
విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ఆదివారం ఉదయమే క్యాంపస్‌ను దిగ్బంధించిన పోలీసులు
జేసీబీలతో ప్రహరీ లోపలి ప్రాంతాలను చదునుచేసే యత్నం
నిరసనకు దిగిన విద్యార్థులు.. అడ్డుకున్న పోలీసులు
52 మంది విద్యార్థులు అరెస్ట్.. వివిధ పీఎస్‌లకు తరలింపు
మహిళలనూ ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసిన వైనం
వర్సిటీ భూములు ప్రైవేటుకు విక్రయంపై కొనసాగుతున్న నిరసన
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉగాది రోజున జేసీబీలతో వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి భూములను చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి వందలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో అందరినీ ఈడ్చుకెళ్లి లారీల్లో పడేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
అరుపులు.. కేకలు.. అరెస్టులు
ఆదివారం సెలవు దినం, ఉగాది పర్వదినం కూడా కావటంతో క్యాంపస్‌లో ఉదయం వాతావరణం ప్రశాంతంగానే మొదలైంది. కొద్ది సేపటికే పోలీసులు తండోప తండాలుగా వచ్చి క్యాంపస్‌లోని అన్ని అంతర్గత రోడ్లను ఆ«దీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వర్సిటీ ప్రహరీ లోపలి భూములను జేసీబీలతో చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసిన విద్యార్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు.
దీంతో పోలీసులకు, విద్యార్థులకు తోపులా జరిగింది. విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు ఏమాత్రం ఉపేక్షించకుండా కనిపించిన విద్యార్థిని కనిపించినట్లే వాహనాల్లోకి ఎక్కించి మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులను కూడా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పక్కా ప్రణాళికతో
హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగాక్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం కూడా పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నట్లు ఆదివారం నాటి ఘటనను బట్టి తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచే పోలీసులు క్యాంపస్‌లో కొద్దిమొత్తంలో మకాం వేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా చాలామంది విద్యార్థులు స్వగృహాలకు వెళ్లే అవకాశం ఉందని గురించి క్యాంపస్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
క్యాంపస్‌లోకి బయటి వారు రాకుండా ముందు జాగ్రత్తగా మెయిన్ గేటుకు తాళం వేశారు. లోపలివారిని బయటకు కూడా వెళ్లనీయలేదు. శనివారం రాత్రే విద్యార్థులకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో చాలామంది గాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేని«విధంగా హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.