భారత్‌లో సగం సమయం యాప్స్‌కే!
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌ను ఉపయోగించిన సమయంలో సగం సమయాన్ని యాప్స్(అప్లికేషన్స్)కే కేటాయిస్తున్నారట. ఫోన్‌ను వాడుతున్నప్పుడు 47 శాతం సమయం వాట్స్‌యాప్, వీ చాట్, హైక్, స్కైప్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌పైనే గడుపుతున్నారట. స్వీడిష్ టెలికం కంపెనీ ‘ఎరిక్‌సన్’ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో 7,500 మందితో పాటు జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు.
స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న భారతీయులు ఎక్కువగా వాయిస్, ఇన్‌స్టంట్ మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్(స్కైప్ వంటివి), ఈ-మెయిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్(ఫేస్‌బుక్ వంటివి)పైనే దృష్టి పెడుతున్నారని ఈ సర్వేలో తేలింది. అదేవిధంగా కమ్యూనికేషన్ యాప్స్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచేందుకు గాను మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ వినియోగం మీద యూజర్లు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, భారత్ లలో కలిపి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 30 శాతం సమయాన్ని కమ్యూనికేషన్ యాప్స్‌పైనే కేటాయిస్తున్నారు.