మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ‘హాక్ ఐ’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ఒంటరి ప్రయాణాల్లో మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు.
ఎస్‌ఓఎస్...
‘హాక్–ఐ’లో ఎస్‌ఓఎస్ (టౌట)విభాగం ఉంటుంది. ప్రాథమిక సమాచారాన్ని ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన ఐదు ఫోన్ నంబర్లను ఫీడ్ చేయాలి. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్‌ఓఎస్’ను నొక్కితే చాలు... కంట్రోల్ రూమ్, జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. వినియోగదారులు పొందుపరచిన ఐదు నంబర్లకూ సమాచారం వెళ్తుంది. ‘ఎస్‌ఓఎస్’ను నొక్కిన 9 సెకండ్లకే అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు.
నెట్ లేకున్నా ఎస్‌ఓఎస్...
మొబైల్ డేటా అందుబాటులో లేకపోయినా లేదా మొబైల్ డేటా ఆన్‌లో లేకపోయినా ఎస్‌ఓఎస్‌ను డయల్–100కు అనుసంధానిస్తూ కొత్త వెర్షన్‌నూ రూపొందించారు. బాధితులు ఎస్‌ఓఎస్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌గా అది ఫోన్ కాల్‌గా మారిపోయి ‘డయల్–100’కు చేరుతుంది. సిబ్బంది అలర్ట్ అవుతారు.
‘వందకూ’ వర్తింపు...
హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’ డయల్ చేయకుండా ఈ యాప్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం అందుతోంది.
విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్
మహిళల భద్రమైన ప్రయాణం కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగమే ‘విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్’. వాహనం ఎక్కేముందు సదరు ప్రయాణికురాలు ‘హాక్ – ఐ’ యాప్‌లోని ‘ట్రావెల్ మేడ్ సేఫ్’ విభాగంలోని ‘డెస్టినేషన్’ను ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. కమిషనరేట్‌లోని ఐటీ సెల్ ఆ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది గమ్యం చేరేవరకు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment