
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు.
అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్‌ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.
మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు.
ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి.
అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్‌లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి.
కానీ ట్రంప్‌కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్‌లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్‌కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.
సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు.

ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్‌లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండా అఫ్గాన్‌కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్‌కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం!
మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment