ముంబై: దూరపు సంబంధాలను కొనసాగించడం అంత తేలికైన విషయమేమీ కాదనేది బహిరంగ రహస్యమే. మొబైల్ అప్లికేషన్స్.. టూకీగా యాప్స్ అందుబాటులోకి వచ్చాక దూరమనే మాటకు అర్థమే లేకుండాపోయింది. ఇంకా చెప్పాలంటే దూరం అనేది ఇప్పుడు బాగా దగ్గరైపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ విషయాన్ని అంతా మరచిపోయారు కూడా. జేబుకు కొంచెం కూడా చిల్లుపడకుండానే అంతా సంతోషంగా కాలం గడిపేస్తున్నారు.
అందరితోనూ బంధాలను కొనసాగిస్తున్నారు. ఒకరికొకరు దూరంగా ఉంటున్న దంపతులు సైతం స్కైప్, వైబర్, వాట్స్ అప్ వంటి వాటిపై విపరీతంగా ఆధార పడుతున్నారు. ఈ యాప్స్‌ద్వారా ఒకరితో మరొకరు నిరంతరం అనుసంధానమవుతున్నారు. పరిస్థితుల కారణంగా ఎంతోదూరంగా ఉంటున్నప్పటికీ కలిసే ఉంటున్నామనే భావన వారిని ఆనంద తీరాలకు చేరుస్తోంది. ఇటీవల పెళ్లయిన నగరానికి చెందిన అక్షితా జైన్ ఈ విషయమై మాట్లాడుతూ ‘సందేశాలు పంపడం, వీడియో కాలింగ్, ఫొటోస్ షేరింగ్ వంటి వాటి వల్ల మేమిరువురం నిరంతరం ఒకరి పక్కన మరొకరు ఉన్నామనే భావన కలుగుతోంది.
ఈ భావన సంతోషంగా జీవించేందుకు దోహదపడుతోంది. అత్యంత చేరువలో ఉన్నట్టు అనిపిస్తోంది. రెండు వేర్వేరు నగరాల్లో విధి నిర్వహణలో ఉన్నప్పటికీ ఈ యాప్స్ వల్ల మేమిరువురం పక్కపక్కనే ఉన్నామనే భావనను కలిగిస్తున్నాయి. మా ఇద్దరి మధ్య అనుబంధాన్ని తేలికపరిచింది’ అంది. నగరానికి చెందిన మరో యువతి షాలినీ ఝా గుజరాత్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడిపోయింది. వీరిరువురు నిరంతరం ఈ యాప్స్‌ద్వారా ప్రేమమాధుర్యాన్ని పంచుకుంటున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నా ఈ యాప్స్ కారణంగా వారి మధ్య దానితాలూకూ ఇబ్బందేమీ ఎదురుకావడం లేదు.
‘మేమిరువురం స్కైప్ యాప్‌ని బాగా వినియోగిస్తాం. మాట్లాడుకున్నా లేదా పోట్లాడుకున్నా సమస్తం అందులోనే. రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటలపాటు మాట్లాడుకుంటూనే ఉంటాం. మా జేబులకు పెద్దగా చిల్లు పడదు. మొబైల్‌ను రీచార్జ్ చేయలేదని దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. సుదీర్ఘ సంభాషణలు, అత్యంత తక్కువ ఖర్చు. ఈ కారణంగానే మేము స్కైప్ యాప్‌ని బాగా వినియోగిస్తాం’ అంటూ తన ఆనందాన్ని మాటల రూపంలో వ్యక్తంచేసింది.
స్కైప్ అనే యాప్... వీడియో కాల్ చేసుకునేందుకు, వైబర్ అనే యాప్ అంతర్జాతీయ కాల్స్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక వాట్స్ అప్‌లో అయితే సందేశాలను పంపుకోవడంతోపాటు చిత్రాలను పంచుకోవ చ్చు కూడా. ఐ ఫోన్, ఆండ్రాయిడ్, ఐ ప్యాడ్, బ్లాక్ బెర్రీ ఫోన్‌లు వైబర్ యాప్‌ను వినియోగించుకునేందుకు వీలవుతాయి. దీంతోపాటు నోకియా విండోస్ వంటి మొబైళ్లకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది.
ఎంతో ఉపయుక్తం
యాప్స్ విషయమై నగరానికి చెందిన ప్రియాసూద్ మాట్లాడుతూ ‘తాజాగా మార్కెట్‌లోకి వస్తున్న మొబైల్ యాప్స్... ప్రేమికులు, దంపతులకు ఎంతో అనువుగా ఉంటాయి. విపరీతమైన పనిభారంలో మునిగిపోయి ఉన్నప్పటికీ వాట్స్ అప్ ద్వా రా ఓ స్మైల్ ఐకాన్‌ను పంపవచ్చు. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇదొక మంచి ఆయుధం మాదిరిగా పనిచేస్తుంది. సత్సంబంధాలను కొనసాగించేం దుకు దోహదపడుతుంది’ అని అంది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉంటున్న తన జీవిత భాగస్వామిని వైబర్ ద్వారా సంభ్రమాశ్చర్యాలకు గురిచేయాలనేది ప్రియ ఆలోచన.
తక్షణమే సందేశం
ఇదే విషయమై వైబర్ ఇండియా కంట్రీ మేనేజర్ అనుభవ్ నయ్యర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లో నివసించేవారికి త క్షణమే సందేశాన్ని చేరవేసేందుకు వైబర్ దోహదపడుతుందన్నారు. ‘నా స్నేహితుల్లో ఒకడు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నాడు. ఈ-మెయిల్స్, చాట్‌లకంటే వైబర్‌నే ఇప్పుడు అతను అత్యధికంగా వినియోగిస్తున్నాడు. తనంటే ఇష్టపడేవారితో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తున్నాడు. వైబర్ యాప్ అందుబాటులోకి వచ్చాక సమాచారం చేరవేత అత్యంత సులభతరంగా మారిపోయింది.
మొబైళ్లతోపాటు డెస్క్‌టాప్‌లద్వారా నిరంతరం అందరితోనూ సంబంధాలను కొనసాగించడం అత్యంత సులువైపోయింది’ అని అన్నారు. ఇదిలాఉంచితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన కపుల్ అనే యాప్ సుదూర బంధాలను అత్యంత చేరువ చేసింది. శుక్రవారం వాలెంటైన్స్ డే జరగనుంది.
14న వాలెంటైన్స్ డే... ‘యాప్స్’తో ‘గ్యాప్స్’ దూరం
Published Thu, Feb 13 2014 10:59 PM | Last Updated on Fri, Jul 27 2018 1:11 PM
Advertisement