గ్రూప్‌–1 మెయిన్స్‌ టాపర్లు మహిళలే.. | TGPSC releases Group 1 Mains 2024 general ranking list and marks | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 మెయిన్స్‌ టాపర్లు మహిళలే..

Published Mon, Mar 31 2025 6:20 AM | Last Updated on Mon, Mar 31 2025 6:22 AM

TGPSC releases Group 1 Mains 2024 general ranking list and marks

జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ 

మల్టీజోన్‌–2లో టాప్‌ స్కోర్‌ 550 మార్కులు 

మల్టీజోన్‌–1లో టాప్‌ స్కోర్‌ 532.5 మార్కులు 

అతి త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల 

ఆ తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రస్థాయి సివిల్‌ సర్విసు కొలువులుగా భావించే గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అర్హత పరీక్షల ఫలితాల్లో మహిళలు టాపర్లుగా నిలిచారు. మల్టీజోన్‌–1, మల్టీజోన్‌–2 రెండుచోట్లా టాప్‌ ర్యాంకులను మహిళా అభ్యర్థులే సాధించారు. మల్టీజోన్‌–2లో టాప్‌ స్కోర్‌ 550 మార్కులు కాగా.. మల్టీజోన్‌–1లో 532.5 మార్కులు టాప్‌ స్కోర్‌గా ఉన్నాయి. గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ ఆదివారం విడుదల చేసింది. ఉగాది పండుగ సందర్భంగా అభ్యర్థులకు తీపికబురు అందించే ఉద్దేశంతో తెలుగు నూతన సంవత్సరం తొలి రోజున జీఆర్‌ఎల్‌ను విడుదల చేసినట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి.  

జనరల్‌ ఇంగ్లిష్‌లో అర్హత సాధించిన వారే జాబితాలో.. 
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 4,03,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూన్‌ 9న  ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. జూలై 7వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి 31383 మందిని మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేసింది. మెయిన్స్‌ పరీక్షలు గతేడాది అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు నిర్వహించింది.

మొత్తం 31,403 మంది పరీక్షలకు హాజరు కాగా.. 21,093 మంది మాత్రమే మొత్తం 7 పేపర్లూ రాశారు. ఈ నెల 10న అభ్యర్థుల ప్రొవిజినల్‌ మార్కుల జాబితాను కమిషన్‌ విడుదల చేయగా..మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు కమిషన్‌ అవకాశం కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ఏడు పేపర్లలో సాధించిన మొత్తం మార్కుల వివరాలతో కూడిన జీఆర్‌ఎల్‌ను కమిషన్‌ తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది. జనరల్‌ ఇంగ్లీ‹Ùలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాలో ఉన్నారు. 

అభ్యర్థి లాగిన్‌లో మార్కుల మెమోలు 
పేపర్ల వారీగా అభ్యర్థుల మార్కులను కమిషన్‌ విడుదల చేసింది. అభ్యర్థుల లాగిన్‌లో మెమోలు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారి టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీల ద్వారా లాగిన్‌ అయ్యాక పేజీని తెరిచి మెమోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మెమోలు ఏప్రిల్‌ 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని కమిషన్‌ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే జీఆర్‌ఎల్‌ ఏప్రిల్‌ 28వ తేదీ వరకు నెలరోజుల పాటు అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రస్తుతం విడుదల చేసిన జీఆర్‌ఎల్‌ ఆధారంగా త్వరలో 1:2 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయనున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

అలాఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టిన తర్వాత తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. అభ్యర్థులు అన్నిరకాల ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు అనెక్జర్‌–6 ప్రకారం నిర్దేశించిన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇలావుండగా హైకోర్టు ఆదేశాలతో మెయిన్స్‌ పరీక్షలు రాసిన అభ్యర్థుల (స్పోర్ట్స్‌ కోటా విషయంలో 20 మంది కోర్టును ఆశ్రయించారు) వివరాలను విడుదల చేయలేదు. లాగిన్‌ విషయంలో అభ్యర్థులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే కమిషన్‌ టెక్నికల్‌ డెస్‌్కను 040–23542185, 040–23542187 ఫోన్‌ నంబర్లలో లేదా ‘హెల్ప్‌డెస్‌్క(ఎట్‌)టీఎస్‌పీఎస్సీ.జీఓవీ.ఇన్‌’లో సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. 

ఐఏఎస్‌ నా కల.. 
నల్లగొండ: గ్రూప్‌ –1 ఫలితాల్లో నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ 2వ ర్యాంకు సాధించాడు. టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్‌లలో దాది వెంకటరమణ (హాల్‌ టికెట్‌ నంబర్‌ 240920349) 535.5 మార్కులు సాధించాడు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరమణ తల్లి దాది రమాదేవి ప్రధానోపాధ్యాయురాలిగా, తండ్రి శ్రీనివాసరావు ఆర్‌డబ్ల్యూఎస్‌లో కాంట్రాక్టు ఏఈగా పని చేస్తున్నారు. వీరి స్వస్థలం సూర్యాపేట. ఉద్యోగరీత్యా నల్లగొండలోని బృందావన్‌ కాలనీలో స్థిరపడ్డారు.

ఐదు సంవత్సరాలుగా వెంకటరమణ సివిల్స్‌కు ప్రిపేరవుతూ గ్రూప్‌–1లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. వెంకటరమణ ఇటీవల విడుదలైన జూనియర్‌ లెక్చరర్, డివిజనల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు కూడా సాధించడంతో పాటు గ్రూప్‌–2లో 378వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఐఏఎస్‌ కావాలన్నది తన ఆశయమని, అయితే గ్రూప్‌–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు సాధించానని చెప్పాడు. భవిష్యత్‌లో ఐఏఎస్‌ కల నెరవేర్చుకుంటానని తెలిపాడు. అమ్మానాన్నల సహకారంతో విజయం సాధించానని పేర్కొన్నాడు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తా.. 
శాయంపేట/హనుమకొండ: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌ (మాందారిపేట) గ్రామానికి చెందిన జిన్నా తేజస్వినిరెడ్డి గ్రూప్‌–1 ఫలితాల్లో స్టేట్‌ 4వ ర్యాంకు సాధించింది. తేజస్విని తల్లిదండ్రులు జిన్నా హేమలత, విజయపాల్‌రెడ్డి ప్రస్తుతం హనుమకొండ విద్యానగర్‌లో ఉంటున్నారు. తేజస్వినిరెడ్డి మల్జీజోన్‌–1లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. ఆమె 2019 మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–2లో మండల పంచాయతీ అధికారిగా ఉద్యోగం సాధించింది.

మొదటి పోస్టింగ్‌ నేలకొండపల్లి, రెండవ పోస్టింగ్‌ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తున్నది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌–1కు సన్నద్ధమైంది. ‘నేను సివిల్‌ సర్విసెస్‌లో చేరాలన్నది తాత కోరిక. అది నెరవేర్చడానికి కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్‌–1లో స్టేట్‌ 4వ ర్యాంకు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. నాకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం వస్తుంది. ఆ హోదాలో ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూడవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడమే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తాను’అని తేజస్వినిరెడ్డి తెలిపారు.  

అమ్మమ్మ, తాతయ్యకు అంకితం.. 
మిర్యాలగూడ: గ్రూప్‌–1 ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పూనాటి హర్షవర్ధన్‌ (హాల్‌టికెట్‌ నంబర్‌ 240911138) 525.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాజ్యలక్ష్మి, తిరుపతిరావుల కుమారుడైన హర్షవర్ధన్‌ పదో తరగతిలో 568 మార్కులు, ఇంటర్‌లో 972 మార్కులు సాధించాడు. అనంతరం బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి రూ.27 లక్షల వార్షిక వేతనంతో అమెజాన్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేశాడు. అనంతరం యూపీఎస్సీ సివిల్‌ సర్విసెస్‌ కోసం ఢిల్లీ వెళ్లి నాలుగేళ్ల శిక్షణ తీసుకున్నాడు.

గత సంవత్సరం తిరిగి హైదరాబాద్‌కు వచ్చి గ్రూప్‌–1 కోసం సన్నద్ధమై పరీక్షలో సత్తాచాటి రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. హర్షవర్ధన్‌ తల్లి గృహిణి, తండ్రి బియ్యం వ్యాపారి. హర్షవర్ధన్‌ తమ్ముడు అమెరికాలో చదువుతున్నాడు. కష్టపడి చదివి గ్రూప్‌–1లో ర్యాంకు సాధించానని.. ఈ విజయాన్ని తన అమ్మమ్మ జంపాల నర్సమాంబ, తాతయ్య కొండయ్యకు అంకితం ఇస్తున్నట్లు హర్షవర్ధన్‌ తెలిపాడు.  

ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు..
మీర్‌పేట: ఆదివారం వెలువడిన గ్రూప్‌–1 ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మున్సిపల్‌ పరిధిలోని జిల్లెలగూడకు చెందిన సిద్ధాల లావణ్య, బీరప్పల కుమార్తె కృతిక రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన ప్రిపరేషన్‌ గురించి వివరించింది. ‘మొదట సివిల్స్‌కు సిద్ధం అయ్యాను. నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ మంచి ర్యాంకు రాలేదు. దీంతో 2022లో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ రావడంతో అప్పటి నుంచి చదవడం ప్రారంభించాను. రోజులో ఇన్ని గంటలు చదవాలన్న నిబంధన పెట్టుకోకుండా ఒక చాప్టర్‌ పూర్తిగా చదవాలని అనుకుని ఎన్ని గంటలైనా చదివి పూర్తి చేశాను. 

పరీక్షలు దగ్గరపడుతున్నప్పుడు మాత్రం రోజులో 10 నుంచి 12 గంటలు చదివాను’అని తెలిపారు. తాను ఎక్కడా శిక్షణ తీసుకోలేదని, ఆన్‌లైన్‌ కోర్సులు కొనుగోలు చేసి చదివినట్లు వెల్లడించింది. సివిల్స్‌ ప్రిపరేషన్‌ గ్రూప్‌–1లో మంచి ర్యాంకు సాధించేందుకు ఉపయోగపడిందని తెలిపింది. ఆమె గ్రూప్‌–4లో 511వ ర్యాంకు సాధించింది. కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా కూడా ఉద్యోగం సాధించి జనవరి నుంచి విధులు నిర్వహిస్తోంది. తనకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం వస్తుందని తెలిపింది. కృతిక తల్లి లావణ్య గతంలో సరూర్‌నగర్‌ మండల ఎంపీపీగా, మీర్‌పేట కార్పొరేటర్‌గా పనిచేశారు.  

నానమ్మ కష్టం వృథా కానివ్వలేదు..
ఏటూరునాగారం: ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బిడ్డను.. దివ్యాంగురాలైన నానమ్మ అన్నీ తానే అయ్యి సాకింది. ఆమె కష్టాన్ని ఆ బిడ్డ వృథా కానివ్వలేదు. కటిక పేదరికం ఎన్ని అవరోధాలు సృష్టించినా మొక్కవోని దీక్షతో చదివి గ్రూప్‌–1 ఫలితాల్లో స్టేట్‌ 105వ ర్యాంకు సాధించాడు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్‌ తన నానమ్మ రుణం ఇలా తీర్చుకున్నాడు.  

కష్టాలనే విజయంగా మార్చుకొని.. 
ప్రవీణ్‌కుమార్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు సమ్మయ్య, రజిత అనారోగ్యంతో మరణించారు. దీంతో నానమ్మ ఎల్లమ్మ అతడిని పెంచి పెద్ద చేసింది. స్వగ్రామంలో సఫాయి కార్మికురాలిగా పనిచేస్తూ మనవడిని చదివించింది. ప్రవీణ్‌ ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పూర్తి చేశాడు. ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటీలో 2019లో బీటెక్‌ పూర్తి చేశాడు. 

‘గ్రూప్‌–1 ఆఫీసర్‌ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రిపేర్‌ అయ్యాను. ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. డీఎస్పీ హోదా కలిగిన ఉద్యోగం వస్తుంది’అని ప్రవీణ్‌కుమార్‌ సంతోషం వ్యక్తంచేశాడు. ‘నా కొడుకు, కోడలు లేనందుకు మనవడికి గొప్ప ఉద్యోగం రావడం గర్వంగా ఉంది. నాకు రెండు కాళ్లు లేకున్నా గ్రామ పంచాయతీలో సఫాయిగా పనిచేసి పెద్దచేసిన. ఇప్పుడు గొప్ప స్థాయికి పోయిండు. ఎంతో ఆనందంగా ఉంది’అంటూ ఎల్లమ్మ భావోద్వేగంతో చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement