mobile applications
-
వీచాట్, క్యాస్పర్స్కైపై నిషేధం.. కారణం ఇదే..
కెనడా ప్రభుత్వం చైనా మెసేజింగ్ అప్లికేషన్ వీచాట్‌ను, రష్యన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కాస్పర్స్కైను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీచాట్ యాప్ విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగించే యాప్స్‌లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా దక్షిణాసియా వాసులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. వీచాట్ యాప్ నుంచి కీలకమైన డేటా లీక్ అవుతున్నట్లు కచ్చితమైన ఆధారాలు లభించకపోయినప్పటికీ.. రిస్క్‌ను అంచనావేసి ముందు జాగ్రత్తగా ప్రభుత్వ పరికరాల నుంచి దీన్ని తొలగించాలని ఆదేశించినట్లు కెనడా ట్రెజరీ బోర్డు అధ్యక్షురాలు అనితా ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై వీచాట్ యజమాని అయిన టెన్సెంట్ సంస్థ స్పందించలేదు. మరోవైపు రష్యాకు చెందిన క్యాస్పర్స్కైపై కూడా చర్యలు తీసుకొంటున్నట్లు వెల్లడించారు. దాంతో కంపెనీ వర్గాలు మాట్లాడుతూ కెనడా తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని, నిరాశను కలిగించిందని తెలిపాయి. ప్రభుత్వ ఆందోళనలను పరిష్కరించడానికి సంస్థకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ రెండు అప్లికేషన్లను డౌన్లోడ్ చేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
Pinduoduo: దగాకోరు యాప్
వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తాయన్న ఆరోపణలు చైనా మొబైల్ అప్లికేషన్ల(యాప్‌లు)పై ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇలాంటి యాప్‌లపై నిషేధం విధించాయి. చైనాలో బాగా జనాదరణ ఉన్న షాపింగ్ యాప్ ‘పిండువొడువో’ తమ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నట్లు ఇటీవలే వెల్లడయ్యింది. 75 కోట్ల మంది డేటాను సేకరించి, వ్యాపార అభివృద్ధి కోసం వాడుకున్నట్లు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఈ యాప్‌ను ఫోన్లలో ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే తొలగించడం చాలా కష్టమని సైబర్ సెక్యూరిటీ నిపుణు లు చెబుతుండడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఇప్పటికీ పిండువొడువో యాప్‌పై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ► 75 కోట్ల మంది వినియోగదారుల విస్తృత డేటాను పిండువొడువో యాజమాన్యం వారికి తెలియకుండానే సేకరించింది. వారి ఆసక్తులు, అభిరుచులు, ప్రాధాన్యతలు ఏమిటో తెలుసుకుంది. ► వాటికి అనుగుణంగా నోటిఫికేషన్లు, ప్రక టనలు పంపించడానికి తన మెíషీన్ లెర్నింగ్ మోడల్‌ను మెరుగు పర్చు కుంది. అనుమతి లేకుండానే.. ► మన ఫోన్లలోని డేటాను ఇతరులు చూడాలంటే మన అనుమతి తప్పనిసరి. పిండువొడువో మాత్రం ఇలాంటి అనుమతుల జోలికి వెళ్లలేదు. ► యూజర్ల ఫోన్లలోకి పిండువొడువో యాజమాన్యం తమ యాప్ ద్వారా మోసపూరిత సాఫ్ట్వేర్(మాల్వేర్)ను జొప్పించింది. దాని సాయంతో ఫోన్లలోని లొకేషన్లు, కాంటాక్ట్‌లు, క్యాలెండర్లు, నోటిఫికేషన్లు, ఫొటో ఆల్బమ్స్ యాక్సెస్ చేసుకుంది. ► ఫోన్లలోని సిస్టమ్ సెట్టింగ్స్ మార్చే వెసులుబాటు సైతం సొంతం చేసుకుంది. ఫోన్లలో ఉండే ఇతర యాప్‌లపైనా నిఘా పెట్టింది. ► ఒక్కమాటలో చెప్పాలంటే యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్లను స్వేచ్ఛగా వాడుకుంది. ► గూగుల్ సంస్థ మార్చి నెలలో తన ప్లేస్టోర్ నుంచి పిండువొడువోను తొలగించింది. ► తమ యాప్‌పై వచ్చిన ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. ఏమిటీ పిండువొడువో? ► చైనాలో ఇంటర్నెట్ వినియోగించే ప్రజల్లో నాలుగింట మూడొంతుల మంది పిండువొడువో యాప్ ఖాతాదారులే. మార్కెట్ విలువ ప్రఖ్యాత షాపింగ్ యాప్ ‘ఈబే’ కంటే మూడు రెట్లు ఎక్కువ. ► గూగుల్ మాజీ ఉద్యోగి కోలిన్ హువాంగ్ 2015లో షాంఘైలో స్టార్టప్ కంపెనీగా పిండువొడువో యాప్‌ను 6.49.0 అనే వెర్షన్‌తో ప్రారంభించాడు. ఈ–కామర్స్ దిగ్గజాలైన అలీబాబా, జేడీ డాట్ కామ్‌కు పోటీగా ఈ కంపెనీ ప్రస్థానం ఆరంభమైంది. గూగుల్ ప్లేస్టోర్తోపాటు చైనా యాప్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ► పిండువొడువో నగరాలను కాకుండా తొలుత చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తన లక్ష్యంగా చేసుకుంది. తక్కువ ఆదాయం కలిగిన ప్రజలకు చౌక ధరలకే వారు కోరుకున్న వస్తువులు చేరవేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్‌లకు భారీగా డిస్కౌంట్లు ఇచ్చింది. దాంతో అనతి కాలంలోనే పిండువొడువో జనంలోకి బాగా చొచ్చుకెళ్లింది. ► 2018 ఆఖరు నాటికి నెలవారీ యూజర్లలో మూడంకెల వృద్ధిని సాధించింది. అదే సంవత్సరం న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యింది. ► ఈ యాప్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. అందుకే ఫోన్ల నుంచి సులభంగా తొలగించలేమని నిపుణులు వెల్లడించారు. ఎప్పుడు బయటపడింది? ► పిండువొడువో యాప్‌లో మాల్వేర్ ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి మాసాంతంలో అనుమానాలు బలపడ్డాయి. ► చైనా సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘డార్క్ నేవీ’ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. కానీ, ఆ యాప్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ► యాప్ నిర్వాకంపై ఇతర పరిశోధకులు దృష్టి పెట్టారు. మాల్వేర్తో డేటాను దొంగిలిస్తున్న సంగతి నిజమేనని తేల్చారు. పిండువొడువో అనేది ఒక దొంగ యాప్ అని స్పష్టం చేశారు. ► ఆరోపణలు వెల్లువెత్తడంతో యాప్ యాజమాన్యం అప్రమత్తమైంది. మార్చి 5న వెర్షన్ 6.50.0 పేరిట కొత్త అప్డేట్ను విడుదల చేసింది. చాలామంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను తమ అనుబంధ సంస్థ అయిన ‘టెమూ’కు తరలించింది. ► 20 మందితో కూడిన సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ల బృందం ఇప్పటికీ పిండువొడువోలో కొనసాగుతోంది. చైనా ప్రభుత్వం మౌనమెందుకో? ► కొత్త వెర్షన్ కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. అందులో అండర్లైయింగ్ కోడ్ ఉందని, డేటా చౌర్యం కోసం దాన్ని ఎప్పుడైనా రీయాక్టివేట్ చేయొచ్చని హెచ్చరిస్తున్నారు. ► చట్ట ప్రకారం చూస్తే పిండువొడువోను నిషేధించాల్సిందేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. కానీ, ఆ యాప్‌పై ఇప్పటికీ చర్యల్లేవు. యాప్ కార్యకలాపాలపై బహిరంగంగా ఏనాడూ స్పందించలేదు. ► చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాప్‌ల పేర్లతో కూడిన జాబితాను చైనా సమాచార సాంకేతిక శాఖ తరచుగా విడుదల చేస్తోంది. ఈ జాబితాల్లో పిండువొడువో పేరును ఒక్కసారి కూడా చేర్చలేదు. ► పిండువొడువో అనుబంధ యాప్ అయిన ‘టెమూ’ అమెరికాలో డౌన్లోడ్లలో అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ఇప్పుడు దీనిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
లోన్‌యాప్ సంస్థలపై కొరడా
సాక్షి, అమరావతి: ‘మీకు రుణం కావాలా.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రెండు గంటల్లోనే మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం’.. అంటూ గుంటూరుకు చెందిన మూర్తికి ఓ ఫోన్ వచ్చింది. కరోనాతో తన చిరు వ్యాపారం దెబ్బతినడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆయన అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉన్నారు. దాంతో ఆ ఫోన్‌కాల్‌కు సానుకూలంగా స్పందించి ‘రూ.లక్ష లోన్ కావాలి’ అని అన్నారు. వారు అడిగిన వివరాలన్నీ యాప్‌లో అప్లోడ్ చేశారు. ఆయన అడిగింది రూ.లక్ష.. కానీ, ఇచ్చింది రూ.70వేలే.. అంటే ముందే రూ.30వేలు వడ్డీ కింద ఉంచుకుని రూ.లక్ష అప్పు ఇచ్చినట్లు చూపించారు. ఆ తరువాత నుంచి ప్రతినెలా వాయిదాలు కడుతున్నా అప్పు పెరుగుతోందే కానీ, తగ్గడంలేదు. చివరికి రూ.రెండు లక్షలు చెల్లించిన తరువాతగానీ ఆయన మోసాన్ని గుర్తించలేదు. దాంతో వాయిదాలు చెల్లించడం మానేయడంతో ఫోన్లో తీవ్రపదజాలంతో దూషణలు, బెదిరింపులు మొదలయ్యాయి. వాట్సాప్ మెసేజులు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ ఆయన ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు ప్రత్యక్షమయ్యాయి. ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో మూర్తి సైబర్ పోలీసులను ఆశ్రయించగా వారు దర్యాప్తు చేపట్టారు. ..ఇలా మూర్తి ఫిర్యాదుపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లోన్‌యాప్ కంపెనీల ఆగడాలపై రాష్ట్ర సైబర్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఈ అనధికారిక సంస్థల ఆగడాల నుంచి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు ద్విముఖ వ్యూహంతో కార్యాచరణను వేగవంతం చేశారు. మోసాలకు పాల్పడుతున్న వాటిపై కఠిన చర్యలను వేగవంతం చేశారు. మొదటి స్థానంలో తిరుపతి జిల్లా ఈ తరహా మోసాలపై రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 63 కేసులు నమోదుచేశారు. లోన్‌యాప్ కంపెనీలపై కేసుల్లో తిరుపతి జిల్లా మొదటిస్థానంలో ఉండగా గుంటూరు, విశాఖజిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ కంపెనీలపై అత్యధికంగా కేసులు నమోదు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విస్తృతంగా అవగాహన.. నిజానికి.. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్‌యాప్ కంపెనీల్లో 90 శాతం కంపెనీలకు రిజర్వ్ బ్యాంకు అనుమతిలేదు. చైనాలో ఉంటూ ఇక్కడ అనధికారికంగా కాల్ సెంటర్లు ఏర్పాటుచేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే లోన్‌యాప్ కంపెనీల మోసాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సైబర్ పోలీసు విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పలు సూచనలు చేసింది. అవి.. ► తెలియని వ్యక్తులు, కంపెనీలు పంపించే లింక్‌లు, ఈమెయిల్స్ ఓపెన్ చేయకూడదు. చేస్తే.. ఆ యాప్ డౌన్లోడ్ కాగానే వారి ఫోన్/ల్యాప్‌టాప్‌లోని కాంటాక్టŠస్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం, వాటికి వచ్చే ఓటీపీ నంబర్లతోసహా సమాచారమంతా కూడా లోన్‌యాప్ కంపెనీకి అందుబాటులోకి వస్తుంది. ► అందుకే ఏదైనా లింక్‌ను క్లిక్ చేసేముందు ఆ కంపెనీకి గుర్తింపు ఉందా లేదా, గుర్తింపు ఉంటే ఆ కంపెనీకి రేటింగ్‌ను తెలుసుకోవాలి. ► బ్యాంకులు, గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ కంపెనీలు మాత్రమే రుణాలు మంజూరు చేసేందుకు అనుమతి ఉంది. మిమ్మల్ని సంప్రదించిన కంపెనీ ఆ కేటగిరీకి చెందుతుందో లేదో పరిశీలించాలి. ► ఆధార్ నంబర్, కాంటాక్ట్స్ వివరాలు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగితే ఇవ్వొద్దు. ► ఆర్బీఐ గుర్తింపు పొందిన ఏ కంపెనీ కూడా రుణం మంజూరుచేసే ముందే కొంత మొత్తాన్ని మినహాయించుకోదు. అలా చేస్తామని ఏ కంపెనీ అయినా చెబితే మోసానికి పాల్పడుతున్నట్లే లెక్క. ► అలాగే, హామీలు, డాక్యుమెంట్లు అవసరంలేకుండా ఎవరైనా రుణం ఇస్తామన్నా విశ్వసించొద్దు. ► మీ యూపీఐ పిన్ నంబర్లు, పాస్వర్డ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరికీ చెప్పొద్దు. గుర్తింపు పొందిన బ్యాంకులు ఆ వివరాలు అడగవు. ► తెలియని ఖాతాల నుంచి మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే ఆ విషయాన్ని మీ బ్యాంకు అధికారులకు తెలియజేయండి. లేకపోతే మోసపూరిత లోన్‌యాప్ కంపెనీలు మీరు రుణం కోరితేనే బ్యాంకులో జమచేశామని చెప్పే ప్రమాదముంది. ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థలు మరోవైపు.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు పలు వ్యవస్థలను పోలీసులు ఏర్పాటుచేశారు. అవి.. ► డయల్ 1930 : లోన్ యాప్ కంపెనీల మోసాలపై ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చెయ్యొచ్చు. ► సైబర్‌మిత్ర వాట్సాప్ నం. 9121211100 : లోన్‌యాప్‌ల మోసాలు, వేధింపులపై దీనికీ ఫిర్యాదు చేయవచ్చు. ► సైబర్ క్రైమ్ పోర్టల్ : లోన్‌యాప్ కంపెనీలతోపాటు ఇతర సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ పోర్టల్: www. cybercrime. gov. in లోన్‌యాప్ మోసాలపై కఠిన చర్యలు లోన్‌యాప్‌ల కంపెనీల మోసాలు, వేధింపులపై పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌తోపాటు బాధితులు ఫిర్యాదులు చేసేందుకు వివిధ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చాం. లోన్యాప్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మోసపోయామని భావిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ జిల్లాల వారీగా లోన్‌యాప్ మోసాలపై నమోదైన కేసులు.. -
టిక్‌టాక్‌పై వేటు.. లోకల్ ‘జోష్’!
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధంతో దేశీయ స్టార్టప్‌లకు ఊహించని అవకాశం తలుపుతట్టినట్టయింది. టిక్‌టాక్‌కు ఉన్న భారీ యూజర్లను సొంతం చేసుకునేందుకు చాలా సంస్థలు వేగంగా ఈ మార్కెట్ వైపు అడుగులు వేశాయి. షార్ట్ వీడియో మేకింగ్ యాప్‌లను (స్వల్ప కాల నిడివితో కూడిన వీడియోలను సృష్టించి ఇతర యూజర్లతో పంచుకునే వేదికలు) తీసుకురావడమే కాదు.. వీటిల్లో కొన్ని విజయాన్ని సాధించడం 2020లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి. దేశీయ వినియోగదారుల డేటా రక్షణ, దేశ భద్రతతోపాటు, చైనా ద్వంద్వ వ్యవహారశైలికి తగిన చెక్ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వందలాది చైనా మద్దతు కలిగిన యాప్‌లను ఈ ఏడాది నిషేధ జాబితాలో పెట్టేసింది. అందులో భాగంగానే టిక్‌టాప్‌పై జూన్‌లో వేటు పడింది. టిక్‌టాక్‌కు యూజర్లు భారీగా జత కూడుతున్న తరుణంలో ఈ నిషేధం ఆ సంస్థకు మింగుడుపడలేదు. కానీ, ఇది కొత్త వేదికలకు ప్రాణం పోసింది. డైలీహంట్‌కు చెందిన ‘జోష్’ యాప్ సహా దేశీయ షార్ట్ వీడియో యాప్‌లు 40% వాటాను ఇప్పటికే సొంతం చేసుకున్నట్టు బెంగళూరుకు చెందిన కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఓ నివేదికలో వెల్లడించింది. నాలుగు రెట్ల వృద్ధి.. 2020 జూన్‌లో నిషేధం విధించే నాటికి చైనాకు చెందిన టిక్‌టాక్ (బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్లాట్‌ఫామ్)కు 16.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. కానీ, సరిగ్గా అంతకు రెండేళ్ల క్రితం నాటికి 2018 జూన్ వరకు.. ఈ సంస్థకు 8.5 కోట్ల వినియోగదారులే ఉండడం గమనార్హం. రెండేళ్లలోనే యూజర్లను రెట్టింపు చేసుకుని వేగంగా దూసుకుపోతున్న టిక్‌టాక్‌కు బ్రేక్ పడింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికల కోసం యూజర్ల అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలో జోష్, ఎమ్ఎక్స్ టకాటక్, రోపోసో, చింగారి, మోజ్ మైట్రాన్, ట్రెల్ ఇలా ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి. షార్ట్ వీడియో మార్కెట్‌పై దిగ్గజ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్ కూడా ఆశపడ్డాయి. ఫలితంగా రీల్స్ పేరుతో ఫేస్బుక్, షార్ట్స్ పేరుతో యూట్యూబ్ సంస్థలు కొత్త వేదికలను తీసుకొచ్చాయి. టిక్‌టాక్ మార్కెట్ వాటాలో 40 శాతాన్ని భారత ప్లాట్‌ఫామ్‌లు సొంతం చేసుకున్నట్టు రెడ్‌సీర్ సంస్థ తెలిపింది. ఇందులో జోష్ ముందంజలో ఉందని.. నాణ్యమైన కంటెంట్, విస్తృతమైన కంటెంట్ లైబ్రరీ జోష్ బలాలుగా పేర్కొంది. ‘‘భారత సంస్థలు ప్రతి రోజూ తాజా నాణ్యమైన సమాచారాన్ని ఆఫర్ చేయగలవు. దీంతో షార్ట్ వీడియో మార్కెట్ వచ్చే ఐదేళ్లలో నాలుగు రెట్లకు పైగా వృద్ధి చెందుతుంది’’ అని రెడ్‌సీర్ సీఈవో అనిల్ కుమార్ ప్రకటించారు. విస్తరణపై చూపు.. ఇన్‌మొబి గ్రూప్ సబ్సిడరీ సంస్థ, రొపోసో యజమాని అయిన గ్లాన్స్ ఈ వారంలోనే 145 మిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్, మిత్రిల్ క్యాపిటల్ నుంచి సమీకరించడం ద్వారా మరింత విస్తరించే ప్రణాళికలతో ఉండడం గమనార్హం. గ్లాన్స్, రోపోసో ప్లాట్ఫామ్ల్లో మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడంతోపాటు ఆర్టిïఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. రొపోసోను గ్లాన్స్ గత ఏడాది బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. ‘‘భారత్‌లో ప్రస్తుతానికి ఇంటర్నెట్ వినియోగించే వారు 60 కోట్ల మంది ఉండగా.. ఇందులో షార్ట్ వీడియో కంటెంట్‌ను 45 శాతం మంది (27 కోట్లు) వినియోగిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంటర్నెట్ యూజర్లు 60 కోట్ల నుంచి 97 కోట్లకు పెరగనున్నారు. స్వల్పకాల నిడివితో కూడిన కంటెంట్ మార్కెట్ 4 రెట్లు వృద్ది చెందుతుంది. ప్రస్తుతం నెలవారీగా 110 బిలియన్ నిమిషాలను వీటిపై వెచ్చిస్తుండగా.. 400–500 బిలియన్ నిమిషాలకు విస్తరిస్తుంది’’ అంటూ రెడ్‌సీర్ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. ఒకవేళ టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేసినట్టయితే పరిస్థితుల విషయంలో పలు ప్రశ్నలు ప్రశ్నలు మిగిలే ఉన్నాయని రెడ్‌సీర్ పేర్కొంది. -
యంగెస్ట్ మొబైల్ అప్లికేషన్ ప్రొగ్రామర్స్..
స్కూల్ రోజుల్లో కాలేజి జీవితం గురించి ఆలోచిస్తారు చాలామంది.ఈ పిల్లలు మాత్రం కంపెనీలు స్థాపించడం గురించి ఆలోచించారు. కలలను సాకారం చేసుకున్నారు....ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు... చెన్నైలో ఉండే సురేంద్ర కుమరన్ తన పిల్లలకు చందమామ కథలు చెప్పలేదు. కానీ గొప్పవాళ్ల కథలనే చందమామ కథలుగా చెప్పాడు. వాటిలో రైట్ బ్రదర్స్ నుంచి స్టీవ్‌జాబ్స్ వరకు ఎందరో ఉన్నారు. శ్రావణ్ కుమరన్, సంజయ్ కుమరన్ సోదరులకు స్టీవ్‌జాబ్స్ గురించి వినడం అంటే పదే పదే ఇష్టం.‘ఇరవై సంవత్సరాల వయసులోనే స్టీవ్‌జాబ్స్ తమ కారు గ్యారెజ్‌లో యాపిల్ మొదలుపెట్టాడు’ ఆ తరువాత? ‘మీలాంటి పిల్లలకు రోల్ మోడల్‌గా చూపించే స్థాయికి ఎదిగాడు. నాన్న చెప్పిన కథలు వృథా పోలేదు. పదహారేళ్లు నిండకుండానే ఈ సోదరులు ‘గో డైమెన్షన్స్’ పేరుతో టెక్నాలజీ సొల్యూషన్ కంపెనీ మొదలుపెట్టారు. పదకొండు అప్లికేషన్స్‌కు పైగా డెవలప్ చేశారు. ‘యంగెస్ట్ మొబైల్ అప్లికేషన్ ప్రొగ్రామర్స్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. థర్డ్గ్రేడ్లో ఉన్నప్పుడు కుమరన్ బ్రదర్స్‌కు ల్యాప్‌టాప్ కొనిచ్చాడు తండ్రి. అప్పటి నుంచే సాంకేతిక విషయాల పట్ల వారిలో ఆసక్తి పెరిగింది. తండ్రి నుంచి ‘క్యూ బేసిక్’ నేర్చుకున్న తరువాత ‘ప్రోగ్రామింగ్’ మీద ఆసక్తి పెరిగింది. పర్వీందర్‌సింగ్ (18) , అర్జున్ సంతోష్ కుమార్ (20) రకరకాల పుస్తకాలు చదివి ప్రొగ్రామింగ్ మీద పట్టు సాధించిన కుమరన్స్ ‘గో వీఆర్’ పేరుతో సొంతంగా వర్చువల్ రియాలిటీ డివైజ్ తయారుచేశారు. మార్కెట్లో ఎన్నో వీఆర్ డివైజ్‌లు ఉండగా దీన్ని ఎందుకు కొనాలి? సోదరుల మాటల్లో చెప్పాలంటే వాటితో పోల్చితే ఇది కారుచౌక. తమ తొలి అధికారిక యాప్ ‘క్యాచ్ మీ కాప్’కి ముందు 150కి పైగా ‘టెస్ట్ యాప్స్’ రూపొందించారు. క్యాచ్ మీ కాప్, ఆల్ఫాబెట్స్ బోర్డ్స్, ప్రేయర్ ప్లానెట్, కార్ రేసింగ్, సూపర్‌హీరో జెట్ ప్యాక్, కలర్ పాలెట్... మొదలైన యాప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సేవాతత్వానికి ఊతం ఇచ్చే ‘గో డొనేట్’లాంటి యాప్స్‌ని రూపొందించిన కుమరన్ బ్రదర్స్ ‘సమాజం కోసం ఏదైనా కచ్చితంగా చేయాలని అనుకుంటున్నాము’ అంటున్నారు. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించడంతో పాటు ఎన్నో అవార్డ్లు సొంతం చేసుకున్నారు. చెన్నైలో ఒకరోజు. అబ్బాయి స్కూల్ నుంచి ఇంకా రాలేదు. వర్షం పెరిగింది. తల్లిదండ్రులలో ఆందోళన పెరిగింది. భారీ వర్షం కారణంగా అర్జున్ సంతోష్‌కుమార్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. తల్లిదండ్రులకు పోయిన ప్రాణం లేచివచ్చింది. ఈ సంఘటనే అర్జున్‌ని ‘లొకెటేర’ అనే మొబైల్ యాప్ రూపొందించడానికి ప్రేరణ ఇచ్చింది. వాతావరణానికి అనుగుణంగా స్కూల్ బస్‌రూట్స్‌లో ప్లాన్, షెడ్యూల్, రీ–షెడ్యూల్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన సమాచారాన్ని పేరెంట్స్‌కు తెలియజేయడానికి అనువైన ఈ యాప్ మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యంఐటీ) ‘బెస్ట్‌యాప్’ అవార్డ్ గెలుచుకున్నాడు. నిజజీవిత సమస్యలకు వినూత్నమైన పరిష్కారాల కోసం ‘లెటెరలాజిక్స్’ కంపెనీ మొదలుపెట్టాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫలితాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ‘ఎనీవన్ ఏఐ’ వెంచర్ మొదలుపెట్టిన అర్జున్ గూగుల్ వెబ్‌రేంజర్స్ అవార్డ్, నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ ఎచీవ్‌మెంట్స్ ఫర్ కంప్యూటర్ టెక్నాలజీ అవార్డ్లు అందుకున్నాడు. చెన్నైను వరదలు చుట్టిముట్టినప్పుడు అర్జున్ డెవలప్ చేసిన ‘ఐ వాలంటీర్ ఫర్ చెన్నై’ యాప్ స్వచ్ఛందసంస్థలు, సేవకులకు ఎంతో ఉపయోగపడింది. అర్జున్ సంతోష్ కుమార్‌కు ఎన్నో దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటికీ అతడు సాధించిన విజయాలను బట్టి చూస్తే ఆ లక్ష్యాలకు చేరువకావడం కష్టం కాదు అనిపిస్తుంది. పుణెకి చెందిన పర్వీందర్‌సింగ్ ‘ప్రోసింగ్’గా సుపరిచితుడు. మధ్యతరగతికి చెందిన పర్వీందర్ 13 ఏళ్ల వయసులోనే టెక్ ప్రపంచంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చదువులో చురుకైన పర్వీందర్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ‘మనీ రివార్డ్’ అనే తొలి యాప్‌ను లాంచ్ చేశాడు. తమ మొబైల్స్ ద్వారా డబ్బులు సంపాదించడానికి టీనేజర్స్‌కు ఉపయోగపడే యాప్ ఇది. 16 సంవత్సరాల వయసులో ‘ఇన్‌స్టా ఈజీ’ సార్టప్‌ను లాంచ్ చేశాడు. 17 సంవత్సరాల వయసులో ‘ది యాక్చువల్ గ్రోత్ హాక్–ఏ కంప్లీట్ గైడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్’ అనే పుస్తకం రాశాడు. బేసిక్స్ నుంచి కీలకమైన సాంకేతిక విషయాల వరకు ఎన్నో ఈ పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు. వీరు మచ్చుకు కొందరు మాత్రమే. ఇంకా ఎంతో మంది చిరంజీవులు ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేద్దాం. -
చైనా యాప్స్‌తో ముప్పు: ఇంటెలిజెన్స్
ఢిల్లీ : చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేషన్లపై నిషేధం విధించాలని లేదా ప్రజలు వాటిని వాడకుండా చూడాలని నిఘా వర్గాలు బుధవారం కేంద్రానికి సిఫారసు చేశాయి. వీటి వల్ల దేశ భద్రతకే ముప్పు ఉందని హెచ్చరించాయి. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిఘా విభాగం అధికారులు తెలిపారు. భద్రతా సంస్థకు చెందిన సిబ్బంది ఎవరూ వీటిని వినియోగించరాదని సూచించారు. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్ సహా 52 ఇతర మొబైల్ అప్లికేషన్ల ద్వారా డేటా తస్కరణకు గురవుతుందని ఓ నివేదికను ప్రభుత్వానికి నిఘా విభాగం సమర్పించింది. ఈ నివేదికపై ఇప్పటికే జాతీయ భద్రతా మండలి సానుకూలంగా స్పందించిందని, దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. (గాల్వన్ లోయ ప్రాంతం మాదే: చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు) జూమ్ వీడియో కాలింగ్ యాప్ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పు ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సమావేశాలకు ఈ యాప్‌ని వినియోగించరాదంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే జూమ్ యాప్ వాడకంపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించగా, కొన్ని దేశాల్లో పూర్తిగా నిషేధం కొనసాగుతుంది. జర్మనీలో ఈ యాప్‌పై ఆంక్షలు విధించగా, తైవాన్‌లో పూర్తిగా జూమ్ వాడరాదంటూ ప్రభుత్వం నిషేధం పెట్టింది. ఇక అమెరికా కూడా సెనేట్ సభ్యులను జూమ్ యాప్ కాకుండా ఇతర సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌లను ఉపయోగించాలని పేర్కొంది. పెద్ద ఎత్తున ఈ యాప్‌పై ఆరోపణలు వస్తుండటంతో యూజర్లకు కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. (‘భారత మాతా సినిమా’ కథ ముగిసిందా?! ) -
అందాల రాణి
ఫేస్‌బుక్‌కి ఇప్పుడు పెద్ద కాంపిటిషన్ టిక్‌టాక్. ఫేస్‌బుక్‌ని టిక్‌టాక్ డ్రాగన్‌లా మింగేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే యూత్.. క్లాస్బుక్స్ని విసిరికొట్టినట్లుగా, ఫేస్‌బుక్‌ని విసిరికొట్టి టిక్‌టాక్‌తో ఆడుతున్నారు. పాడుతున్నారు. టిక్ టాక్ చైనా రాక్షసి. ఫేస్బుక్ అమెరికా అందాలరాణి. ఆ అందాల రాణి పేరు షెరిల్ శాండ్‌బర్గ్. ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సి.ఓ.ఓ) ఆమె. ఎంత ఆపరేట్ చేస్తున్నా టిక్‌టాక్ పరుగుని అందుకోలేకపోతోంది ఫేస్బుక్. ‘మాకు ఆందోళనగా ఉన్నమాట వాస్తవమే. కొత్తగా మేము ఇంకా ఏదైనా చేసి, యూత్‌ని మా వైపు లాక్కోవాలి’’ అని షెరిల్ అంటున్నారు. లాక్కోడాని కన్నా ముందు.. ఆమె ఒక అస్త్రాన్ని సంధించారు. ‘‘టిక్‌టాక్ చైనా కంపెనీ కాబట్టి యూజర్లకు ప్రైవసీ ఉండదు’’ అని అన్నారు. చెప్పలేం ఒక్కోసారి ఇలాంటి చిన్నమాట కూడా పెద్ద ఇన్నొవేషన్లా పనిచేసి ప్రత్యర్థుల దూకుడును తగ్గించవచ్చు. -
ప్రొడక్ట్ టు ప్రొటెక్ట్
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం నిత్య జీవన క్రియలో భాగమైనది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మొబైల్ వాడకం విజృంభిస్తోంది. స్మార్ట్ ఫోన్ అరచేతిలోకి తీసుకొచ్చేశాక యువతరంలో సోషల్ మీడియా ఎంత పాప్యులరైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాణేనికి రెండు వైపులా ఉన్నట్టే... కాలక్షేపంతో పాటు కష్టాల్ని కొనితెచ్చే టిక్‌టాక్ లాంటి యాప్స్ మాత్రమే కాదు మన అవసరాలను తీర్చుకునే క్రమంలో శ్రమని, ఒత్తిడిని తగ్గించడానికి మహిళల కోసం ప్రత్యేకంగా వందలాది యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాంటి కొన్ని ట్రెండీ యాప్స్ విశేషాలు... రొపోసో ఆప్ దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫ్యాషన్ సోషల్ నెట్‌వర్క్‌గా నిలిచింది రొపోసో. నెట్టింట్లో అధునాతన ఫ్యాషన్ టెక్నాలజీ, సరికొత్త ట్రెండ్స్‌ని కోరుకునే ఆడవారికి రొపోసో ఆప్ మంచి వేదికగా మారింది. ఇందులో ఎవరైనా సరే తమ ఫ్యాషన్‌కి సంబంధించిన విశేషాలు, వీడియోలు తదితర అంశాలను షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మాధ్యమంలో తమకు నచ్చిన వారిని ఫాలో అవుతూ అభిరుచులను పంచుకోవచ్చు. బాగా నచ్చిన ఉత్పత్తులను, స్టోరీస్‌ని రొపోసో వేదికగా రీ పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలున్న ఈ యాప్‌ని ప్రస్తుతం సెలబ్రెటీల నుండి సామాన్య ప్రజల వరకు ఫ్యాషన్ ప్రియులందరూ ఫాలో అవుతున్నారు. స్పై కెమెరా డిటెక్టింగ్ ఆప్ ప్రస్తుతం సామాజికంగా అమ్మాయిలను అతిగా ఇబ్బందిపెడుతున్న సమస్య స్పైయింగ్. ప్రయాణాల్లో, షాపింగ్స్, హోటల్స్‌లో, టూరిస్ట్ ప్లేసెస్ తదితర జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలలో రాడార్బోట్ ఫ్రీ, యాంటీ స్పై కెమెరా, స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ వీటిని ఎదుర్కునేందుకు ఉపకరిస్తున్నాయి. యాప్‌ని స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మనకు అనుమానాస్పదంగా అనిపించిన ప్రదేశాలలో ఆన్ చేస్తే చాలు.. ఆ యాప్‌లోని మాగ్నెటిక్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్ సాంకేతికతతో రహస్య కెమెరాలను కనిపెడెతుంది. ప్రస్తుతం వ్యక్తిగత భద్రత దృష్ట్యా యువతకు ఈ యాప్ చాలా ఉపయుక్తం అని చెప్పొచ్చు. పెప్పర్ ట్యాప్ ఆప్ ఉద్యోగం చేసుకొంటూ, ఇంటినీ పిల్లలనీ చూసుకొనే ఆధునిక మహిళలకు క్షణం కూడా తీరిక ఉండడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో నిత్యావసర వస్తువులకై సూపర్ మార్కెట్, కిరాణాషాప్‌కి వెళ్ళాలంటే కూడా సమయం దొరకని పరిస్థితి. ఇలాంటి వారి కోసమే ఈ పెప్పర్ ట్యాప్ ఆప్. ఒక్క క్లిక్‌తో ఆర్డర్ చేస్తే చాలు.. కావలసిన సరుకులన్నీ, ఎంచుకున్న మోతాదులో, చెప్పిన సమయానికే ఇంటివద్దకి డెలివరీ చేసేస్తారు. ఎలాంటి షాపింగ్ చేయకుండానే అతి సులభంగా అన్ని వస్తువులు ఇంటికే వస్తుండటంతో పెప్పర్ట్యాప్కి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. గుడ్ గైడ్ ఆప్ ప్రతిరోజూ ఎన్నో రకాల కొత్త కాస్మెటిక్స్ తదితర మహిళా సంబంధ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే అవి ఉపయోగించడం ఆరోగ్యకరమైనదో కాదో తెలుసుకోవడం అంత సులభం కాదు. అలాంటి సందేహం ఉన్నవారు ఈ గుడ్గైడ్ యాప్‌తో ఆ వస్తువు నాణ్యతను ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో డియోడరంట్ నుండి డైపర్ క్రీమ్ వరకు అన్నిరకాల ఉత్పత్తులకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అందించే రేటింగ్ ఆధారంగా కావలసిన వాటిలో బెస్ట్ అనబడే వస్తువులను కొనుగోలు చేయవచ్చు. 112 ఇండియా మొబైల్ ఆప్ భారత నిర్భయ చట్టం అనుబంధంగా 112 ఇండియా మొబైల్ ఆప్‌ను తయారు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మహిళల, బాలికల తక్షణ సహాయం కోసం దీనిని రూపొందించారు. ఈ యాప్‌ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత... ఎలాంటి అవాంచనీయ పరిస్థితుల్లోనైనా కేవలం ఒక్క క్లిక్‌తో కాల్ చేయడం వలన పోలీసులు క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకొంటారు. ఈ ఆప్‌లోని ఉఖSSటెక్నాలజీతో సంఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు క్షణాల్లో గుర్తిస్తారు. అంతేకాకుండా ఈ యాప్‌కి 100 (పోలీస్), 101(ఫైర్), 108(అంబులెన్స్), 181(మíßళా, శిశు సంరక్షణా శాఖ) మెదలైనవి అనుసంధానమై ఉంటాయి. ఎఫ్బీ లేకున్నా... యాప్ ఉండాలి... అరచేతిలోని అంతర్జాలాన్ని మనకున్న పరిప్థితికి అనుగుణంగా మార్చుకొని శ్రమ ఒత్తిడిని తగ్గించుకోవడమే కాకుండా వ్యక్తిగత భద్రతనూ పెంచుకోవచ్చు. సిటీలోని ఒక మార్కెటింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు కానీ, సిటీలో తప్పనిసరి రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. నా మొబైల్లో 112 ఇండియన్ యాప్ వాడుతున్నా. విపత్కర పరిస్థితుల్లో క్షణాల్లోనే పోలీస్ సహాయం అందిస్తుంది. ఆడవారికి వాట్సాప్, ఫేస్బుక్ అకౌంట్స్ సంగతేమో కాని ఇలాంటి యాప్స్ ఎంతో అవసరం. ఇటీవలే యువతలో ఇలాంటి యాప్స్‌పై అవగాహన పెరుగుతోంది. – రమ్యసుధ, మార్కెటింగ్ ఉద్యోగిని -
యాప్‌తో అప్పులు.. తీర్చేందుకు తప్పులు!
సాక్షి, హైదరాబాద్ : యుక్త వయసు పిల్లలు డబ్బులడిగితే.. మధ్యతరగతి తల్లిదండ్రులు వంద ఆరాలు తీస్తారు. వివిధ రుణసంస్థలు తామిచ్చే అప్పు తీర్చగలరా? లేదా? అనేది రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితిని బట్టి అంచనా వేస్తాయి. అయితే, ఇవేమీ లేకుండానే స్టూడెంట్స్ లోన్ యాప్స్ యువకులకు ఎడాపెడా ఆన్లైన్లో లోన్లు ఇచ్చేస్తున్నాయి. అడ్డగోలుగా వడ్డీలు పిండుతూ, బెదిరింపులకూ దిగుతున్నాయి. ఫలితంగా పలువురు యువకులు ఒత్తిడికి గురై, అప్పులు తీర్చేందుకు దారితప్పుతున్నారు. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ స్టేషన్లో నమోదైన బీటెక్ విద్యార్థి ఉదంతమే దీనికి ఉదాహరణ. ఎం–పాకెట్ యాప్‌లో అప్పు తీసుకున్న ఇతడు దాన్ని తీర్చడానికి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. అన్నీ ఆన్లైన్లోనే.. విద్యార్థులకు రుణాలిచ్చే ఎం–పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్‌పే, ఉదార్ కార్డ్, రెడ్‌కార్పెట్ వంటి యాప్స్ అనేకం ఉన్నాయి. ఎదుటి వారిని నేరుగా కలవకుండానే ఇవి రుణాలు ఇచ్చేస్తుంటాయి. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే విద్యార్థి తన ఆధార్ కార్డు, టెన్త్ మెమో లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టూడెంట్ ఐడీ అప్లోడ్ చేయాలి. ఈ యాప్స్ రూ.500 నుంచి రూ.10 వేల వరకు రుణం ఇస్తున్నాయి. ఆ మేరకు విద్యార్థి కోరుకున్న మొత్తం కొన్ని గంటల్లోనే అతనికి చెందిన పేటీఎం, గూగుల్ పే వాలెట్స్‌లోకి వచ్చి పడుతుంది. వడ్డీ, పెనాల్టీ కలిపి నెలకు 5 నుంచి 10 శాతం వరకు అవుతోంది. రూ.2 వేలు అప్పు తీసుకుంటే మొదటి నెల పూర్తయ్యేలోపు రూ.2,114, రెండో నెలలో రూ.2,225, మూడో నెలలో రూ.2,450 వరకు చెల్లించాలి. అప్పు చెల్లింపు గడువుకు వారం ముందు యాప్ నుంచి సందేశం వస్తుంది. అందులో ఉన్న లింకు క్లిక్‌చేస్తే ఆన్లైన్లోనే చెల్లింపు జరిగిపోతుంది. అప్పు తీరుస్తారా? అందరికీ చెప్పాలా? స్టూడెంట్లోన్ యా ప్స్‌ను ప్లేస్టోర్స్ నుం చి డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు.. కాంటాక్ట్స్, ఫొటో స్, లొకేషన్ యాక్సెస్ కోసం అ నుమతి కోరుతుంది. దీన్ని యా క్సెప్ట్ చేస్తేనే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. విద్యార్థులకు రుణాలిస్తు న్న ఈ యాప్స్ తమకున్న యా క్సెస్ ద్వారా సదరు విద్యార్థి ఫోన్ లోని కాంటాక్ట్స్ లిస్ట్‌ను ముందే కాపీచేసి పెట్టుకుంటున్నాయి. రు ణం చెల్లించకున్నా, తమ ఫోన్లకు స్పందించకపోయినా వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాయి. తమ వద్ద మీ కాంటా క్ట్ లిస్ట్ ఉందని చెబుతూ.. మచ్చు కు కొన్ని కాంటాక్ట్స్‌ను పేస్ట్ చేస్తు న్నారు. తక్షణం డబ్బు చెల్లించకపోతే మీ కుటుంబసభ్యులు, స్నే హితులకు ఫోన్లుచేసి చెబుతామ ని బెదిరిస్తున్నారు. ఆపై అప్పు చె ల్లింపునకు గంట గడువిస్తున్నా రు. అప్పటికీ చెల్లించకుంటే ఫోన్‌కాల్స్ మొదలవుతాయి. బయటపడనివి మరెన్నో.. ఇటీవలే లెండ్ కరో యాప్ బ్లాక్‌మెయిలింగ్‌పై ట్విట్టర్ ద్వారా మా దృష్టికొచ్చింది. స్టూడెంట్స్ లోన్ యాప్స్ కారణంగా పెడదారి పడుతున్న విద్యార్థులు మరెందరో ఉండొచ్చు. దీన్ని సీరియస్‌గా తీసుకుని అప్పులు ఇచ్చే యాప్స్‌పై విచారణ చేస్తున్నాం. వీటికి సరైన అనుమతులు ఉన్నాయా? ఏ మేరకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి? ఏ తరహా బ్లాక్మెయిలింగ్స్కు పాల్పడుతున్నాయి? వంటివి ఆరా తీస్తున్నాం. మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్లను చెక్‌చేస్తూ ఏయే యాప్స్ ఉన్నాయో పరిశీలించాలి. – సిటీ పోలీసు ఉన్నతాధికారి బీటెక్ విద్యార్థి ఉదంతంతో వెలుగులోకి.. నగరంలోని బీరంగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మూడు నెలల క్రితం ఎంపాకెట్ యాప్ నుంచి రూ.2,000 అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి రూ.2,450 అయ్యింది. ‘యాప్’ నుంచి ఒత్తిడి పెరగడంతో కట్టుతప్పాడు. పరీక్ష రాయడానికి వెళ్లిన ఇతగాడు ఎగ్జామ్‌హాల్ బయట ఉన్న ఓ యువతి బ్యాగ్ నుంచి సెల్‌ఫోన్ తస్కరించాడు. అందులో ‘సే హాయ్’ చాటింగ్ యాప్ డౌన్లోడ్ చేశాడు. అందులోని వివరాల ఆధారంగా సదరు యువతి మాదిరిగానే ఈ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తనతో చాటింగ్ చేయాలన్నా, తన ఫొటోలు కావాలన్నా కొంత మొత్తం చెల్లించాలంటూ తన పేటీఎం వాలెట్ నంబర్ ఇచ్చాడు. ఈ విద్యార్థి ఇదంతా ఆ యువతి డూప్లికేట్ సిమ్ తీసుకునేలోపే, అదే సిమ్‌కార్డు వాడి ఇవన్నీ చేసేశాడు. దీంతో ఒకరిద్దరు కొంత మొత్తం ఇతడి పేటీఎంకు డబ్బు పంపారు. ఈలోపు డూప్లికేట్ సిమ్ తీసుకున్న ఆ యువతికి నగదు చెల్లించిన ఇద్దరు ఫోన్లు చేయడంతో ఆమె కంగుతిని సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి విద్యార్థిని పట్టుకున్నారు. తాను ఎంపాకెట్ నుంచి అప్పు తీసుకోవడం, అది తీర్చడానికి తప్పు చేసినట్టు విచారణలో చెప్పాడు. ఆ విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ యువతి కేసు వద్దని పోలీసులను కోరింది. దీంతో అధికారులు సోమవారం వీరిద్దరినీ రాజీపడటానికి కోర్టుకు పంపారు. బీటెక్ విద్యార్థి తండ్రి, సోదరిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
మహిళల భద్రత కోసం మొబైల్ యాప్స్
మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ‘హాక్ ఐ’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ఒంటరి ప్రయాణాల్లో మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎస్ఓఎస్... ‘హాక్–ఐ’లో ఎస్ఓఎస్ (టౌట)విభాగం ఉంటుంది. ప్రాథమిక సమాచారాన్ని ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన ఐదు ఫోన్ నంబర్లను ఫీడ్ చేయాలి. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను నొక్కితే చాలు... కంట్రోల్ రూమ్, జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. వినియోగదారులు పొందుపరచిన ఐదు నంబర్లకూ సమాచారం వెళ్తుంది. ‘ఎస్ఓఎస్’ను నొక్కిన 9 సెకండ్లకే అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. నెట్ లేకున్నా ఎస్ఓఎస్... మొబైల్ డేటా అందుబాటులో లేకపోయినా లేదా మొబైల్ డేటా ఆన్‌లో లేకపోయినా ఎస్ఓఎస్ను డయల్–100కు అనుసంధానిస్తూ కొత్త వెర్షన్నూ రూపొందించారు. బాధితులు ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌గా అది ఫోన్ కాల్‌గా మారిపోయి ‘డయల్–100’కు చేరుతుంది. సిబ్బంది అలర్ట్ అవుతారు. ‘వందకూ’ వర్తింపు... హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’ డయల్ చేయకుండా ఈ యాప్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం అందుతోంది. విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ మహిళల భద్రమైన ప్రయాణం కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగమే ‘విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్’. వాహనం ఎక్కేముందు సదరు ప్రయాణికురాలు ‘హాక్ – ఐ’ యాప్‌లోని ‘ట్రావెల్ మేడ్ సేఫ్’ విభాగంలోని ‘డెస్టినేషన్’ను ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. కమిషనరేట్‌లోని ఐటీ సెల్ ఆ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది గమ్యం చేరేవరకు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. -
యాప్.. యాప్ హుర్రే..!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల సందడి పెరుగుతున్న కొద్దీ మనదేశంలో మొబైల్ అప్లికేషన్స్(యాప్స్) డౌన్లోడ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోందట. 2012లో 156 కోట్ల యాప్‌లు డౌన్లోడ్ కాగా.. వచ్చే ఏడాది నాటికి ఆ సంఖ్య ఏకంగా 900 కోట్లకు చేరనుందట! అసోచామ్, డెలాయిట్ సంస్థలు ‘డిజిటేషన్ అండ్ మొబిలిటీ’ పేరుతో జరిపిన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది. ఈ సంస్థల తాజా అంచనాల ప్రకారం.. భారత్‌లో యాప్‌ల వృద్ధి రేటు ఏడాదికి 75 శాతం నమోదవుతోంది. 16-30 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువగా యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సోషల్‌మీడియా యూజర్లు పెరగడం, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ మంది క్రియాశీలం కావడం వల్లే యాప్‌ల వృద్ధిరేటు పెరిగింది. ఎన్నికల సమయంలో ఒక్క ఫేస్‌బుక్‌లోనే 2.90 కోట్ల మంది 22.70 కోట్ల పోస్టులు ఉంచారు. ట్విట్టర్లో సైతం 6 కోట్ల ట్వీట్లు నమోదయ్యాయి. ఎక్కువగా డౌన్లోడ్ అయిన యాప్‌లలో మొబైల్ టీవీ, వాట్సాప్, యూటూబ్, స్నాప్‌చాట్ వంటి వి ఉన్నాయి. అయితే గేమ్‌లు, యాప్‌ల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేందుకు మాత్రం భారతీయులు పెద్దగా ఇష్టపడటం లేదట. -
మూర్ఛను గుర్తించేందుకు, పక్షవాత చికిత్సకూ మొబైల్ ఆప్స్!
న్యూయార్క్: మూర్ఛ వ్యాధి వల్ల వచ్చే సీజర్స్‌ను గుర్తించేందుకు, పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స చేసేందుకు ఉపయోగపడే రెండు వినూత్న మొబైల్ అప్లికేషన్లను బ్రిటన్‌లోని ‘బెల్ఫాస్ట్’కు చెందిన పరిశోధకులు రూపొందించారు. వీటిలో ‘ఎపిలెప్సీ ఆప్’తో వైద్య పరిజ్ఞానం లేనివారు సైతం ఒక వ్యక్తికి మూర్ఛవ్యాధి వల్ల సీజర్స్ (కంపించిపోతూ కూలిపోవడం) వస్తున్నాయా? లేదా వేరే కారణమా? అనేది గుర్తించవచ్చు. మూర్ఛవ్యాధి ఉన్నవారిలో నాడీవ్యవస్థ అసాధారణంగా స్పందించడం వల్ల ఒక్కసారిగా ప్రకంపనలతో బిగుసుకుపోయి కుప్పకూలుతుంటారు. ఇతర సమస్యల వల్లా సీజర్స్ వచ్చే అవకాశముంటుంది కాబట్టి.. మూర్ఛ వల్లే ఆ సీజర్స్ వచ్చాయా అన్నది తెలుసుకోవడం కష్టం. అందుకే వైద్యులు అందుబాటులో లేనప్పుడు సీజర్స్‌ను గుర్తించేలా ఈ ఆప్‌ను రూపొందించారు. మూర్ఛరోగులపై అధ్యయనం చేసి.. రూపొందించిన ఈ ఆప్‌ను భారత్, నేపాల్‌లో 132 మందిపై పరీక్షించగా.. 96 శాతం మందిలో కచ్చితమైన ఫలితాలు వచ్చాయట. అలాగే మరో అప్లికేషన్ ‘స్ట్రోక్ ఆప్’ కూడా పక్షవాత రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు, పర్యవేక్షించేందుకు బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆప్‌ను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వైద్యులు ఉపయోగిస్తున్నారు. -
14న వాలెంటైన్స్ డే... ‘యాప్స్’తో ‘గ్యాప్స్’ దూరం
ముంబై: దూరపు సంబంధాలను కొనసాగించడం అంత తేలికైన విషయమేమీ కాదనేది బహిరంగ రహస్యమే. మొబైల్ అప్లికేషన్స్.. టూకీగా యాప్స్ అందుబాటులోకి వచ్చాక దూరమనే మాటకు అర్థమే లేకుండాపోయింది. ఇంకా చెప్పాలంటే దూరం అనేది ఇప్పుడు బాగా దగ్గరైపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ విషయాన్ని అంతా మరచిపోయారు కూడా. జేబుకు కొంచెం కూడా చిల్లుపడకుండానే అంతా సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. అందరితోనూ బంధాలను కొనసాగిస్తున్నారు. ఒకరికొకరు దూరంగా ఉంటున్న దంపతులు సైతం స్కైప్, వైబర్, వాట్స్ అప్ వంటి వాటిపై విపరీతంగా ఆధార పడుతున్నారు. ఈ యాప్స్‌ద్వారా ఒకరితో మరొకరు నిరంతరం అనుసంధానమవుతున్నారు. పరిస్థితుల కారణంగా ఎంతోదూరంగా ఉంటున్నప్పటికీ కలిసే ఉంటున్నామనే భావన వారిని ఆనంద తీరాలకు చేరుస్తోంది. ఇటీవల పెళ్లయిన నగరానికి చెందిన అక్షితా జైన్ ఈ విషయమై మాట్లాడుతూ ‘సందేశాలు పంపడం, వీడియో కాలింగ్, ఫొటోస్ షేరింగ్ వంటి వాటి వల్ల మేమిరువురం నిరంతరం ఒకరి పక్కన మరొకరు ఉన్నామనే భావన కలుగుతోంది. ఈ భావన సంతోషంగా జీవించేందుకు దోహదపడుతోంది. అత్యంత చేరువలో ఉన్నట్టు అనిపిస్తోంది. రెండు వేర్వేరు నగరాల్లో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ ఈ యాప్స్ వల్ల మేమిరువురం పక్కపక్కనే ఉన్నామనే భావనను కలిగిస్తున్నాయి. మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని తేలికపరిచింది’ అంది. నగరానికి చెందిన మరో యువతి షాలినీ ఝా గుజరాత్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడిపోయింది. వీరిరువురు నిరంతరం ఈ యాప్స్‌ద్వారా ప్రేమమాధుర్యాన్ని పంచుకుంటున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నా ఈ యాప్స్ కారణంగా వారి మధ్య దానితాలూకూ ఇబ్బందేమీ ఎదురుకావడం లేదు. ‘మేమిరువురం స్కైప్ యాప్‌ని బాగా వినియోగిస్తాం. మాట్లాడుకున్నా లేదా పోట్లాడుకున్నా సమస్తం అందులోనే. రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటలపాటు మాట్లాడుకుంటూనే ఉంటాం. మా జేబులకు పెద్దగా చిల్లు పడదు. మొబైల్‌ను రీచార్జ్ చేయలేదని దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. సుదీర్ఘ సంభాషణలు, అత్యంత తక్కువ ఖర్చు. ఈ కారణంగానే మేము స్కైప్ యాప్‌ని బాగా వినియోగిస్తాం’ అంటూ తన ఆనందాన్ని మాటల రూపంలో వ్యక్తంచేసింది. స్కైప్ అనే యాప్... వీడియో కాల్ చేసుకునేందుకు, వైబర్ అనే యాప్ అంతర్జాతీయ కాల్స్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక వాట్స్ అప్‌లో అయితే సందేశాలను పంపుకోవడంతోపాటు చిత్రాలను పంచుకోవ చ్చు కూడా. ఐ ఫోన్, ఆండ్రాయిడ్, ఐ ప్యాడ్, బ్లాక్ బెర్రీ ఫోన్లు వైబర్ యాప్‌ను వినియోగించుకునేందుకు వీలవుతాయి. దీంతోపాటు నోకియా విండోస్ వంటి మొబైళ్లకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. ఎంతో ఉపయుక్తం యాప్స్ విషయమై నగరానికి చెందిన ప్రియాసూద్ మాట్లాడుతూ ‘తాజాగా మార్కెట్లోకి వస్తున్న మొబైల్ యాప్స్... ప్రేమికులు, దంపతులకు ఎంతో అనువుగా ఉంటాయి. విపరీతమైన పనిభారంలో మునిగిపోయి ఉన్నప్పటికీ వాట్స్ అప్ ద్వా రా ఓ స్మైల్ ఐకాన్‌ను పంపవచ్చు. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇదొక మంచి ఆయుధం మాదిరిగా పనిచేస్తుంది. సత్సంబంధాలను కొనసాగించేం దుకు దోహదపడుతుంది’ అని అంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉంటున్న తన జీవిత భాగస్వామిని వైబర్ ద్వారా సంభ్రమాశ్చర్యాలకు గురిచేయాలనేది ప్రియ ఆలోచన. తక్షణమే సందేశం ఇదే విషయమై వైబర్ ఇండియా కంట్రీ మేనేజర్ అనుభవ్ నయ్యర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లో నివసించేవారికి త క్షణమే సందేశాన్ని చేరవేసేందుకు వైబర్ దోహదపడుతుందన్నారు. ‘నా స్నేహితుల్లో ఒకడు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నాడు. ఈ-మెయిల్స్, చాట్లకంటే వైబర్నే ఇప్పుడు అతను అత్యధికంగా వినియోగిస్తున్నాడు. తనంటే ఇష్టపడేవారితో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తున్నాడు. వైబర్ యాప్ అందుబాటులోకి వచ్చాక సమాచారం చేరవేత అత్యంత సులభతరంగా మారిపోయింది. మొబైళ్లతోపాటు డెస్క్టాప్లద్వారా నిరంతరం అందరితోనూ సంబంధాలను కొనసాగించడం అత్యంత సులువైపోయింది’ అని అన్నారు. ఇదిలాఉంచితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన కపుల్ అనే యాప్ సుదూర బంధాలను అత్యంత చేరువ చేసింది. శుక్రవారం వాలెంటైన్స్ డే జరగనుంది. -
ఇంటర్నెట్ లేని మొబైల్లో ట్విట్టర్!
న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ట్విటర్.. ఇకపై ఇంటర్నెట్ సదుపాయంలేని మొబైల్స్‌లో కూడా అందుబాటులోకి రానుంది. దేశీయంగా దాదాపు 70 కోట్ల మంది సాధారణ మొబైల్ ఫోన్ యూజర్లు, అదేవిధంగా వర్ధమాన దేశాల్లో 80 శాతం వినియోగదారులకు ట్విటర్ యోగం లభించనుంది. సింగపూర్‌కు చెందిన యుటోపియా అనే మొబైల్ సొల్యూషన్ల సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం తాను రూపొందించిన ‘ఫోన్‌ట్విష్’ అనే ఒక ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్(యాప్)ను ఈ సంస్థ యూజర్లకు అందించనుంది. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య ఈ యాప్‌ను ట్విటర్ యాక్సెస్ కోసం అందుబాటులో ఉంచనున్నట్లు యుటోపియా మొబైల్ సీఈఓ సుమేష్ మీనన్ వెల్లడించారు. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా(యూఎస్ఎస్డీ) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినాకూడా ఎవరైనా ట్విటర్‌ను వాడొచ్చని ఆయన చెప్పారు. సాధారణంగా టెలికం ఆపరేటర్లు యూజర్లకు డేటా సంబంధఅలర్ట్ మెసేజ్‌లను పంపేందుకు, అదేవిధంగా ప్రీ-పెయిడ్ కాల్‌బ్యాక్ సేవలు, లొకేషన్ ఆధారిత కంటెంట్ సేవలు, మెనూ ఆధారిత సమాచార సేవలకు ఈ యూఎస్ఎస్డీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తాయి. కాగా, ఫేస్బుక్, గూగుల్ టాక్‌లు కూడా ఇదే అప్లికేషన్‌తో ఇప్పటికే మొబైల్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. తమ ఫోన్‌ట్విష్ సేవలు అంతర్జాతీయంగా లభ్యమవుతున్నాయని దీనిద్వారా చాలా చౌకగా సాధారణ మొబైల్స్‌లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వెబ్సైట్లను యాక్సెస్ చేసేందుకు వీలవుతుందని మీనన్ పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 1.1 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఫోన్‌ట్విష్ ద్వారా ఫేస్బుక్, గూగుల్ టాక్‌లను ఉపయోగిస్తున్నారని కూడా ఆయన తెలిపారు. -
ట్రాఫిక్ ఇక్కట్లకు ‘యాప్’తో చెక్
సాక్షి, ముంబై: ఠాణే, ముంబై, నవీముంబై పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గమ్యానికి ఎప్పుడు చేరతామో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి నగరవాసులను గట్టెక్కించేందుకు ఠాణే రవాణాశాఖ ఓ మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఫోన్ వినియోగదారులు ఈ అప్లికేషన్‌ను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటే ముంబై, నవీముంబై, ఠాణేలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. ఠాణే పోలీస్ కమిషనర్ కె.పి. రఘువంశీ చేతుల మీదుగా ఈ సేవలను ప్రారంభించారు. ‘ట్రాఫ్‌లైన్’అనే ఈ మోబైల్ అప్లికేషన్‌ను బ్లాక్బెర్రీతోపాటు, ఆండ్రాయిడ్, ఐఫోన్ మోబైల్ ఫోన్లలో సులువుగా వినియోగించుకోవచ్చు. ఠాణే నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ముంబై, నవీముంబై పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని సార్లు ట్రాఫిక్ సమస్య కారణంగా మధ్యలోనే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి. అయితే ఈ అప్లికేషన్‌ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటే ట్రాఫిక్ పరిస్థితి ఏమిటనేది ముందుగానే తెలుస్తుంది. తద్వారా గంటల తరబడి అందులో చిక్కుకోవాల్సిన అవసరముండదు. సమయంతో పాటు ఇంధనం కూడా పొదుపవుతుంది. ఈ అప్లికేషన్లో మ్యాప్, ట్రాఫిక్ అలర్ట్ సూచన, గమ్యస్థానానికి చేరుకునేందుకు గెడైన్స్, అలాగే గమ్యస్థానానికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందనే సమాచారం కూడా పొందవచ్చు. అప్లికేషన్‌తోపాటు వెబ్సైట్ సౌకర్యం కూడా కల్పించినట్లు డీసీపీ శ్రీకాంత్ పరోపకారి తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా www.traffline.com వెబ్‌సైట్‌పై కూడా ట్రాఫిక్ సంబంధించిన పూర్తి సమాచారం పొందవచ్చన్నారు.