పాలు, పండ్లు మొదలు గులాబీల దాకా నిమిషాల్లో కస్టమర్ల వద్దకు చేరుస్తున్న డెలివరీ యాప్ సంస్థలు
అమెరికాలో కంటే కూడా భారత్‌లోనే ఎక్కువ వేగంగా సరుకుల చేరవేత
సంప్రదాయ కిరాణా దుకాణాలు, వీధి చివరలోని షాపులకు తప్పని పోటీ
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా కంటే కూడా భారత్‌లో వివిధ డెలివరీ యాప్‌లు వేగంగా కస్టమర్లను చేరుకుని సంచలనం సృష్టిస్తున్నాయి. యూఎస్‌లోని డెలివరీ దిగ్గజ కంపెనీలు యాప్‌లపై ఆర్డర్ అందుకున్నాక లొకేషన్ ఆధారంగా అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేస్తున్నట్టు వెల్లడైంది. అందుకు భిన్నంగా మన దేశంలో ‘క్విక్ సర్వీస్’అనేది నాణ్యమైన సేవకు గీటురాయిగా మారింది.
స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ వంటి యాప్‌లు...చిన్న చిన్న నిత్యావసరాలను సైతం అత్యంత వేగంగా వినియోగదారుల ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో మనదేశంలో... ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకున్నాక అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్న ఔట్‌లెట్ల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకుని కస్టమర్లకు చేర్చేవారు. ఐతే గత దశాబ్దకాలంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటి ద్వారా ఈ–కామర్స్ ఒక్కసారిగా పుంజుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో భారత్‌లో వేగంగా నిత్యావసర సరుకులు అందించే డెలివరీ సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్‌పై అధిక నమ్మకాలు పెట్టుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌సంస్థలు ఉనికిలో నిలిచేందుకు కష్టపడుతుంటే, అదేకోవలోని భారత్ మార్కెట్ మాత్రం అంతకంతకు వృద్ది చెందుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 లాక్‌డౌన్‌తో... ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ డెలివరీ స్టార్టప్‌లు పెరగగా..ఆ తర్వాత కొన్నిదేశాల్లో షాపులకు వెళ్లి వస్తువులు కొనుక్కునేందుకు మొగ్గుచూపడంతో అవి వెనకడుగు వేయక తప్పలేదు. భారత్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్టప్‌లు మరింత వృద్ది చెందడంతో పాటు సేవలో వేగం, నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టడం గమనార్హం.
పచారీ కొట్లకు తప్పని పోటీ
ఇప్పుడు డెలివరీ యాప్‌లు వేగం పుంజుకోవడంతో...పది నిమిషాల్లోనే కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులు చేరవేయడం అనే దాన్ని ఈ సంస్ధలు ఒక అలవాటుగా మార్చుకుంటున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేశాక పదినిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలను డెలివరీ ఏజెంట్లు అందజేయడాన్ని కూడా సెకన్ల వారీగా ట్రాక్ చేస్తుండటం విశేషం. ఆన్‌లైన్‌లో ఆర్డర్లను అందించే క్రమంలో ఏ కారణంచేతనైనా ఏజెంట్లు నెమ్మదిస్తే వారి ఫోన్లలో ‘ఎరుపు ఫ్లాష్’ద్వారా హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి.
దేశంలోని వివిధ డెలివరీ యాప్‌ల ద్వారా పాలు, పండ్లు మొదలు గులాబీల దాకా నిమిషాల వ్యవధిలోనే కస్టమర్ల వద్దకు చేరేలా సర్వీసులు అందిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పలు రకాల నిత్యావసరాలకు ఆర్డర్ అందగానే పది నిమిషాల్లో ఇళ్లకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సరుకులను నిమిషాల్లో డెలివరీ చేసే యాప్‌లు పచారీ కొట్లకు సవాల్‌గా మారాయి. సంప్రదాయ కిరాణా దుకాణాలు, వీధి చివర్లలోని షాపులకు గట్టి పోటీ తప్పడం లేదు.
మనదేశంలోని వివిధ వర్గాల ప్రజలు... తమ ఇళ్లకు దగ్గరలోని షాపుల నుంచి బియ్యం, పప్పులు, ఇతర వస్తువులను తెచ్చుకోవడమో లేదా ఫోన్‌లో ఆర్డర్ చేసే ఆ దుకాణాల్లో పనిచేసే వారు ఇళ్లకు చేరవేయడమో చేస్తూ వచ్చారు. ఇప్పుడు డెలివరీ యాప్‌ల యుగంలో...రోజువారీ అవసరాలకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులను సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి నిమిషాల్లోని ఇంటి గుమ్మం వద్దకు తెప్పించుకుంటున్నారు. స్విగ్గీలో ఐతే ఒకేఒక మామిడిపండును ఆర్డర్ చేసినా దానిని కూడా కస్టమర్‌కు డెలివరీ చేస్తోంది.
వేగం, కచ్చితత్వం
గత ఏప్రిల్‌లో భారత్‌లోని ఆన్‌లైన్ సరుకుల మార్కెట్, క్విక్ డెలివరీని గోల్డ్‌మాన్ సాక్స్ విశ్లేíÙంచినపుడు... ప్రస్తుతం భారత్ ఆన్‌లైన్ సరుకుల మార్కెట్ 11 బిలియన్ డాలర్లుగా నిలుస్తుండగా వాటిలో క్విక్ డెలివరీ మార్కెట్ 5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా తేలింది. ఆన్‌లైన్ కస్టమర్ల ప్రాధాన్యతలకు తగ్గట్టుగా సరుకులను చేరవేయడంలో వేగం, కచ్చితత్వం పెరుగుదలతో 2030 కల్లా 60 బిలియన్ డాలర్లుగా చేరుకుని ఆన్‌లైన్ గ్రాసరీ మార్కెట్‌లో క్విక్ కామర్స్ 70 శాతంగా నిలుస్తుందని ఈ సంస్ధ అంచనా వేస్తోంది.
దేశవ్యాప్తంగా 1.30 కోట్ల నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు, షాపులు ఉండగా, వీటికి సంబంధించిన రిటైల్ అసోసియేషన్ల అంచనాల ప్రకారం... క్విక్ కామర్స్‌యాప్‌ల ద్వారా అమ్మకాలు తగ్గుదల పుంజుకోవడంతో... వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల వారీగా చూస్తే సంప్రదాయ దుకాణాల్లో పది నుంచి 60 శాతం దాకా అమ్మకాలు నమోదైనట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment