత్రులకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా లైన్ క్లియర్ చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. చికిత్స అందించే వైద్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రొటోకాల్స్‌ను వివరిస్తూ అనేక సూచనలు చేసింది. కరోనా కారణంగా లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. వాటిల్లో సాధారణ వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులు సహకరించకపోవడంతో వైద్యం అందక ఓ గర్భిణీ ఇటీవల చనిపోయింది. అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు చేయడానికి కూడా వైద్యులు భయపడుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనే దీనికి కారణం. చదవండి: 21దాకా లాక్డౌన్..? కొన్ని జిల్లాల్లో ప్రైవేటు ఆసుపత్రులు తెరిస్తే అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వైద్య సేవలను నిలిపేయొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా చాలాచోట్ల అమలు కావడంలేదు. ఈ అంశంపై కొంత గందరగోళం నెలకొంది. ఒకవైపు ఆసుపత్రుల యాజమాన్యాలు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటే, కొన్నిచోట్ల తెరవాలంటే జిల్లా అధికారుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందరిలోనూ కరోనా భయమే నెలకొని ఉంది. ఈ నేపథ్యం లోనే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య సిబ్బందికి భరోసానిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను పునరుద్ధరించేలా ఈ మార్గదర్శకాలిచ్చారు. కరోనా చికిత్స చేసే బ్లాకులున్న ఆసుపత్రులతో పాటు, కరోనాతో సంబంధం లేని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఇవి వర్తిస్తాయి. ఆ ఆస్పత్రుల్లో ప్రత్యేక ద్వారం... ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని కరోనా కోసమే కేటాయించారు. అయితే మున్ముందు కేసులు పెరిగే పరిస్థితి ఉంటే, జిల్లా స్థాయి వరకు అన్ని రకాల ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్‌ను సిద్ధం చేసే అవకాశాలున్నాయి. అటువంటి చోట్ల సాధారణ చికిత్స చేసే వైద్య సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యే ప్రమాదముంది. అలాగే ప్రైవేటు ఆసుపత్రులకు కూడా సాధారణ రోగులతోపాటు కరోనా అనుమానితులు కూడా వచ్చే అవకాశముంది. కాబట్టి అన్ని ఆసుపత్రులు కూడా కరోనా లక్షణాలతో, ఫ్లూ లక్షణాలతో వచ్చే వారి కోసం ప్రత్యేక ద్వారాన్ని తెరవాలి. వారిని ప్రత్యేక బ్లాక్‌లలో పరీక్షించాలి. ఆయా ఆసుపత్రుల్లో ఉండే ఏఏ విభాగాలు ఏ స్థాయిలో రిస్క్‌లో ఉంటాయో, వైద్య సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ►కరోనా బ్లాక్ ఉన్న సాధారణ ఆసుపత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపీ) విభాగాన్ని తేలికపాటి రిస్క్‌గా గుర్తించారు. అటువంటి చోట హెల్ప్ డెస్క్‌లో పనిచేసే సిబ్బంది భౌతిక దూరం పాటించాలి. అలాగే మూడు లేయర్ల మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ►డాక్టర్ చాంబర్లో రోగులను పరీక్షించే ప్రాంతాన్ని తేలికపాటి రిస్క్‌గానే గుర్తించారు. అప్పుడు డాక్టర్లు కూడా మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ►ఈఎన్టీ, డెంటల్ చికిత్సకు సంబంధించి డాక్టర్ల చాంబర్లు మధ్యస్థ రిస్క్‌లో ఉన్నాయి. ఎన్–95 మాస్క్‌లు, గాగుల్స్, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్ ధరించాలి. ►ప్రీ అనెస్థీటిక్ చెకప్ చేసే ప్రాంతం కూడా మధ్యస్థ రిస్క్‌లో ఉంటుంది. డాక్టర్లు తప్పనిసరిగా ఎన్–95 మాస్క్‌లు, గాగుల్స్, గ్లోవ్స్ ధరించాలి. ►ఫార్మసీ కౌంటర్లో మందులు సరఫరా చేసే ప్రాంతం కూడా మధ్యస్థ రిస్క్‌లో ఉంటుంది. అందులో పనిచేసేవారు మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ►అలాగే శానిటరీ సిబ్బంది తరచుగా ఆసుపత్రులను శుభ్రం చేస్తుంటారు. వారు తేలికపాటి రిస్క్‌లో ఉంటారు. అటువంటివారు మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ఇన్‌పేషెంట్ విభాగంలో... ►వార్డులు, వ్యక్తిగత రూంలలో ఉండే రోగులను చూసే వైద్య సిబ్బంది తేలికపాటి రిస్క్‌లో ఉంటారు. వారు తప్పనిసరిగా మూడు లేయర్ల మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ►ఐసీయూ/క్రిటికల్ కేర్లలో ఉండే రోగులను చూడటం మధ్యస్థ రిస్క్‌గా గుర్తించారు. వారు ఎన్–95 మాస్క్‌లు, గాగుల్స్, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్ ధరించాలి. ►వార్డు/ఐసీయూ/క్రిటికల్ కేర్లలో చనిపోయిన (కరోనాతో సంబంధం లేని) వారి మృతదేహాన్ని మార్చురీ నుంచి తరలించడం తక్కువ రిస్క్‌గానే పరిగణించారు. అప్పుడు మూడు లేయర్ల మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ►ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేయడం మధ్యస్థ రిస్క్‌గా గుర్తించారు. అప్పుడు వైద్య సిబ్బంది మూడు లేయర్ల మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించాలి. నాన్ కరోనా ఎమర్జెన్సీ విభాగంలో.. ►ఎమర్జెన్సీ కేసులను పరీక్షించేటప్పుడు వైద్యులు, ఇతర సిబ్బంది తేలికపాటి రిస్క్‌లోనే ఉంటారు. అప్పుడు మూడు లేయర్ల మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ►సీరియస్ రోగిని పరీక్షించడం మాత్రం హైరిస్క్ కిందే లెక్క. కాబట్టి పూర్తిస్థాయి పీపీఈ కిట్ వాడాలి. అంటే ఎన్–95 మాస్క్, కవరాల్, గాగుల్స్, నైట్రేల్ ఎగ్జామినేషన్ గ్లోవ్స్, షూ కవర్లు వాడాలి. ఇతర సేవల్లో ఉన్నప్పుడు.. ►లేబరేటరీలో శాంపిళ్ల కలెక్షన్, పరీక్ష చేయడం, రేడియో డయాగ్నసిస్, బ్లడ్ బ్యాంకుల్లో సేవలు అందించడం, లాండ్రీ సర్వీసుల్లో ఉన్నవారు తేలికపాటి రిస్క్‌లోనే ఉంటారు. మూడు లేయర్ల మాస్క్‌లు, గ్లోవ్స్ ధరిస్తే చాలు. ►కిచెన్, ఇంజనీరింగ్ సర్వీసెస్, పరిపాలనా ఆర్థిక విభాగాల్లో పనిచేసేవారు తక్కువ రిస్క్‌లోనే ఉన్నట్లు లెక్క. వారు ఫేస్ కవర్ ఉపయోగిస్తే చాలు. ►ఇక అంబులెన్సుల్లో వెంటిలేషన్ లేకుండా రోగులను తరలించడం తక్కువ రిస్క్‌గానే పరిగణిస్తారు. అప్పుడు సిబ్బంది మూడు లేయర్ల మాస్క్‌లు, గ్లోవ్స్ ధరిస్తే చాలు. అలాగే అంబులెన్స్ డ్రైవర్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. ►తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడే రోగులను అంబులెన్స్‌లలో తరలించడం హైరిస్క్గానే పరిగణిస్తారు. అప్పుడు సిబ్బంది పూర్తిస్థాయి పీపీఈ కిట్ వాడాలి. అంటే ఎన్–95 మాస్క్, కవరాల్, గాగుల్స్, గ్లోవ్స్, షూ కవర్ తప్పక ఉపయోగించాలి. -
పని ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో, పని ప్రదేశాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పురపాల న, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్వి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే నిర్మాణం జరిగే ప్రాంతాల్లో ఉన్న కార్మికుల క్యాంపులు, లేదా బయటి నుంచి వచ్చే కా ర్మికులు ఈ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ► రోజూ ఉదయం కార్మికులతో సమావేశం ఏర్పా టు చేసి సామాజిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు పాటిస్తున్నదీ లేనిదీ సమీక్షించా లి. ప్రతి ఒక్కరికీ ఉదయం, సాయంత్రం వేళల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. పని ప్రదేశం లో సబ్బు, శానిటైజర్లు, నీటిని అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించేలా చూడాలి. పని ప్రారంభించే ముందు, విధు ల నుంచి వెళ్లే సమయంలో తమ చేతులు కడుక్కుని వెళ్లాల్సి ఉం టుంది. పని ప్రదేశంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ మాస్క్‌ను విధిగా ధరించాలి. బయట నుంచి వ చ్చే నిర్మాణ సామగ్రి, పనిముట్లను ఉపయోగిం చే సమయంలో విధిగా చేతి గ్లౌజులు ధరించాలి. గుట్కా, పొగాకు, పాన్ తదితరాలను పని ప్రదేశాల్లో పూర్తిగా నిషేధించడంతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం. ► ఒకేచోట గుమికూడకుండా, సామాజిక దూరా న్ని పాటిస్తూ భోజనం చేయాలి. రోజూ సైట్ కా ర్యాలయంతో ప్రవేశ ద్వారాలు, క్యాంటీన్లు, కా ర్మికుల నివాస సముదాయాలు, నడిచే మార్గాలతో పాటు పని ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. పా రిశుధ్య సిబ్బందికి అవసరమైన సామగ్రి అందజేయాలి. పని ప్రదేశంలోకి అవసరం లేని వారి ప్రవేశాన్ని నిషేధించాలి. కరోనాకు చికిత్స అం దించే ఆస్పత్రులు, క్లినిక్‌ల వివరాలను పని ప్రదేశంలో ప్రదర్శించాలి. క్రమం తప్పకుండా వైద్యు డు పని ప్రదేశాన్ని సందర్శించాలి. ► కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుగు లేదా హిందీలో కార్మికులకు అర్థమయ్యే భాషలో ప్రదర్శించాలి. అనుమానాలు, సందేహాలు ఉంటే ప్రాజెక్టు మేనేజర్ లేదా సేఫ్టీ ఆఫీసర్‌ను సంప్రదించేలా అవగాహన కల్పించాలి. పుకార్లను వ్యాపింపజేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధ పడుతున్న వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటు 108 లేదా 104 నంబర్‌కు సమాచారం అందించాలి. పని ప్రారంభించే తొలి రోజు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ► కార్మికవాడలో ఉండే కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక నంబర్‌తో కూడిన ఫొటో గుర్తింపు కార్డు అందజేయాలి. ప్రతి కార్మికుడి వి వరాలతో రికార్డులు నిర్వహించాలి. కార్మికులు పని ప్రదేశం వదిలి బయటకు వెళ్లకుండా స్థాని కంగానే వారికి అవసరమైన నిత్యావసరాలు, ఇతరాలను సమకూర్చాలి. తప్పనిసరి పరిస్థితు ల్లో బయటకు వెళ్లాల్సి వస్తే సంబంధిత సూపర్వైజర్ అనుమతితో మాస్క్ ధరించి వెళ్లాలి. -
వాలంటీర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 24 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఎంపికయిన వారికి ఈ నెల 27 నుంచి 29 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్ల వయసు నిండి 35 ఏళ్లకు మించని వారంతా ఆన్లైన్లో ఈ వెబ్సైట్ (https://gswsvolunteer,apcfss.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇంటర్మీడియట్ , పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్ధులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు సంబంధిత గ్రామపంచాయితీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివాసులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడానికి అవకాశం లేని వారు గ్రామ, వార్డు సచివాలయ కార్యాలయంలో సంప్రదించి, అక్కడ సిబ్బంది సహయంతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.