బెట్టింగ్‌ యాప్‌లపై సిట్‌ చీఫ్‌గా ఐజీ రమేష్‌ | IG Ramesh as SIT chief on betting apps | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ యాప్‌లపై సిట్‌ చీఫ్‌గా ఐజీ రమేష్‌

Published Mon, Mar 31 2025 6:36 AM | Last Updated on Mon, Mar 31 2025 6:36 AM

IG Ramesh as SIT chief on betting apps

ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ జితేందర్‌

బృందంలో మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులు

ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మీ తదితరులకు స్థానం

90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్‌) అధిపతిగా ఐజీ ఎం.రమేష్‌ పేరు ఖరారైంది. ఈ మేరకు డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ ఆదివారం ఉత్తర్వులు (ఆర్సీ నం.191/ఎల్‌ అండ్‌ ఓ–ఐ/2025) జారీ చేశారు. తొలుత ఈ బా«ధ్యతల్ని డీఐజీగా ఉన్న అభిషేక్‌ మహంతికి అప్పగించాలని భావించారు. అయితే ఆయన తెలంగాణకు కేటాయింపుపై స్పష్టత లేకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకే ఇక్కడ కొనసాగుతుండటంతో డీజీపీ కార్యాలయంలో పీ అండ్‌ ఎల్‌ విభాగం ఐజీగా ఉన్న రమేష్‌ను ఎంపిక చేశారు. 

విదేశీ లింకులతో పాటు ఇతర కీలకాంశాలతో ముడిపడిన బెట్టింగ్‌ యాప్స్‌ కేసు దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపు అభిషేక్‌ మహంతికి వ్యతిరేకంగా క్యాట్‌ ఉత్తర్వులు వస్తే ఆ ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతుందని డీజీపీ కార్యాలయం భావించింది. ఈ నేపథ్యంలోనే మరో సమర్థుడైన అధికారిగా పేరున్న రమేష్‌ను ఖరారు చేసింది. సిట్‌లో ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సీహెచ్‌ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ కె.వెంకటలక్ష్మీ, సైబరాబాద్‌లో పని చేస్తున్న అదనపు ఎస్పీ ఎస్‌.చంద్రకాంత్, సీఐడీ డీఎస్పీ ఎం.శంకర్‌ సభ్యులుగా ఉన్నారు. 

ఈ కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్‌ ఎంపిక చేసుకోనుంది. దీంతో పాటు ఆర్థిక నిపుణులు, న్యాయాధికారులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేషన్‌ నిపుణులు తదితరులను సీఐడీ అదనపు డీజీ అనుమతితో నియమించుకునే అవకాశం ఉంది. 

దర్యాప్తే కాదు..సిఫారసులూ చేయాలి
    ఈ సిట్‌ కేవలం కేసుల్ని దర్యాప్తు చేయడం మాత్రమే కాకుండా బెట్టింగ్‌ యాప్స్‌ తీరుతెన్నులు, వ్యవహారాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వీటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్స్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ, సమాచార ప్రసార, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలతో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ తదితరాల బాధ్యతలను గుర్తించాల్సి ఉంది.

ఈ యాప్స్‌ ఆర్థిక లావాదేవీలు, వాటి మార్గాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి తీసుకువెళ్లాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి అనేక అంశాలు, సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సిట్‌ 90 రోజుల్లో డీజీపీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీ కార్యాలయం కేంద్రంగానే పని చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement