పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఒక కీలకమైన కేసుపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు 1997లో ‘విశాఖ’ మార్గదర్శకాలను వెలువరించింది. దరిమిలా కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ‘సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్’ను అమలులోకి తెచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన ‘విశాఖ’ మార్గదర్శకాలను యథాతథంగా ఆమోదిస్తూ రూపొందించిన ఈ చట్టంలోని నిబంధనలు ఇవీ...
►పని ప్రదేశంలో సంస్థ యజమాని గాని లేదా బాధ్యతగల వ్యక్తి గాని సంబంధిత సంస్థలో లైంగిక వేధింపుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలి.
►సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో నిర్దేశించిన ప్రకారం లైంగిక వేధింపులంటే ఏమిటనే అంశాన్ని సంస్థలో అందరికీ తెలిసేలా చేయాలి. దీనికి సంబంధించి మార్గదర్శకాల ప్రతులను ఉద్యోగులందరికీ పంపాలి.
►లైంగిక వేధింపులను నిషేధిస్తూ క్రమశిక్షణకు సంబంధించిన నియమ నిబంధనలను సంస్థ రూపొందించుకోవాలి.
►క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
►మహిళా ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలి.
►వారి పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి యాజమాన్యం పట్టించుకోవాలి.
►సంస్థలో ప్రతికూల వాతావరణం లేకుండా చూడాలి.
►పదిమందికి పైగా ఉద్యోగులు పనిచేసే ప్రతి సంస్థలోనూ తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థ యాజమాన్యమే ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
చట్టం ప్రకారం లైంగిక వేధింపులేవంటే..
►మహిళల పట్ల లైంగిక దాడికి పాల్పడినా, లైంగిక దాడికి ప్రయత్నించినా, శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంత పెట్టినా లేదా అందుకోసం అదేపనిగా బతిమాలుతూ విసిగిస్తూ ఉన్నా, వారి పట్ల అశ్లీల పదజాలం ప్రయోగించినా, అసభ్యకరమైన సైగలు చేసినా, అదేపనిగా కన్నార్పకుండా చూస్తూ ఇబ్బంది కలిగించినా, అనవసరంగా తాకుతూ ఇబ్బంది పెట్టినా, లైంగికపరమైన చేష్టలతో శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బంది కలిగించినా.. అలాంటి చర్యలన్నింటినీ చట్టం లైంగిక వేధింపులుగానే పరిగణిస్తుంది.
►రాజ్యాంగంలోని 14, 15 అధికరణాల ప్రకారం పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయి. మహిళలపై ఎలాంటి వేధింపులు జరిగినా రాజ్యాంగం వారికి కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడంగానే చట్టం పరిగణిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని 21వ అధికరణం ఎటువంటి వేధింపులు లేని సురక్షితమైన వాతావరణంలో తమకు నచ్చిన వృత్తి వ్యాపారాలు చేసుకునే హక్కు కూడా మహిళలకు ఉంది.
విశాఖ మార్గదర్శకాల నేపథ్యం
రాజస్థాన్‌లో జరిగిన ఒక అత్యాచార సంఘటన ‘విశాఖ’ మార్గదర్శకాలకు, దాని ఫలితంగా పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల (నిషేధ, నిరోధక, పరిష్కార) చట్టం అమలుకు దారితీసింది. రాజస్థాన్‌లో 1990వ దశాబ్దంలో భన్వరీదేవి అనే ప్రభుత్వ ఉద్యోగి తన పరిధిలో గల ఒక గ్రామంలో తలపెట్టిన బాల్య వివాహాన్ని అడ్డుకుంది. దీనిపై ఆగ్రహించిన గ్రామ పెత్తందార్లు ఆమెకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనే కక్షతో ఆమెపై సామూహికంగా లైంగికదాడికి తెగబడ్డారు.
ఈ కేసులో రాజస్థాన్ హైకోర్టులో బాధితురాలికి న్యాయం జరగలేదు. దీనిపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలన్నీ ఏకమై రాజస్థాన్ హైకోర్టు తీర్పును ప్రశ్నించాయి. ‘విశాఖ’ అనే మహిళా హక్కుల సంస్థ మరికొందరిని కలుపుకొని బాధితురాలికి బాసటగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. చివరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాల ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment